International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part III
- విశ్వసుందరి కీరీటాన్ని దక్కించుకున్నదెవరు? భారత్ వద్దంటున్నా చైనా ఏ విషయంలో ముందుకెళుతోంది? విద్యుదుత్పత్తిలో ప్రపంచ రికార్డు స్థాపించిన ప్రాజెక్టు ఏది? బ్రిటన్ ప్రవాస జనాభాలో ఎక్కువ మంది ఏ దేశస్థులు? అత్యంత ఉష్ణంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంవత్సరం ఏది? చైనా ఎలాంటి పాఠ్యపుస్తకాలను నిషేధించింది? ఫ్రాన్స్‌కు చెందిన ఏ వారపత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు? – పోటీ పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు ఉపకరించే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశ్వవ్యాప్త విశేషాల సమాహారం
‘త్రీ గోర్జెస్’ ప్రపంచ రికార్డు
- చైనాలోని త్రీ గోర్జెస్ పవర్ ప్రాజెక్టు 2014లో 98.8 బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. అంతవరకు బ్రెజిల్‌లోని ఇటాయిపు జల విద్యుత్తు కర్మాగారం నెలకొల్పిన ప్రపంచ రికార్డును త్రీ గోర్జెస్ అధిగమించింది. 2013లో బ్రెజిల్ ప్రాజెక్టు 98.6 బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. స్థాపక సామర్థ్యం అంశంలో త్రీ గోర్జెస్ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు కర్మాగారం. దీని స్థాపక సామర్థ్యం 22.5 మిలియన్ కిలోవాట్లు కాగా, బ్రెజిల్ ప్రాజెక్టు సామర్థ్యం 14 మిలియన్ కిలోవాట్లు. యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ ప్రాజెక్టు విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో పాటు వరదలను నియంత్రిస్తుంది. నౌకాయానానికి వీలు కల్పిస్తుంది.
బ్రిటన్‌లో భారతీయులు
- బ్రిటన్ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రవాసీయులుగా భారత సంతతికి చెందినవారు నిలిచారు. వారి సంఖ్య 2013లో 7.34 లక్షలకు చేరుకున్నట్లు బ్రిటన్ జాతీయ గణాంక విభాగ కార్యాలయం 2015లో ప్రకటించింది. బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి వ్యక్తుల సంఖ్య 2004లో 2.32 లక్షలు ఉండగా 2013 నాటికి అది 7 లక్షలను దాటడం విశేషం. దీంతో ఇప్పటివరకూ బ్రిటన్‌లో అత్యధిక సంఖ్యాక ప్రవాసీయులుగా ఐర్లాండ్ జాతీయుల పేరిట ఉన్న రికార్డు భారతీయ సంతతి వ్యక్తుల సొంతమైంది.
భారత మామిడిపళ్లపై నిషేధం ఎత్తివేత
- భారత్ నుంచి దిగుమతి అయ్యే మామిడిపళ్లపై 8 నెలలుగా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని 2015 జనవరిలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించింది. మామిడిపళ్లపై పురుగు మందుల అవశేషాల దృష్ట్యా 2014 మే ఒకటో తేదీ నుంచి 2015 డిసెంబరు వరకు నిషేధం విధిస్తున్నట్లు ఈయూ గతంలో ప్రకటించింది. భారత్ నుంచి ఎగుమతయ్యే పళ్లు, కూరగాయల్లో 50 శాతం ఈయూ దేశాలకే వెళ్తున్నాయి. భారత్‌లో ఏటా 15-16 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా వాటిలో 70 వేల టన్నులను ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తున్నారు. 2013-14లో రూ.304 కోట్ల విలువైన మామిడిని భారత్ ఎగుమతి చేసింది.
పాశ్చాత్య పాఠ్యపుస్తకాలపై నిషేధం
- విద్యార్థులపై పాశ్చాత్య భావనల ప్రభావం లేకుండా చూసేందుకు చైనా ప్రభుత్వం ఆ దేశ యూనివర్సిటీల్లో పాశ్చాత్య పాఠ్యపుస్తకాలపై నిషేధం విధించింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని నిందించే విధంగా ఉండే ఏ పుస్తకమూ వర్సిటీల్లో కనిపించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. చైనాలో యూనివర్సిటీలు అధికార కమ్యూనిస్టు పార్టీ ఆధీనంలో నడుస్తాయి. చరిత్ర, పార్టీ అధికారానికి ముప్పు తెచ్చే ఇతర సున్నితమైన అంశాలను పార్టీ ఆదేశానుసారమే వర్సిటీల్లో చర్చించాల్సి ఉంటుంది.
