International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part VI
బ్రిటన్ పార్లమెంట్ వద్ద మహాత్ముడి విగ్రహం
* మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని 2015 మార్చి 14న లండన్‌లోని బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించారు.
* స్వాతంత్య్రం కోసం ఏ దేశంపై ఆ మహాత్ముడు పోరాడారో ఆ దేశ పార్లమెంటు వద్దే ఆయన విగ్రహం ఏర్పాటు కావడం విశేషం.
* 9 అడుగుల పొడవైన ఈ కాంస్య విగ్రహాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సంయుక్తంగా ఆవిష్కరించారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
* బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్‌లో ఏర్పాటైన తొలి భారతీయుడి విగ్రహం గాంధీదే. ఎలాంటి అధికారిక హోదా నిర్వహించని వ్యక్తికి ఈ గౌరవం దక్కడం కూడా ఇదే మొదటిసారి.
* జాతి వివక్షపై పోరాడిన నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా లాంటి దిగ్గజాల విగ్రహాల సరసన గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ విగ్రహం కూడా ఆ పక్కనే ఉండటం విశేషం. చర్చిల్ గాంధీని తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఆయన్ను ‘అర్ధ నగ్న ఫకీర్’గా అభివర్ణించేవారు. 1931లో గాంధీ చివరిసారిగా లండన్‌ను సందర్శించారు. అక్కడి చలిని తట్టుకోవడానికి శాలువాను కప్పుకున్నప్పటి దృశ్యాన్ని ఈ విగ్రహంలో పొందుపరిచారు. విగ్రహ రూపశిల్పి ఫిలిప్ గిక్సన్.
ప్రపంచ సంపన్నులు
* 2015 సంవత్సరానికి ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ ధనవంతుల జాబితాలో 7,920 కోట్ల డాలర్లతో బిల్‌గేట్స్ ప్రథమస్థానంలో నిలిచారు. గత 21 ఏళ్లలో గేట్స్‌కు ప్రథమ స్థానం రావడం ఇది 16వసారి.
* ఫోర్బ్స్ ఏటా విడుదల చేస్తున్న ధనవంతుల జాబితాల్లో ఇది 29వది. ప్రపంచ సంపన్నుల్లో కార్లోస్ స్లిమ్ (మెక్సికో – 7,710 కోట్ల డాలర్లు), వారెన్ బఫెట్ (అమెరికా – 7,270 కోట్ల డాలర్లు)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
* 2015 ప్రపంచ ధనవంతుల జాబితాలో మొత్తం 1,826 మంది చోటు దక్కించుకున్నారు. వీరి మొత్తం నికర సంపద 7,05,000 కోట్ల డాలర్లుగా ఉంది. వీరిలో 197 మంది మహిళలున్నారు. వాల్‌మార్ట్‌లో వాటా ఉన్న క్రిస్టీవాల్టన్ మహిళల్లో ప్రథమస్థానంలో నిలిచారు.
* ఫోర్బ్స్ జాబితా ప్రకారం 2015కు అత్యంత సంపన్న భారతీయుడిగా సన్‌ఫార్మా గ్రూప్ అధినేత దిలీప్ సంఘ్వి (2,150 కోట్ల డాలర్లు) నిలిచారు. రెండో స్థానంలో ముకేష్ అంబానీ (2,100 కోట్ల డాలర్లు), మూడో స్థానంలో అజీమ్ ప్రేమ్‌జీ (1,910 కోట్ల డాలర్లు) నిలిచారు. ప్రపంచ ధనవంతుల్లో ఈ భారత బిలియనీర్లు ముగ్గురూ వరుసగా 37, 43, 48 స్థానాల్లో నిలిచారు.
‘సెరెస్’ కక్ష్యలో చేరిన డాన్
* అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రయోగించిన డాన్ వ్యోమనౌక మరుగుజ్జు గ్రహం సెరెస్ కక్ష్యలోకి ఇటీవల విజయవంతంగా చేరింది. ఇంతవరకూ పెద్దగా వివరాలు తెలియని ఈ ఖగోళ వస్తువు సెరిస్ గురించి విలువైన సమాచారం వెలుగులోకి తీసుకురావడంలో ఈ హ్యోమనౌక సాయపడుతుందని నాసా వెల్లడించింది. సెరెస్‌ను చేరుకోవడానికి డాన్ ఏడున్నరేళ్లపాటు 490 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
* 2011 నుంచి 2012 వరకూ డాన్, వెస్తా అనే భారీ గ్రహ శకలాన్ని శోధించింది. దాని గురించి కొత్త వివరాలు, వేల ఫొటోలను అందించింది. తాజాగా సెరెస్‌ను చేరింది. ఈ విధంగా రెండు గ్రహ వస్తువులను చేరిన మొదటి హ్యోమనౌకగా డాన్ చరిత్ర సృష్టించింది. సెరెస్, వెస్తాలు మన సౌర కుటుంబంలోని ప్రధాన గ్రహశకల వలయంలో ఉన్న భారీ ఖగోళ వస్తువులు. ఈ వలయం అంగారకుడు, గురుడు మధ్య ఉంది.
