National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part V
- విజ్ఞానాన్ని పెంచుకోవడానికే కాదు.. మార్కుల సముపార్జనకూ వర్తమానాంశాలపై మంచిపట్టు అవసరం. అనంతంగా కనిపించే ఈ సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలను తప్పక తెలుసుకోవాలి. కొత్త పరిశ్రమలు, సరికొత్త ఆవిష్కరణలు, జాతీయ పురస్కారాలు, ప్రభుత్వ నిర్ణయాలు, సాంకేతిక విజయాలు.. ఇలాంటివి తెలుసుకోవడం ద్వారా జాతీయ వర్తమానాంశాలు అవగతమవుతాయి. ఆసక్తిగా అనిపించే ఈ అంశాలు సులువుగా అర్థమయ్యేలా టీఎస్పీఎస్సీ అభ్యర్థుల కోసం..
బిహార్‌లో రైలింజిన్ కర్మాగారాలు
- ‘భారత్‌లో తయారీ’ (మేక్ ఇన్ ఇండియా)లో భాగంగా రెండు భారీ ప్రతిపాదనలకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆమోదం తెలిపారు. రూ. 2,400 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)తో బిహార్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన రెండు కర్మాగారాల (మాథేపురలో డీజిల్ ఇంజిన్ల కర్మాగారం, మర్హోరాలో విద్యుత్తు ఇంజిన్ల కర్మాగారం) నిర్మాణాన్ని సంయుక్త భాగస్వామ్య విధానంలో చేపడతారు. ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తున్న 8 మౌలిక సదుపాయాల పథకాల్లో ఈ రెండూ ఉన్నాయి. రైల్వే రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడానికి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
చౌక ధరలో టీకా
- స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి, తయారు చేసిన రోటా వైరస్ టీకా ‘రోటా వాక్’ను 2015 మార్చిలో ప్రధాని నరేంద్రమోదీ దిల్లీలో ఆవిష్కరించారు. ఏటా 80,000 మంది 5 ఏళ్లలోపు పిల్లలు అతిసారం (డయేరియా) బారినపడి మరణిస్తున్నారు. ఈ మరణాలకు అడ్డుకట్ట వేయడానికి రూ.60 (ఒక్క డోసు)కే ఈ టీకాను తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకయిన టీకా అని.. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో పాలుపంచుకున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ వెల్లడించింది. ఈ రోటా వైరస్ టీకా ప్రపంచంలో లభ్యమవుతున్న మూడో రోటా వైరస్ టీకా.
మళ్లీ రూపాయి నోటు
- దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వం 2015 మార్చిలో మళ్లీ రూపాయి నోటును చెలామణిలోకి తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రషి సంతకంతో కూడిన ఈ నోటును మార్చి 6న రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా వద్ద ఉన్న శ్రీనాథ్జీ ఆలయంలో విడుదల చేశారు. కొత్తనోట్లతో పాటు ఇప్పటికే చెలామణిలో ఉన్న రూపాయి నోట్లను చట్టబద్ధ ద్రవ్యంగా పరిగణిస్తారు.
- వీటిపై వాటర్ మార్క్ సంకేతంగా ‘సత్యమేవ జయతే’ అనే అక్షరాలు లేని అశోక స్తంభాన్ని ఉపయోగించారు. నోటు మధ్యలో అంతరంగా అంకెతోపాటు కుడివైపు దేవనాగరి లిపిలో ‘భారత్’ అని పైకి కనిపించకుండా ముద్రించారు. ప్రధానంగా గులాబీ, ఆకుపచ్చ రంగులతో నోటును ముద్రించారు. ఆంగ్ల అక్షరం ‘L’ బ్యాక్‌గ్రౌండ్‌గా నంబరింగ్ ప్యానెల్‌ను ముద్రించారు. నోటు ముందు భాగంలో భారత్ సర్కార్ (హిందీ), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఇంగ్లిష్), నూతన రూపాయి నాణెం చిహ్నం, రూపాయి చిహ్నం (`), హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటాయి. నోటు వెనుక భాగం కూడా భారత్ సర్కార్ (హిందీ), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఇంగ్లిష్), నూతన రూపాయి నాణెం చిహ్నం, రూపాయి చిహ్నం, 15 భారతీయ భాషలు, 2015 సంవత్సరం చమురు అన్వేషక ప్లాట్‌ఫామ్ ‘సాగర్ సామ్రాట్’లను కలిగి ఉంటుంది.
