International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part V
రెండు దేశాలకు ఎన్నికలు జరిగాయి.. విశ్వం వయసును విడమరిచిన టెలిస్కోప్‌నకు పాతికేళ్లు నిండాయి.. ప్రపంచంలో మతాల జనాభా ఏదేశంలో ఎంతెంతో ప్రత్యేక నివేదిక వెల్లడించింది.. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు నాలుగింటిలో భారత్ చోటు దక్కించుకుంది.. దోహాలో అంతర్జాతీయ వేదికపై నల్లధనానికి సంబంధించి మనదేశం ఆందోళనలు వ్యక్తం చేసింది.. సంతోషం సగం బలం అంటారు.. ఆ సంతోషంలో మన దేశం ఎక్కడ ఉంది? ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ విశేషాల సమాహారం ఇది.
గ్రీస్‌కు రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి?
* గ్రీస్ ప్రధానిగా రెండోసారి అలెక్సిస్ సిప్రాస్ 2015, సెప్టెంబరు 21న ఎన్నికయ్యారు. ఆయన గ్రీస్‌కు 185వ ప్రధానమంత్రి.
* గ్రీస్ పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 300 స్థానాలకు అలెక్సిస్ సిప్రాస్ నేతృత్వంలోని వామపక్ష పార్టీ సిరిజా 145 స్థానాలను గెలుచుకుంది. సమీప ప్రత్యర్థి పార్టీ అయిన న్యూ డెమోక్రసీ పార్టీకి 75 స్థానాలు లభించాయి. ఈ పార్టీ నాయకుడు వాంగెలిస్ మీమరాకిస్.
* రుణ సంక్షోభం నేపథ్యంలో 2015 ఆగస్టులో సిప్రాస్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. ఆయన ఇంతకు ముందు 2015, జనవరి 26న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబరు 21న తిరిగి బాధ్యతలు చేపట్టారు.
* గ్రీస్ ప్రధానమంత్రిని ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది హెలెనిక్ రిపబ్లిక్’ అని కూడా పిలుస్తారు.
* 2015 ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 20 వరకు గ్రీస్ 184వ ప్రధానమంత్రిగా ఆ దేశ సుప్రీంకోర్టు అధ్యక్షురాలు వస్సిలికి ధనావ్ వ్యవహరించారు. దేశ చరిత్రలో ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
నైజీరియా కొత్త అధ్యక్షుడెవరు?
* 2015 మార్చి 28, 29 తేదీల్లో జరిగిన నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్మీ జనరల్ మహ్మద్ బుహారీ (72 సంవత్సరాలు) ఘన విజయం సాధించారు. అధ్యక్షుడు గుడ్‌లక్ జోనాధన్పై 25.7 లక్షల మెజారిటీతో గెలుపొందారు.
* నైజీరియాలో ప్రజాస్వామ్య పద్ధతిలో అధికార మార్పిడి జరగడం ఇదే తొలిసారి.
* 1960లో నైజీరియాకు బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దేశంలో ఆరుసార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. 1999లో సైనిక పాలన అంతమైన తర్వాత ప్రతి నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
* 2011 నుంచి గుడ్‌లక్ జోనాధన్ దేశాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఈ పార్టీ గత 16 ఏళ్లుగా పాలన సాగించింది. నూతన అధ్యక్షుడు మహ్మద్ బుహారీ పార్టీ ఆల్ ప్రోగ్రెసివ్ కాంగ్రెస్ (ఏపీసీ).
* 2015 అధ్యక్ష ఎన్నికల్లో బుహారీ – జోనాధన్ మధ్య గట్టిపోటీ నెలకొంది. బుహారీ 1.54 కోట్ల ఓట్లతో (53.96 శాతం ఓట్లు) విజయం సాధించారు. 1980ల్లో సైనిక పాలన సమయంలో 1983, డిసెంబరు 31 నుంచి 1985, ఆగస్టు 27 వరకు మహ్మద్ బుహారీ నైజీరియా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.
* ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా నైజీరియా గుర్తింపు పొందింది.
విశ్వం వయసెంత?
* విశ్వం వయసు గురించి మన అంచనాలను మెరుగుపరచడంలో సాయపడిన హబుల్ టెలిస్కోప్‌ను ప్రయోగించి 2015 ఏప్రిల్ 24కి పాతికేళ్లు పూర్తయ్యింది.
