TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part XIII
- రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేసి, అమలు చేస్తోంది. తాజాగా రైతుల కోసం పంటల బీమా పథకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మెగా ఫుడ్‌పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రతిష్ఠాత్మకమైన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించింది. తెలంగాణ ఖ్యాతిని పెంచే బాలోత్సవ్‌ను వైభవంగా నిర్వహించారు. దేశ రాజధానిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్‌లో తెలంగాణ స్టాల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఇలాంటి తెలంగాణ రాష్ట్ర వర్తమానాంశాల విశేషాలు టీఎస్పీఎస్సీ అభ్యర్థుల కోసం
పంటలకు బీమా
- తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు రకాల పంటల బీమా పథకాలు అమలవుతున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా పథకాల వివరాలివి..
1. మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్ఏఐఎస్)
2. జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్ఏఐఎస్)
3. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)
మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్ఏఐఎస్)
- జాతీయ పంటల బీమా కార్యక్రమం కింద.. మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని(ఎంఎన్ఏఐఎస్) అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2015-16 రబీ కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో గ్రామం, మండలం యూనిట్‌గా పంటల బీమా అమలుకు సంబంధించి ప్రభుత్వం 2015 నవంబరు 10న ఉత్తర్వులు జారీ చేసింది.
- ఈ పథకం కింద నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో బీమాకు మండలం యూనిట్‌గా ఉంటుంది. వరి పంటకు సంబంధించి మాత్రం ఈ 5 జిల్లాలో గ్రామం యూనిట్‌గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎంఎన్ఏఐఎస్లో భాగంగా బీమా కోసం గుర్తించిన పంటలు వివరాలు పట్టిక-1లో చూడవచ్చు.
జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్ఏఐఎస్)
- జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద 2015-16 రబీ కాలంలో పంటలకు బీమా అమలు చేస్తున్నారు. మండలం యూనిట్‌గా తెలంగాణలోని 4 జిల్లాల్లో ఏయే పంటలకు బీమా వర్తిస్తుందో ప్రభుత్వం 2015 నవంబరు 10న ఉత్తర్వులు జారీ చేసింది.
* ఎన్ఏఐఎస్ కింద (మండలం యూనిట్) పంటల బీమా కోసం 2015-16 రబీ కాలానికి ఏ పంటను ఏ జిల్లాల్లో గుర్తించారో వివరాలు పట్టిక-2లో చూడవచ్చు.
* ఎన్ఏఐఎస్ కింద పంటల బీమా కోసం 2015-16 రబీ కాలానికి (మండలం యూనిట్) ఏయే జిల్లాల్లో ఏయే పంటలను గుర్తించారో వివరాలు పట్టిక-3లో చూడవచ్చు.
వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)
- వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద 2015-16 రబీ కాలానికి పంటల బీమా అమలు కోసం హైదరాబాద్, నిజామాబాద్ మినహా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మామిడి పంటను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబరు 10న ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఐటీఎఫ్-2015లో తెలంగాణ స్టాల్
- 35వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)-2015.. ఇండియా ట్రేడ్ ప్రొమోషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో న్యూదిల్లీలోని ప్రగతి మైదానంలో 2015 నవంబరు 14 నుంచి 27వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
* ఈ ట్రేడ్ ఫెయిర్‌లో తెలంగాణ పెవిలియన్(స్టాల్)ను 2015 నవంబరు 14న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు.
* తెలంగాణ స్టాల్‌ను గోల్కొండ కోట ఆకృతిలో రూపొందించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బోనాలు, బతుకమ్మ.. రాష్ట్రంలోని ప్రముఖ పర్యటక ప్రదేశాలను ప్రదర్శిస్తారు.
* తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పారిశ్రామిక విధాన ప్రత్యేకతలను ప్రదర్శిస్తారు.
* తెలంగాణ హస్తకళలు, హైదరాబాద్ గాజులు, చేర్యాల్ వర్ణచిత్రాలు, పెంబర్తి కళాకృతులు, నిర్మల్ కొయ్య బొమ్మలు, డోక్రా మెటల్ క్రాఫ్ట్స్, పోచంపల్లి చేనేత వస్త్రాలు, గద్వాల్ పట్టుచీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలను ఇందులో ప్రదర్శిస్తారు.