భారత్‌కు సోలార్ ఇంపల్స్-2
* ప్రపంచ పర్యటనలో ఉన్న సౌర ఇంధన తొలి విమానం సోలార్ ఇంపల్స్ (ఎస్ఐ)-2 2015 మార్చిలో అహ్మదాబాద్, వారణాసిలలో ఆగింది. పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి ప్రపంచ పర్యావరణాన్ని కాపాడటానికి తాము ఈ ప్రపంచ పర్యటన చేపట్టినట్లు ఎస్ఐ-2 రూపకర్తలు స్విట్జర్లాండ్‌కు చెందిన బెర్ట్రాండ్ పికార్డ్, ఆండ్రీ బోర్స్బెర్గ్ వెల్లడించారు. కేవలం సౌర ఇంధనాన్ని మాత్రమే వినియోగించుకుని రాత్రీపగలూ ప్రయాణించే తొలి విమానంగా ఇది వార్తల్లో నిలిచింది. కార్బన్ ఫైబర్‌తో తయారైన ఏకైక సీటు కలిగిన ఈ విమానం రెక్కల పొడవు 72 మీటర్లు. పరిమాణంలో బోయింగ్ 747 విమానం కన్నా పెద్దది. దీని బరువు 2,300 కేజీలు. ఒక కారు బరువుతో ఇది సమానం. ఈ విమానంలో మొత్తం 17,248 సోలార్ సెల్స్ రెక్కల పైభాగంలో అమర్చి ఉంటాయి. వీటి సాయంతో 633 కేజీల బరువైన లిథియం పాలీమైర్ బ్యాటరీలను సౌర ఇంధనంతో రీఛార్జి చేయడం వల్లే ఇది రాత్రిపూట కూడా నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. యూఏఈ, ఒమన్, భారత్, మయన్మార్, చైనా, జపాన్, హవాయి, అమెరికా తదితర దేశాల్లో మొత్తం 12 చోట్ల ఆగాలని రూపకర్తలు నిర్ణయించారు.
* 2015 జులైలో జపాన్ నుంచి హవాయికి ఎస్ఐ-2 పర్యటించినపుడు బ్యాటరీలో సాంకేతిక లోపం కారణంగా ఈ యాత్ర ఆగిపోయింది.
మాదిరి ప్రశ్నలు
1. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన క్రీ.శ. 1215 నాటి మాగ్నాకార్టా గ్రంథం 800 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా అందులోని నాలుగు ప్రతులను ప్రజల సందర్శనార్ధం ఇటీవల ఏ లైబ్రరీలో ఏర్పాటు చేశారు?
ఎ) బ్రిటిష్ లైబ్రరీ బి) అమెరికన్ లైబ్రరీ సి) ఫ్రెంచ్ లైబ్రరీ డి) జర్మన్ లైబ్రరీ
జ: (ఎ)
2. ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2015 విజేత ఎవరు?
ఎ) నోవాక్ జకోవిచ్ 2) ఆండీ ముర్రే సి) రఫెల్ నాదల్ డి) రోజర్ ఫెదరర్
జ: (ఎ)
3. 2015 ఫిబ్రవరిలో ఏ దేశం ఫజర్ అనే పరిశోధక ఉపగ్రహాన్ని ప్రయోగించింది?
ఎ) దక్షిణ కొరియా బి) ఇరాన్ సి) ఆస్ట్రేలియా డి) అమెరికా
జ: (బి)
4. అమెరికా వాణిజ్య విధాన, సంప్రదింపుల సలహా కమిటీ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సత్య నాదెళ్ల బి) సుందర్ పిచాయ్ సి) అజయ్ బంగా డి) శ్రీకాంత్ శ్రీనివాసన్
జ: (సి)
5. యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో మహిళలపై హింసను నివారించేందుకు వీలుగా లండన్‌లో ఓ కేంద్రాన్ని ప్రారంభించిన హాలీవుడ్ నటి ఎవరు?
ఎ) జూలియన్ మూర్ బి) కేట్ విన్స్లెట్ సి) ఏంజెలినా జోలీ డి) ఒలీవియాజేన్
జ: (సి)
6. 2015 క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న దేశం?
ఎ) ఆస్ట్రేలియా బి) న్యూజిలాండ్ సి) దక్షిణాఫ్రికా డి) ఎ, బి
జ: (డి)
7. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఐరాస ఆధ్వర్యంలోని ‘వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ బృందం’ (ఐపీసీసీ – ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్త్లెమెట్ ఛేంజ్) ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన భారతీయుడు ఎవరు?
ఎ) అనిల్ శ్రీవాస్తవ బి) రాజేంద్రకుమార్ పచౌరీ సి) సంజీవ్ భండార్కర్ డి) జగ్జీత్ కుషాల్
జ: (బి)
8. భారత్‌కు చెందిన ఆర్థిక నిపుణులు తమ దేశంలో చదువుకునేందుకు వీలు కల్పించే సరికొత్త స్కాలర్షిప్ కార్యక్రమం ‘షెవెనింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్షిప్ ప్రోగ్రాం’ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది?
ఎ) అమెరికా బి) చైనా సి) జపాన్ డి) బ్రిటన్
జ: (డి)