* 1990, ఏప్రిల్ 24న షటిల్ డిస్కవరీ సాయంతో హబుల్ టెలిస్కోప్‌ను ప్రయోగించారు. హబుల్ అందించిన తొలి చిత్రాలు అస్పష్టంగా ఉండటంతో 1993 డిసెంబరులో ఏడుగురు వ్యోమగాములతో కూడిన బృందం అయిదు రోజులు స్పేస్‌వాక్ నిర్వహించి హబుల్‌కు మరమ్మతులు చేసింది. దానికి ‘వైడ్ – ఫీల్డ్ ప్లానెటరీ కెమెరా-2’ను అమర్చింది. ఇది అనేక ప్రముఖ ఫొటోలను తీసింది.
విజయాలు
* విశ్వం వయసును 13.75 బిలియన్ సంవత్సరాలుగా లెక్కించడానికి హబుల్ తోడ్పడింది. దాదాపు అన్ని గెలాక్సీల్లోనూ అత్యంత భారీ కృష్ణబిలాలు ఉండొచ్చని ఇది వెల్లడించింది. గ్రహాల జనన ప్రక్రియను ఆవిష్కరించడంలో ఉపయోగపడింది.
* మన సౌరకుటుంబం వెలుపల ఉన్న ఒక గ్రహంలో సేంద్రీయ మీథేన్ అణువును తొలిసారిగా కనుక్కుంది.
* మరుగుజ్జు గ్రహం ప్లూటో చుట్టూ నాలుగు చందమామలను గుర్తించింది.
* కృష్ణశక్తికి సంబంధించిన అంతుచిక్కని రూపమొకటి విశ్వం విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు ఆధారాలను అందించింది.
హబుల్ చరిత్ర
* కక్ష్యలో టెలిస్కోప్‌లను ప్రవేశపెట్టొచ్చని జర్మన్ శాస్త్రవేత్త హెర్మాన్ ఒబెర్త్ 1923లో తొలిసారిగా ప్రతిపాదించారు.
* అంతరిక్షంలో అబ్జర్వేటరీ సాధ్యాసాధ్యాలను తెలుపుతూ అమెరికా ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లైమన్ స్పిట్జర్ 1946లో పరిశోధన పత్రాన్ని వివరించారు.
* అంతరిక్ష టెలిస్కోపు కోసం నిధులను అందించేందుకు అమెరికా కాంగ్రెస్ 1977లో సమ్మతి తెలిపింది. ప్రతిపాదిత టెలిస్కోపునకు ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ పి.హబుల్ పేరున ‘హబుల్ స్పేస్ టెలిస్కోప్’గా దీనికి నామకరణం చేశారు. 1990, ఏప్రిల్ 24న ప్రయోగించారు.
* 2009లో హబుల్‌కు చివరిసారిగా సర్వీసింగ్ నిర్వహించారు. ఫలితంగా అది ప్రయోగించినప్పటికంటే వంద రెట్లు ఎక్కువ శక్తిమంతంగా తయారైంది.
జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ)
* హబుల్ తర్వాత వచ్చిన టెలిస్కోపు జేడబ్ల్యూఎస్‌టీ. దీన్ని 2018 అక్టోబరులో ప్రయోగించాలని నాసా నిర్ణయించింది. ఈ టెలిస్కోప్‌ను గతంలో నెక్ట్స్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్ (ఎన్జీఎస్టీ)గా పిలిచేవారు. జేడబ్ల్యూఎస్టీను ‘ఏరియన్ 5 ఈసీఏ’ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.
ప్రపంచంలో ఏ మత జనాభా ఎక్కువ?
* అమెరికాకు చెందిన విఖ్యాత ‘ప్యూ పరిశోధన కేంద్రం’ ప్రపంచంలోని దాదాపు 200 దేశాలకు చెందిన జనాభా లెక్కలను ప్రపంచ వ్యాప్తంగా మతాల సంఖ్యా బలం ఎలా ఉండనుంది అని క్రోడీ కరించి ‘ది ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్: పాపులేషన్ గ్రోత్ ప్రొజెక్షన్స్ 2010-2050’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది.
ముఖ్యాంశాలు
* ప్రస్తుతం ప్రపంచ మొత్తం మీద అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియా. 2050కి భారత్ ఈ స్థానాన్ని చేరనున్నట్లు నివేదిక వెల్లడించింది. హిందువులే మెజారిటీ వర్గంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనంతగా అధిక సంఖ్యాక ముస్లింలు భారత్‌లో ఉండబోతున్నారు.
* ఈ 35 ఏళ్లలో ఐరోపాలో హిందువుల సంఖ్య 14 లక్షల నుంచి రెట్టింపై దాదాపు 27 లక్షలకు చేరుతుందని, అమెరికాలో కూడా ఈ సంఖ్య రెట్టింపు కాబోతుందని నివేదిక అంచనా వేసింది.
