National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part IX
- భారీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించింది. ఏమిటా లక్ష్యం? – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబరాలు నిర్వహించుకుంది ఎందుకు? – దిల్లీ, ముంబయిల కంటే జయపుర నగరం ముందుంది. ఏ విషయంలో? – సూక్ష్మ రుణ పరిమితిని కేంద్రం పెంచింది. ఎంతమేర? – ఫేమ్ ఇండియా విధానాన్ని కేంద్రం ఆవిష్కరించింది. ఏమిటా విధానం? – దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరు మారింది. ఏమిటది? – విపత్తు సమయాల్లో అందించే సాయాన్ని కేంద్రం పెంచింది. పెంపుదల ఎలా ఉంది? – గాంధీజీ తొలిసారి అడుగిడి వందేళ్లయిన సందర్భంగా ఓ భారతీయ నగరం మురిసిపోతోంది. ఏమిటా విశేషాలు? – నదుల అనుసంధానానికి అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణకు చెందిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన ఎవరు? .. తెలుసుకుందాం రండి.
900 బిలియన్ డాలర్ల లక్ష్యం
* ఎన్డీఏ ప్రభుత్వ తొలి ఎఫ్టీపీ (విదేశీ వాణిజ్య విధానం)ని 2015 ఏప్రిల్ 1న కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలో ప్రకటించారు. ఇందులో భాగంగా భారత పథకం నుంచి మర్చండైజ్ ఎగుమతులు (ఎమ్ఈఐఎస్ – మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్); సేవల ఎగుమతులు (ఎస్ఈఐఎస్ – సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్) అనే రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టారు.
* వస్తువుల, సేవల ఎగుమతులను 2020 కల్లా రెండింతలు చేయాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ సమయానికి 900 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.54,00,000 కోట్లు)కు చేరుకోవాలని కొత్త విదేశీ వాణిజ్య విధానంలో పేర్కొన్నారు.
* ఎమ్ఈఐఎస్ కింద దేశీయంగా తయారుచేసే నాణ్యమైన ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిచ్చేలా విదేశీ వాణిజ్య విధానాన్ని ఉపయోగించుకోవాలి.
* ఏటా సమీక్షకు బదులుగా రెండున్నరేళ్ల తర్వాత ఎఫ్‌టీపీని సమీక్షిస్తారు. రక్షణ, వ్యవసాయ ఉత్పత్తులు, పర్యావరణహిత ఉత్పత్తుల ఎగుమతులకు అధిక మద్దతు ఉంటుంది.
* భారత ఎగుమతులను పెంచేందుకు ఒక ఎగుమతి ప్రోత్సాహకాల బృందాన్ని (ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్) ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని ఎఫ్టీపీ ప్రతిపాదించింది.
* ఈ-కామర్స్ కంపెనీలకు ఎఫ్టీపీలో ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత వాటాను పెంచుకోవడానికి, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలను పాటించడానికి కొన్ని సంస్థలను ఏర్పాటు చేయాలని ఎఫ్టీపీ ప్రతిపాదించింది.
భారతీయ నగరాల్లో జయపుర ప్రథమం
* ప్రపంచ యాత్రా వేదిక ‘ట్రిప్ అడ్వైజర్’ 2015కు గాను నిర్వహించిన యాత్ర స్థలాల ఎంపికలో ఆసియాలోని 25 అత్యుత్తమ దర్శనీయ ప్రాంతాల్లో 4 భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి.
* ఆసియాలోని 25 ప్రముఖ దర్శనీయ ప్రాంతాల్లో పింక్ సిటీగా పేరుగాంచిన జయపుర 12వ స్థానంలో నిలిచింది. దేశ రాజధాని దిల్లీ 15వ స్థానంలో, దేశ ఆర్థిక రాజధాని ముంబయి 20వ స్థానంలో నిలిచాయి. రాజస్థాన్‌లోని మరో ప్రముఖ నగరం, ,’ది గోల్డెన్ సిటీ’గా పేరుగాంచిన జైసల్మీర్ 22వ స్థానంలో నిలిచింది.