తేమ లెక్కలను తేల్చే రాకెట్
- నేలలోని తేమకు సంబంధించిన కచ్చితమైన లెక్కలను సేకరించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) 2015 జనవరిలో ఎస్ఎంఏపీ (సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ పాసివ్) ఉపగ్రహాన్ని డెల్టా-2 రాకెట్ ద్వారా వాండెన్‌బర్గ్ వైమానిక స్థావరం నుంచి ప్రయోగించింది. భూమి మీదున్న మొత్తం తేమలో ఒక్క శాతమే నేలపై ఉంటుంది. 97 శాతం సముద్రాల్లోనూ, మిగతాది మంచులోనూ నిక్షిప్తమై ఉంటుంది. స్వల్ప మొత్తంలో నేలలో ఉన్న తేమకు, భూమిపై ఉన్న వాతావరణ వ్యవస్థల (నీరు, శక్తి, కర్బన సైకిళ్లు)తో సంబంధం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు లేదా కరవు తలెత్తడం వెనుక ఈ తేమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో దీని తీరుతెన్నులను పరిశీలించడానికి నాసా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
వీగిపోయిన ‘పాలస్తీనా’ తీర్మానం
- పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే తీర్మానాన్ని 2014 డిసెంబరు 31న భద్రతామండలిలో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించలేదు. 2017 కల్లా పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయిల్ దళాలను ఉపసంహరించాలన్న ఈ తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 8 దేశాలు, వ్యతిరేకంగా 9 దేశాలు ఓటేశాయి. భద్రతామండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది.
భారత్ అభ్యంతరాలను చెబుతున్నా..
- భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ సిల్క్ మార్గం ప్రాజెక్టుపై ముందుకే వెళ్తున్న చైనా ఆ ప్రాజెక్టుపై మిగిలిన దేశాల్లో అపనమ్మకాలు నెలకొన్నాయని ఇటీవల వెల్లడించింది. ఆ అపనమ్మకాలను తాము తొలగిస్తామని పేర్కొంది.
* నూతన సిల్క్ మార్గం ప్రాజెక్టులో చైనాను మధ్య ఆసియా ద్వారా యారప్తో కలిపే పురాతన మార్గం కూడా ఉంది. బంగ్లాదేశ్-చైనా -ఇండియా-మయన్మార్ (బీసీఐఎం) ఆర్థిక కారిడార్ చైనా, పాకిస్థాన్‌లను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ద్వారా కలుపుతుంది. సముద్ర సిల్క్ మార్గం చైనాను పలు నౌకాశ్రయాలతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పెద్దమొత్తంలో చైనా నిధులను కేటాయించింది.
బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్
- గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), సహ వ్యవస్థాపకుడు లారీపేజ్ను 2014 సంవత్సరానికి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి 20 మంది కార్పొరేట్ ప్రముఖుల్లో లారీపేజ్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇ-కామర్స్ పోర్టల్ ‘అలీబాబా’ సహ వ్యవస్థాపకుడు జాక్ మా, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఫాస్ట్‌ఫుడ్ గొలుసుకట్టు సంస్థ చిపోటిల్ సహ సీఈవోలు మోరన్, స్టీవ్ ఎల్స్; ఫెడెక్స్ ఛైర్మన్ ఫ్రెడ్ స్మిత్ కంటే లారీపేజ్ ముందు నిలిచారు.
విశ్వసుందరి.. పౌలినా వెగా
- మిస్ యూనివర్స్ – 2014గా కొలంబియాకు చెందిన పౌలినా వెగా (22) కిరీటాన్ని గెల్చుకుంది. 2015 జనవరి 25న అమెరికాలోని మియామీలో జరిగిన ఈ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 88 మంది అందగత్తెలను పక్కకునెట్టి వెగా విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా నియా శాంచెజ్ (అమెరికా), రెండో రన్నరప్‌గా డయానా హర్కుషా (ఉక్రెయిన్) నిలిచారు.
* ఇవి 63వ మిస్ యూనివర్స్ పోటీలు. భారత్‌కు చెందిన నొయోనితా లోథ్ టాప్ 15లో నిలిచింది.