* ప్రస్తుతం అత్యధికంగా ఇండోనేషియాలో ముస్లింలు 20.5 కోట్ల మంది ఉన్నారు. భారత్‌లో 17.7 కోట్లు ఉన్నారు.
మూడో అతిపెద్ద మతవర్గం
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు ఉన్న హిందూ జనాభా 2050 నాటికి 34 శాతం మేర పెరిగి, దాదాపు 140 కోట్లకు చేరనుంది. అప్పటికి ప్రపంచ జనాభాలో హిందువులు 14.9 శాతానికి చేరుకోవడమే కాకుండా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మతవర్గంగా అవతరిస్తారని నివేదిక లెక్కగట్టింది.
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మతానికీ చెందని, ఏ మతాన్ని అనుసరించనివారు మూడో అతిపెద్ద వర్గంగా ఉన్నారు. 2050 నాటికి వీరు 13.2 శాతానికి తగ్గిపోతారు.
* 2010 గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవులు 217 కోట్లు ఉన్నారు. రెండో స్థానంలో ముస్లింలు 160 కోట్లు ఉన్నారు. రానున్న నాలుగు దశాబ్దాలు క్రైస్తవులే అతిపెద్ద మతవర్గంగా కొనసాగినా, ఇదే సమయంలో ముస్లిం జనాభా వేగంగా పెరగనుంది.
* 2050 నాటికి ప్రపంచంలో ముస్లింలు, క్రైస్తవుల జనాభా దాదాపుగా సరిసమానం కానుంది. బహుశా ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం కావొచ్చని నివేదిక పేర్కొంది. అప్పటికి క్రైస్తవులు 290 కోట్లకు (ప్రపంచ జనాభాలో 31%) ముస్లిం జనాభా 280 కోట్లకు (30%) చేరుకుంటారన్నది అంచనా.
* 2050 నాటికి ఐరోపా దేశాల్లో ముస్లిం జనాభా దాదాపు 10% వరకూ ఉంటుందని, ఈ పెరుగుదల వేగం ఇలాగే కొనసాగితే 2070 నాటికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యాకులున్న అతిపెద్ద మతంగా అవతరిస్తుందని కూడా నివేదిక అంచనా వేసింది.
* అమెరికా, ఐరోపాల్లో ముస్లిం జనాభా పెరుగుతుంటే ఆఫ్రికాలో క్రైస్తవులు పెరిగే అవకాశం ఉందని, 2050 నాటికి ప్రతి పది మంది క్రైస్తవుల్లో నలుగురు ఆఫ్రికా దేశాల్లోనే ఉంటారని అంచనా.
స్థిరంగా బౌద్ధ జనాభా
* ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధుల సంఖ్య మాత్రం మరో 35 ఏళ్ల తర్వాత కూడా మారకపోవచ్చని నివేదిక తెలిపింది. దీనికి ప్రధాన కారణం బౌద్ధం ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, థాయ్‌లాండ్ లాంటి దేశా ల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా, సంతాన రేటు స్థిరంగా ఉండటం.
ఆసియా, పసిఫిక్ దేశాల్లో..
* 2010 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ ముస్లిం జనాభా 160 కోట్లు. మొత్తం ప్రపంచ జనాభాలో (680 కోట్లు) వీరిది 23 శాతం. ప్రపంచంలోని మొత్తం ముస్లిం జనాభాలో 62 శాతం ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే ఉన్నారు. చరిత్రలో ఇస్లాం మతానికి ముఖ్య ప్రాంతాలైన మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా అయినప్పటికీ ప్రస్తుతం అక్కడ వారు 20 శాతం మాత్రమే. సంఖ్యాపరంగా ప్రపంచంలోని ప్రధాన మతాల జనాభాలు పెరుగుతున్నప్పటికీ, ముస్లింల పెరుగుదల వేగం మాత్రం ఎక్కువ స్థాయిలో ఉంది.
భారత్ ఏ ఐరాస సంస్థలకు ఎన్నికైంది?
* ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి (యూఎన్ఈసీవోఎస్వోసీ)కి అనుబంధంగా ఉన్న నాలుగు సంస్థలకు భారత్ ఎన్నికైంది.
అవి..
1. ఐరాస బాలలనిధి (యూఎన్‌ఐసీఈఎఫ్ – యునిసెఫ్) కార్యనిర్వాహక బోర్డుకి ఇతర 13 దేశాలతో కలిపి..