* కంబోడియా లోని సియమ్‌రీప్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో హనోయ్ (వియత్నాం), ఉబుద్(ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), ఖాఠ్మండు (నేపాల్) నిలిచాయి.
8 దశాబ్దాల ఖ్యాతి
* 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు చేసిన భారతీయ రిజర్వు బ్యాంకు 80వ వార్షికోత్సవాన్ని 2015 ఏప్రిల్ 2న ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
* ‘2035 కల్లా రిజర్వ్ బ్యాంక్ 100 ఏళ్లను పూర్తి చేసుకుంటుంది. అప్పటికల్లా అందరికీ ఆర్థిక సేవలను అందజేసేలా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని సాధించాలని’ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
* మహాత్మాగాంధీ 150వ జయంతి (2019); భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం (2022); ఆర్బీఐ 90వ వార్షికోత్సవం (2025)లను ఆర్థిక సంఘటితాన్ని సాధించేందుకు తేదీలుగా నిర్ణయించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
* స్వాతంత్య్రానంతరం 1949 జనవరి 1న ఆర్బీఐను జాతీయం చేశారు. షహీద్ భగత్‌సింగ్ మార్గ్, ముంబయిలో ఆర్బీఐ కేంద్ర కార్యాలయం ఉంది.
* ఆర్బీఐ తొలి గవర్నర్ ఆస్బోర్న్ ఎ.స్మిత్ (1935 ఏప్రిల్ 1 నుంచి 1937 జూన్ 30 వరకు కొనసాగారు).
* భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆర్బీఐ తొలి గవర్నర్ చింతామణి డి.దేశ్‌ముఖ్ (1943 ఆగస్టు 11 నుంచి 1949 జూన్ 30 వరకు కొనసాగారు). ఈయన మొత్తం మీద ఆర్బీఐకు మూడో గవర్నర్.
* ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ 2013 సెప్టెంబరు 4 నుంచి కొనసాగుతున్నారు. ఈయన ఆర్బీఐకు 23వ గవర్నర్.
ఇక తెలంగాణ గ్రామీణ బ్యాంకు
* దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరును తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారుస్తున్నట్లు 2015 ఏప్రిల్ 9న భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆర్బీఐ చట్టం 1934లోని రెండో షెడ్యూల్లో ఈ మార్పు చేసినట్లు వెల్లడించింది.
* 2014 అక్టోబరు 20న దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరును తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఆర్బీఐ 2015 ఏప్రిల్‌లో ఈ చర్య చేపట్టింది.
* 2006లో ఏర్పాటైన దక్కన్ గ్రామీణ బ్యాంకు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంగనర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సేవలు అందిస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయమే తెలంగాణ గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయం అవుతుంది.
* తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ప్రాయోజిత (స్పాన్సర్) బ్యాంకుగా ఉంటుంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా పేరు మారిన దక్కన్ గ్రామీణ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు 35 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 15 శాతం వాటాలున్నాయి.
‘సూక్ష్మ’ రుణ పరిమితి పెంపు
* సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ – మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) ఇకపై రూ. లక్ష వరకు రుణం ఇవ్వొచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. విద్య, వైద్య ఖర్చులకు మినహా ఇతర అవసరాల నిమిత్తం ఇచ్చే రుణ పరిమితిని రూ.50,000 నుంచి రూ. లక్షకు పెంచినట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2015 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
* రుణం తీసుకునే వ్యక్తి గ్రామీణుడైతే, వార్షికాదాయం రూ. లక్షలోపే ఉండాలి. ఆర్బీఐ ఈ పరిమితి కూడా పెంచింది (గతంలో ఈ పరిమితి రూ.60,000 మాత్రమే). పట్టణాల్లోని రుణ గ్రహీత వార్షికాదాయం రూ.1,60,000 (గతంలో రూ.1,20,000)కు పెంచింది.
* అల్పాదాయ వర్గాలు, చిన్న వ్యాపార సంస్థలకు రుణసేవల విస్తరణపై ఏర్పాటైన నచికేత్ మోర్ కమిటీ సూచనల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఎంఎఫ్‌ఐల రుణ పరిమితిని, రుణగ్రహీతల వార్షికాదాయ పరిమితిని పెంచింది.