* మొదటి మిస్ యూనివర్స్ పోటీలను కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో 1952లో నిర్వహించారు. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన అర్మి కూసెలా విజేతగా నిలిచింది. ‘కాన్ఫిడెంట్లీ బ్యూటిఫుల్’ అనేది మిస్ యూనివర్స్ పోటీల నినాదం. 1998లో మిస్ యూనివర్స్ పోటీల లోగోను ‘ది ఉమెన్ విత్ స్టార్స్’ పేరిట రూపొందించారు. న్యూయార్క్‌లోని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఏటా ఈ అందాల పోటీలను నిర్వహిస్తోంది. 1994లో సుస్మితాసేన్, 2000లో లారాదత్తా భారత్‌కు ఈ టైటిల్‌ను సాధించి పెట్టారు.
ఇటలీ నూతన అధ్యక్షుడు మట్టరెళ్ల
- ఇటలీ 12వ అధ్యక్షుడిగా సెర్గియో మట్టరెళ్ల 2015 జనవరి 31న ఎన్నికయ్యారు. ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశంలో నిర్వహించిన నాలుగో దఫా ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఇటలీ రాజ్యాంగ కోర్టు జడ్జి సెర్గియో మట్టరెళ్ల ఎన్నికయ్యారు. మొత్తం 1009 ఓట్లకు గాను 665 ఓట్లు గెలుచుకుని మట్టరెళ్ల విజయం సాధించారు. సిసిలీ మాఫియా చేతిలో తన సోదరుడి హత్యానంతరం మట్టరెళ్ల క్రిస్టియన్ డెమోక్రటిక్ తరఫున 1980లో రాజకీయాల్లో ప్రవేశించారు.
11 ఏళ్లకు కనిపించిన ‘బీగిల్-2’
- 2003 డిసెంబరు 19న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ప్రయోగించిన ‘బీగిల్-2’ స్పేస్‌క్రాఫ్ట్ 11 ఏళ్ల తర్వాత 2015లో తిరిగి కనబడింది. వాస్తవంగా 2003 డిసెంబరు 25 నాటికి అంగారకుడిపైకి చేరుకుని సంకేతాలు పంపాల్సిన ఈ వ్యోమనౌక నుంచి అప్పట్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో 2004 ఫిబ్రవరిలో ఈ ప్రయోగం విఫలమైనట్లు ఈఎస్ఏ ప్రకటించింది. తాజాగా అంగారకుడిపై అన్వేషణకు నాసా పంపిన ‘మార్స్ రికన్నైజాన్స్ ఆర్బిటర్’ స్పేస్‌క్రాఫ్ట్‌లోని హై రిజల్యూషన్ కెమెరా తీసిన చిత్రాల్లో కుజుడి ఉపరితలంపై బీగిల్-2 కనిపించింది. దాని సౌర ఫలకాల్లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల యాంటెన్నా పని చేయలేదని, అందుకే ఇన్నాళ్లూ అది సంకేతాలు పంపలేక పోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వేడెక్కి పోయింది
- అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014 రికార్డుల్లోకి ఎక్కింది. 1880తో పోలిస్తే గతేడాది ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత 0.8 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) శాస్త్రవేత్తలు తేల్చారు. నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ (జీఐఎస్ఎస్) పరిశోధకులు భూతలంపై 6300 వాతావరణ కేంద్రాల సాయంతోనూ, నౌకల ద్వారా సముద్రంలోనూ, అంటార్కిటికా పరిశోధన కేంద్రాల సాయంతోనూ పరిశీలనలు జరిపి ఈ నిర్ధారణకు వచ్చారు. ప్రామాణిక ప్రాతిపదికగా తీసుకున్న 1951 నుంచి 1980 మధ్య కాలంతో పోలిస్తే ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతలో వచ్చిన వైరుధ్యం ఆధారంగా దీన్ని నిర్ధారించారు. ఉష్ణోగ్రతల పెరుగుదలలో ఎక్కువ భాగం గత మూడు, నాలుగు దశాబ్దాల్లోనే చోటు చేసుకుంది. 10 అత్యంత ఉష్ణ సంవత్సరాల్లో తొమ్మిది 2000 సంవత్సరం తర్వాతే నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సౌదీ రాజు మరణం
- సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ అల్సౌద్ దేశ రాజధాని రియాద్‌లో 2015, జనవరి 23న మృతి చెందారు. అబ్దుల్లా మృతదేహాన్ని నిరాడంబరంగా ఇమామ్ తుర్కిబిన్ అబ్దుల్లా మసీదు వద్ద ఖననం చేశారు. సౌదీ అరేబియా రాజుగా 2005 ఆగస్టు 1న సింహాసనాన్ని అధిష్ఠించినా.. అంతకు ముందు నుంచే అబ్దుల్లా (దాదాపు రెండు దశాబ్దాల పాటు) పరిపాలన సాగించారు. 2005లో సౌదీ రాజుగా అధికారికంగా నియమితుడైనప్పటికీ 1996 నుంచే అబ్దుల్లా దేశ పాలనా బాధ్యతలు నిర్వర్తించారు. 1996లో నాటి రాజు ఫాద్ గుండెపోటుకు గురవడంతో అబ్దుల్లా పాలనా పగ్గాలు చేపట్టారు.