* కొత్త రూపాయి నోట్లు 110 మైక్రాన్ల మందం, నిలువుగా 6.3 సెం.మీ., అడ్డంగా 9.7 సెం.మీ. పరిమాణంలో ఉంటాయి. ఇంతకుముందు 1994 నవంబరులో కేంద్ర ప్రభుత్వం రూపాయి నోట్ల ముద్రణను నిలిపివేసింది.
వీరప్ప మొయిలీకి పురస్కారం
- 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ‘సరస్వతీ సమ్మాన్’ పురస్కారానికి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఎంపికయ్యారు. ఆయన రచించిన ప్రఖ్యాత ‘రామాయణ మహాన్వేషణమ్’కు ఈ పురస్కారం లభించింది. 2007లో తొలిసారిగా కన్నడ భాషలో ప్రచురితమైన ఈ పద్య రచన అనంతరం హిందీ, ఆంగ్లం, తెలుగు, తమిళం తదితర భాషల్లోకి అనువాదం అయ్యింది.
* రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న భారతీయ భాషల్లో చేసే అపూర్వ సాహిత్య సేవకుగాను కె.కె.బిర్లా ఫౌండేషన్ 1991 నుంచి ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ అవార్డు కింద గుర్తింపు పత్రంతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు.
‘రిలయన్స్’ ఘనత
- దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం దీని మొత్తం ఆస్తుల విలువ రూ.3.68 లక్షల కోట్లు.
* ఆస్తుల విషయంలో అతిపెద్ద తొలి 10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీలు మాత్రమే ప్రైవేటు కంపెనీలు. మిగతావన్నీ ప్రభుత్వరంగ కంపెనీలే. దేశంలోని మొత్తం 4,15,886 కంపెనీల ఆస్తుల విలువ రూ.117.08 లక్షల కోట్లు. ఈ మొత్తం ఆస్తుల విలువలో తొలి 10 కంపెనీల ఆస్తుల విలువ 15.3 శాతానికి సమానం.
‘బీమా’ బిల్లుకు ఆమోదం
- ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మొదటి భారీ ఆర్థిక సంస్కరణను పార్లమెంటు ఆమోదించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర పార్టీలు కలిసి రావడంతో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచుతూ తీసుకొచ్చిన బిల్లుకు 2015 మార్చిలో పార్లమెంటు ఆమోదం తెలిపింది. మార్చి 4న లోక్‌సభ, మార్చి 12న రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ అంశంపై 2014 డిసెంబరులో ఆర్డినెన్సు తీసుకురాగా దాని స్థానంలో ఈ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆమోదముద్ర వేయించుకుంది.
సెక్షన్ 66-ఎ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
* వెబ్సైట్లలో అభ్యంతరకర సమాచారం ఉంచారనే కారణంతో వ్యక్తులను అరెస్టు చేయడానికి వీలు కల్పిస్తున్న సైబర్ చట్టంలోని అంశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆలోచనా స్వేచ్ఛ, వ్యక్తీకరణ అనేవి ప్రాథమికమైనవనీ.. ప్రజలు తెలుసుకునే హక్కును సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) చట్టం-2000లోని సెక్షన్ 66-ఎ నేరుగా ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం అనే ప్రాథమిక హక్కుకు ఈ సెక్షన్ భంగం కలిగిస్తోందని, ఈ నేపథ్యంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 66-ఎను కొట్టేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఒక సమాచారం ప్రజలకు అందుబాటులో లేకుండా నిలుపుదల చేయడం, కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి సంబంధించిన 69-ఎ, 79 సెక్షన్లను మాత్రం సుప్రీం ధర్మాసనం కొట్టివేయలేదు. కొన్ని నియంత్రణలతో వాటిని అమలు చేయవచ్చని తెలిపింది.
‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ మోదీ
- సీఎన్ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2014గా ప్రధాని నరేంద్ర మోదీ ఎంపికయ్యారు. గత 30 ఏళ్లలో మొదటిసారిగా దేశంలో.. ఒకే పార్టీకి అత్యధిక సంఖ్యాబలం (సింగిల్ లార్జెస్ట్ పార్టీ)తో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
* ఇస్రో మంగళయాన్ జీవితకాల సాఫల్య (లైఫ్‌టైం అచీవ్మెంట్) అవార్డును గెలుచుకుంది. అవుట్‌స్టాండింగ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి; స్పెషల్ అచీవ్మెంట్ పురస్కారాన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్; గ్లోబల్ ఇండియన్ పురస్కారాన్ని సత్య నాదెళ్ల గెలుచుకున్నారు.
ట్విట్టర్ సంవాద్
* చరవాణి వినియోగదారులు ఉచితంగా ట్వీట్లు అందుకునే సౌలభ్యం ‘ట్విట్టర్ సంవాద్’తో అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఎంపిక చేసుకున్న నేత, ప్రభుత్వ విభాగానికి కేటాయించిన విశిష్ట సంఖ్యకు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా.. వారి ట్వీట్లు సందేశాల రూపంలో చరవాణికి అందుతాయి. ఈ సేవలు పొందడం కోసం అంతర్జాల సదుపాయం తప్పనిసరేమీ కాదు.
* కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘డిజిటల్ ఇండియా’ ప్రచారంలో భాగంగా ఈ ‘ట్విట్టర్ సంవాద్’ను దిల్లీలో 2015 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ట్విట్టర్ ప్రారంభించింది. 01130063006కు మిస్ట్ కాల్ ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీ ట్వీట్లు చరవాణిలో సందేశాల రూపంలో పొందవచ్చు. ఈ నూతన సేవ ద్వారా మొత్తం 16 ఖాతాల ట్వీట్లు సందేశాల రూపంలో అందుకోవచ్చని ట్విట్టర్ వెల్లడించింది. ఇందులో ప్రధాని మోదీతోపాటు హోం మంత్రిత్వశాఖ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ్‌బంగ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగళూరు నగర పోలీసు తదితర విభాగాలున్నాయని పేర్కొంది.
శశికపూర్‌కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’
- అలనాటి ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు శశికపూర్‌కు 2014 సంవత్సరానికి ప్రకటించిన ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రదానం చేశారు.
* ఈ అవార్డు కింద స్వర్ణకమలం, రూ.10 లక్షల నగదు, శాలువా ప్రదానం చేస్తారు.
* నాటకం, సినిమా రెండింటిలోనూ ప్రేక్షకులకు పరిచయమైన పృథ్వీరాజ్ కపూర్, రమా మెహ్రా దంపతులకు 1938, మార్చి 18న శశికపూర్ కోల్‌కతాలో జన్మించారు. ప్రముఖ నటులు రాజ్‌కపూర్, షమ్మీకపూర్ ఈయనకు సోదరులు. శశికపూర్ మొత్తం 160 చిత్రాల్లో నటించారు.
* 1979లో జునూన్ చిత్రానికి ఉత్తమ నిర్మాతగా; 1986లో న్యూఢిల్లీ టైమ్స్ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా; 1994లో ముహాఫిజ్ చిత్రానికి స్పెషల్ జ్యూరీ కేటగిరీలో జాతీయ పురస్కారం అందుకున్నారు. 2011లో ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు.
* భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారంగా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1969 నుంచి ప్రదానం చేస్తున్నారు. మొదటి విజేత దేవికారాణి. శశికపూర్ 46వ గ్రహీత. 1971లో పృథ్వీరాజ్ కపూర్, 1987లో రాజ్‌కపూర్, తాజాగా శశికపూర్ ఈ పురస్కారాన్ని పొంది, ఒకే కుటుంబం మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలుచుకున్న ఘనత సాధించారు.
* ఇంతవరకు తెలుగు సినీ రంగానికి చెందిన అయిదుగురు ప్రముఖులు ఈ పురస్కారాన్ని పొందారు. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (1974), ఎల్.వి. ప్రసాద్ (1982), బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), డి.రామానాయుడు (2009). వారిలో నరసింహారెడ్డి, నాగిరెడ్డి సోదరులు కావడం విశేషం.
మాదిరి ప్రశ్నలు
1. మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918) జరిగి వందేళ్లయిన సందర్భంగా సంస్మరణ ప్రదర్శనను 2015 మార్చిలో ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) దిల్లీ బి) ముంబయి సి) చెన్నై డి) కోల్‌కతా
జ: (ఎ)
2. సంతోష్ ట్రోఫీ-2015 విజేత ఎవరు?
ఎ) పంజాబ్ బి) సర్వీసెస్ సి) పశ్చిమ్‌బంగ డి) కర్ణాటక
జ: (బి)
3. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా సైకిల్‌యాత్ర చేసి వార్తల్లో నిలిచిన ఉత్తర్ ప్రదేశ్ వాసి ఎవరు?
ఎ) అభిషేక్ కుమార్ శర్మ బి) నరేంద్ర యాదవ్ సి) కృష్ణ కార్నిక్ డి) సచ్దేవ్ సిన్హా
జ: (ఎ)
4. రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ కొత్త ఎండీ, సీఈవోగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు?
ఎ) జ్యోతి ఆప్టే బి) అశు సుయాశ్ సి) నితీశ్ అగర్వాల్ డి) తేజస్విత రాయ్
జ: (బి)
5. అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రద్దీని బట్టి ఛార్జీల (డైనమిక్ ఛార్జీలు) వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఇటీవల సూచించిన రైల్వే కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు?
ఎ) రతన్ టాటా బి) మహ్మద్ జంషెడ్ సి) ఆర్.కె.గోయల్ డి) బి.పి.జీవన్ రెడ్డి
జ: (బి)
6. ‘పామ్’ తుపాను బీభత్సంతో అతలాకుతలమైన ఏ పసిఫిక్ దేశానికి ఇటీవల భారత్ 2.5 లక్షల అమెరికా డాలర్ల (సుమారు రూ. 1.6 కోట్లు) సాయాన్ని అందించింది?
ఎ) వియాత్నాం బి) తువలు సి) తోంగా డి) వనౌతూ
జ: (డి)
7. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు ‘ఆకాశవాణి’లో నిర్వహిస్తున్న కార్యక్రమం ఏది?
ఎ) ఆప్ కీ బాత్ బి) హమారీ బాత్ సి) మన్ కీ బాత్ డి) దేశ్ కీ బాత్
జ: (సి)
8. ‘రైల్ ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ సెంటర్’ ఏర్పాటు కోసం ఇటీవల భారతీయ రైల్వేతో ఏ విశ్వవిద్యాలయం ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) చెన్నై విశ్వవిద్యాలయం బి) కోల్‌కతా విశ్వవిద్యాలయం
సి) దిల్లీ విశ్వవిద్యాలయం డి) ముంబయి విశ్వవిద్యాలయం
జ: (డి)
9. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీకి కొత్త ఛైర్మన్‌గా ఇటీవల ఎంపికైన కె.ఎం.మణి ఏ రాష్ట్ర ఆర్థిక మంత్రి?
ఎ) కేరళ బి) తమిళనాడు సి) కర్ణాటక డి) గుజరాత్
జ: (ఎ)
Leave a Reply