ఫేమ్ ఇండియా
* కాలుష్యాన్ని తగ్గించే బ్యాటరీ, హైబ్రిడ్ వాహనాలు మరిన్ని మన రోడ్లపై పరుగులు తీసేందుకు అవసరమైన ప్రోత్సాహకాలతో ‘ఫేమ్ ఇండియా’ అనే నూతన విధానాన్ని 2015 ఏప్రిల్ 8న కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ‘ఫేమ్ ఇండియా’ అనేది నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్‌లో భాగం.
* ఫేమ్ ఇండియా (FAME India) అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా.
* ‘ఫేమ్ ఇండియా’ విధానంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సుల తయారీ, కొనుగోలుదార్లకు ప్రోత్సాహకాలు ఇస్తారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాలకు కలిపి అమలు చేయనున్న ఈ పథకం తొలి దశకు రూ. 795 కోట్లు కేటాయించారు. ఫేమ్ ఇండియా పథకాన్ని తొలుత మహా నగరాలతో ప్రారంభించి క్రమంగా స్మార్ట్, ఇతర ప్రధాన నగరాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గాంధీజీ పర్యటనకు వందేళ్లు
* 2015 ఏప్రిల్ 12, 13 తేదీల్లో దేశ రాజధాని దిల్లీ ఓ అద్భుత, చరిత్రాత్మక ఘట్టం తాలూకు శత వసంతోత్సవాన్ని జరుపుకొంది. వందేళ్ల కిందట 1915 ఏప్రిల్ 12న భార్య కస్తూర్బాతో కలిసి దిల్లీలో తొలిసారిగా అడుగిడిన గాంధీ మరుసటి రోజు ఏప్రిల్ 13న దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి హిందీలో ప్రసంగించారు. గోపాలకృష్ణ గోఖలే ఆహ్వానం మేరకు మహత్మాగాంధీ దిల్లీ వచ్చారు.
నదుల అనుసంధానం – టాస్క్‌ఫోర్స్
* దేశంలో నదుల అనుసంధానం విషయంలో అడ్డంకులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం పలువురు నిపుణులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఇటీవల ఏర్పాటు చేసింది. నదుల అనుసంధానాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
* ఈ టాస్క్‌ఫోర్స్‌కు బి.ఎన్.నవలా వాలా నేతృత్వం వహిస్తారు. తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె; పర్యావరణ, అటవీశాఖ మాజీ కార్యదర్శి ప్రొదీప్తో ఘోష్; కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ ఛైర్మన్ ఎ.డి.మొహిలే; సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు ఎం.గోపాల కృష్ణన్; న్యాయవాది విరాగ్ గుప్తా; సీడబ్ల్యూసీ ఛైర్మన్, జాతీయ జల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్, ఇతర అధికారులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.
* శ్రీరాం వెదిరె ప్రస్తుతం కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన మంత్రిత్వశాఖ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈయన ‘గుజరాత్స్ సక్సెస్ స్టోరీ ఇన్ వాటర్ మేనేజ్మెంట్’, ‘వా టర్ గ్రిడ్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యూజింగ్ రివర్స్ గోదావరి అండ్ కృష్ణా’, ‘ఇన్నోవేటివ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇన్‌డిస్పెన్సబుల్ ఫర్ ఇండియా’ వంటి పుస్తకాలు రాశారు.
విపత్తు సాయం పెంపు
* ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలం అయ్యే జీవితాలకు కొంత ఊరటనిస్తూ.. విపత్తు సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. వైపరీత్యాల సమయంలో మృతి చెందే వారి కుటుంబాలకు ఇచ్చే సాయాన్ని రూ. 1.5 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచింది.
* పంటల పెట్టుబడి రాయితీ, దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారం, పంట నష్టం, ఆస్తి నష్టం సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇచ్చే నష్ట పరిహారాన్ని 50 శాతం దాకా పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* పంటల పరిహారం నిబంధనలను సడలించింది. గతంలో 50 శాతం, అంతకంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలకే పరిహారం ఇస్తుండగా దీన్ని 33 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. (వివరాలకు 5 పట్టికలు చూడండి)
Leave a Reply