2. ప్రపంచ ఆహార పథకం (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ – డబ్ల్యూఎఫ్‌పీ) కార్యనిర్వాహక బోర్డుకి ఇతర 5 దేశాలతో..
3. కమిషన్ ఆన్ క్రైం ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ (సీసీపీసీజే)కి మరో 19 దేశాలతో..
4. యునైటెడ్ నేషన్స్ హ్యుమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్ – హేబిటాట్)కి మరో 14 దేశాలతో కలిసి భారత్ ఎన్నికైంది.
* యునిసెఫ్, డబ్ల్యూఎఫ్‌పీ, సీసీపీసీజేల్లో 2016, జనవరి 1 నుంచి మూడేళ్లపాటు భారత్ సభ్యదేశంగా కొనసాగుతుంది. యూఎన్ – హేబిటాట్లో మాత్రం 2016, జనవరి 1 నుంచి నాలుగేళ్లపాటు భారత్ సభ్యత్వం కలిగి ఉంటుంది.
దోహ సదస్సులో భారత్ లేవనెత్తిన అంశమేది?
* నేర నియంత్రణ, నేర న్యాయంపై ఐక్యరాజ్యసమితి 13వ సదస్సును 2015, ఏప్రిల్ 12-19 వరకు కతార్ రాజధాని దోహలో నిర్వహించారు. ఈ సదస్సులో ఆమోదించిన ప్రకటనలోని ఒక క్లాజులో నల్లధనంపై భారత్ వ్యక్తంచేస్తున్న ఆందోళనలకు చోటు దక్కింది.
* లెక్కా జమా లేని డబ్బు, ఆస్తులు సహా నేరపూరిత సొమ్మును గుర్తించడానికి, రాబట్టడానికి, స్వాధీనం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను విస్తృతం చేసేందుకు దోహ ప్రకటన ఆమోదం తెలిపింది. వీటితో పాటు నల్లధనం చెలామణిని మరింత ప్రభావమంతంగా నియంత్రించడానికి తగిన ప్రక్రియలు చేపట్టడం, బలోపేతం చేయడం కూడా ఉన్నాయి. భారత్ పట్టుబట్టడంతోనే ఈ ప్రకటనలో నల్లధనానికి సంబంధించిన క్లాజును చేర్చారు.
ఆసియా, ఆఫ్రికా దేశాల సదస్సు ఎక్కడ?
* ఆసియా, ఆఫ్రికా దేశాల సదస్సును 2015 ఏప్రిల్ 19-24 వరకు ఇండోనేషియాలోని జకార్తా, బాండుంగ్‌లో నిర్వహించారు. ఈ సదస్సు మొదట 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్‌లో జరిగింది. ఈ దేశాల మొదటి సదస్సు జరిగి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్ట్రెంథెనింగ్ సౌత్-సౌత్ కో ఆపరేషన్ టు ప్రమోట్ వరల్డ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ’ అనే థీమ్‌తో తాజా సదస్సును నిర్వహించారు. 109 ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు, 16 పరిశీలక సభ్య దేశాల ప్రతినిధులు, 25 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
* 2005లో ఆసియా, ఆఫ్రికా దేశాల గోల్డెన్ జూబ్లీ సదస్సును కూడా ఇండోనేషియాలోని జకార్తా, బాండుంగ్‌లో నిర్వహించారు. తొలి సదస్సు జరిగి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ గోల్డెన్ జూబ్లీ సదస్సులో ‘న్యూ ఏషియన్ ఆఫ్రికన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ (ఎన్ఏఏఎస్పీ)’ డిక్లరేషన్‌ను వెలువరించారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ప్రధాన సమస్యలుగా ఉన్న పేదరికం, అభివృద్ధి లేమిలపై ఉమ్మడిగా ఈ రెండు ఖండాలు పోరాడేందుకు సహకరించుకోవాని ఈ డిక్లరేషన్‌లో నిర్ణయించారు.
* భారత విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్ తాజా సదస్సుకు హాజరై ప్రసంగించారు. సమస్త మానవాళికి ప్రమాదకారిగా మారి, ప్రపంచ నాగరకతనే సవాలు చేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సదస్సులో పేర్కొన్నారు.
అత్యంత సంతోషంగా ఉన్న దేశమేది?
* ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ‘సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వేదిక (ఎస్డీఎస్ఎన్ – సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూష్యన్స్ నెట్వర్క్)’ వెలువరించిన ‘ప్రపంచ సంతోష సూచిక-2015’లో భారతదేశం 117వ స్థానంలో నిలిచింది (గతేడాది 111వ స్థానం).