* అగ్రరాజ్యం అమెరికాకు మధ్య ప్రాచ్యంలో విశ్వసనీయ నేస్తంగా.. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అబ్దుల్లా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు భారత్ అంటే అభిమానం. 2006లో భారత గణతంత్ర ఉత్సవాలకు అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సౌదీని సంస్కరణల పథంలో నడిపించిన అబ్దుల్లా మహిళలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా వారికి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాధినేతల్లో అబ్దుల్లాది మూడో స్థానం. ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ రూ. లక్ష కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
* అబ్దుల్లా మరణించిన నేపథ్యంలో బ్రిటన్ సామ్రాజ్ఞి ఎలిజబెత్-2 ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వయోవృద్ధురాలైన పాలకురాలిగా నిలిచారు.
‘ఛార్లీహెబ్డో’పై దాడి
- ఫ్రాన్స్‌కు చెందిన వ్యంగ్య రచనల వారపత్రిక ‘ఛార్లీహెబ్డో’ కార్యాలయంపై 2015 జనవరి 7న అల్‌ఖైదా గ్రూపునకు చెందిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ దుశ్చర్యలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్యారిస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో పత్రిక ప్రధాన సంపాదకుడు, కాలమిస్ట్ స్టీఫెన్ ఛార్బొనైర్, వ్యంగ్య చిత్రకారులు కాబు, టిగ్నస్, వోలిన్స్కీ తదితరులున్నారు. 1970లో ఈ పత్రికను స్థాపించారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినందుకు 2006లో ఈ పత్రికపై విమర్శలు వెల్లువెత్తాయి. 2011లోనూ ఇలాంటి ప్రచురణ చేసినందుకు పత్రికపై దాడులు జరిగాయి. ఫ్రాన్స్‌ను సమీప భవిష్యత్తులో ఇస్లామిక్ ప్రభుత్వం పాలిస్తుందని చెప్పే ఊహాచిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించిన నేపథ్యంలో.. 2015లో దాడి ఘటన చోటు చేసుకుంది. ఛార్లీహెబ్డో వెలువరించిన 1177వ సంచిక వివాదాస్పద రీతిలో ఈ దాడి ఘటనకు కారణమైంది.
మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఖుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్ ఏ దేశంలో ఉంది?
జ: పాకిస్థాన్
2. ‘రెటీనైటిస్ పిగ్మెంటోసా’ అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది?
జ: కళ్లు
3. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలను ఏటా జనవరిలో ఎక్కడ నిర్వహిస్తారు?
జ: దావోస్
4. 2014 డిసెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్య ఎంత?
జ: 139 కోట్లు
5. వన్డే క్రికెట్లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా ఇటీవల ఎవరు రికార్డులకెక్కారు?
జ: కుమార సంగక్కర
6. ఆఫ్రికన్ యూనియన్ వార్షిక సదస్సును 2015 జనవరిలో ఎక్కడ నిర్వహించారు?
జ: అడీస్ అబాబా
7. రెల్ బ్యాంక్స్ సంస్థ రూపొందించిన.. 2014 సంవత్సరానికి గాను ప్రపంచంలోని అత్యంత విలువైన 50 బ్యాంకుల జాబితాలో చోటు పొందిన (45వ స్థానం) ఏకైక భారతీయ బ్యాంకు ఏది?
జ: హెచ్డీఎఫ్సీ
Leave a Reply