* ప్రపంచవ్యాప్తంగా 158 కీలక దేశాలను పరిగణనలోకి తీసుకుని ఏ దేశ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటున్నారు? సామాజిక పరిస్థితులు ఎంత సానుకూలంగా ఉంటున్నాయన్నది ఈ నివేదికలో అంచనా వేశారు.
* సంతోష సూచికలో భూటాన్ 79వ, పాకిస్థాన్ 81వ, చైనా 84వ, బంగ్లాదేశ్ 109వ, నేపాల్ 121వ, శ్రీలంక 132వ స్థానాల్లో ఉన్నాయి. ఈ సూచికలో స్విట్జర్లాండ్ మొదటిస్థానంలోనూ, ఐస్లాండ్, డెన్మార్క్, నార్వే, కెనాడాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా 15, సింగపూర్ 24 స్థానాల్లో ఉన్నాయి.
* ప్రస్తుతం ప్రపంచ మానవాళిలో మూడోవంతు మంది 18 ఏళ్ల లోపు వారేనని నివేదిక వెల్లడించింది. 2012 నుంచి ఎస్డీఎస్ఎన్ ప్రపంచ సంతోషసూచికలను వెలువరిస్తోంది. సంక్షోభంలో చిక్కుకున్న ఆఫ్గానిస్థాన్, సిరియా, టోగో, బురుండీ, బెనిన్, రువాండా, బుర్కినా ఫాసో, ఐవరీకోస్ట్, గినియా, చాద్లు అత్యంత తక్కువ సంతోషంగా ఉన్న దేశాలుగా ఉన్నాయి. ఎస్డీఎస్ఎన్ వెలువరించిన ఈ నివేదికకు జాన్ ఎఫ్ హెల్లివెల్, లార్డ్ రిచర్డ్ లాయర్డ్, జెఫ్రీ డి సాక్స్‌లు ఎడిటర్లుగా వ్యవహరించారు.
మాదిరి ప్రశ్నలు
1. ‘మ్యాక్సిమోస్ మ్యాన్షన్’ అనేది ఏ దేశ ప్రధానమంత్రి అధికార కార్యాలయం?
ఎ) శ్రీలంక బి) నేపాల్ సి) చైనా డి) గ్రీస్
జ: (డి)
2. గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్ (జీఎల్ఎం) ప్రకటించిన ‘ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార వర్గాలు వాడే 50 అత్యుత్తమ పదాల జాబితా- 2015’లో మొదటి స్థానంలో నిలిచిన పదం ఏది?
ఎ) కంటెంట్ బి) సోషల్ మీడియా సి) బిగ్‌డేటా డి) నెట్-నెట్
జ: (ఎ)
3. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ధర్హారా (భీంసేన్) టవర్, దర్బార్ స్వ్కేర్ ఏ నగరంలో ఉన్నాయి?
ఎ) ఇస్లామాబాద్ బి) ఖాట్మాండు సి) బీజింగ్ డి) ఢాకా
జ: (బి)
4. ఫోర్బ్స్ జాబితా-2015 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్న భారతీయుడు ఎవరు?
ఎ) అనిల్అంబానీ బి) అజీం ప్రేమ్‌జీ సి) ముకేశ్ అంబానీ డి) లక్ష్మీమిట్టల్
జ: (సి)
5. 2015 ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించిన మహ్మద్ అష్రఫ్ ఘనీ ఏ దేశాధ్యక్షుడు?
ఎ) అఫ్గానిస్థాన్ బి) బంగ్లాదేశ్ సి) మయన్మార్ డి) మాల్దీవులు
జ: (ఎ)
6. కింది వారిలో యునిసెఫ్ సంస్థ గుడ్‌విల్ అంబాసిడర్‌ను గుర్తించండి.
ఎ) సచిన్ తెందూల్కర్ బి) షారూక్‌ఖాన్ సి) సైనానెహ్వాల్ డి) నొవాక్ జకోవిచ్
జ: (డి)
7. ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఇటీవల చైనా వార్తల్లో నిలిచింది. రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను గుర్తించండి.
ఎ) అమెరికా బి) ఇండియా సి) జపాన్ డి) జర్మనీ
జ: (ఎ)
8. 2015, సెప్టెంబరు 20 నుంచి అమల్లోకి వచ్చిన నేపాల్ నూతన రాజ్యాంగం ప్రకారం నేపాల్ జాతీయ జంతువుగా దేన్ని ప్రకటించారు?
ఎ) ఖడ్గమృగం బి) సింహం సి) ఆవు డి) ఏనుగు
జ: (సి)
Leave a Reply