* తెలంగాణ వంటకాలైన హైదరాబాద్ బిర్యానీ, చెక్కినాలు, సర్వపిండి, పచ్చిపులుసు మొదలైనవి ఈ ఫుడ్‌స్టాల్‌లో ప్రదర్శిస్తారు.
డీజీపీగా అనురాగ్‌శర్మ
- 2014 జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్న అనురాగ్‌శర్మను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబరు 13న ఉత్తర్వులు జారీ చేసింది.
* అనురాగ్‌శర్మ 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన గతంలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు.
లక్కంపల్లిలో మెగా ఫుడ్‌పార్క్
- నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో మెగా ఫుడ్‌పార్క్‌కు 2015 నవంబరు 16న కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ శంకుస్థాపన చేశారు.
* నిజామాబాద్ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో స్మార్ట్ మెగా ఫుడ్‌పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మెగా ఫుడ్‌పార్కులకు అనుబంధంగా నల్గొండ, మెదక్, మేడ్చల్‌లలో ప్రాథమిక ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు.
డబుల్ బెడ్రూం ఇళ్లకు శ్రీకారం
- హైదరాబాద్‌లోని బోయగూడ ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం (రెండు పడక గదుల) ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 నవంబరు 16న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.
* ఐడీహెచ్ కాలనీలో 396 గృహాలు (ఎస్సీలకు 276, ఎస్టీలకు 31, బీసీలకు 79, మైనార్టీలకు 10) ప్రభుత్వం నిర్మించింది.
* ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 60 వేల ఇళ్లు నిర్మించనున్నారు. ఈ ఏడాది ఒక్కో నియోజక వర్గంలో 400 ఇళ్లను నిర్మిస్తారు. ఇందులో భాగంగా 2015 అక్టోబరు 22న రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు.
* డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి ఇంటిలో రెండు పడక గదులు, ఒక హాల్, ఒక కిచెన్, రెండు మరుగుదొడ్లు ఉంటాయి.
* గృహిణి పేరుమీదుగా పట్టాలు మంజూరు చేస్తున్నారు.
కొత్తగూడెంలో బాలోత్సవ్
- జాతీయస్థాయి తెలుగు బాలల పండుగ ‘బాలోత్సవ్-2015’లో భాగంగా 24వ అంతర్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు-2015.. నవంబరు 13, 14, 15 తేదీల్లో ‘కొత్త గూడెం క్లబ్’ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో నిర్వహించారు.
* జాతీయస్థాయి ‘బాలోత్సవ్-2015’ను ప్రముఖ బాలుడు సాదిక్ పాషా (తొమ్మిదో తరగతి విద్యార్థి, 2015 సెప్టెంబరులో ఐక్య రాజ్య సమితి బాలల హక్కుల సదస్సులో ప్రసంగించాడు) ప్రారంభించాడు.
* ఉత్సవాల్లో భాగంగా 28 అంశాల్లో 40 విభాగాలు(సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్)గా వర్గీకరించి పోటీలు నిర్వహించారు. ఇందులో 9 రాష్ట్రాలకు చెందిన సుమారు 15 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
* బాలోత్సవ్ ప్రధాన ప్రాంగణానికి అబ్దుల్ కలాం ప్రాంగణంగా పేరు పెట్టారు.
* 1969లో ఏర్పాటు చేసిన కొత్తగూడెం క్లబ్ ఆధ్వర్యంలో 1991 నుంచి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
* 1991 నుంచి మండల స్థాయిలోను, 1995 నుంచి జిల్లా స్థాయిలోను, 2000 సంవత్సరంలో రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాల సాంస్కృతిక ఉత్సవాలకు శ్రీకారం చుట్టి ‘బాలోత్సవ్’గా ప్రకటించి వీటిని నిర్వహిస్తున్నారు.
* 2014 నుంచి జాతీయ స్థాయిలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. 1991 నుంచి ఏటా నవంబరులో ‘బాలోత్సవ్’ పేరుతో అంతర్ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలను ఎక్కడ నిర్వహిస్తున్నారు?
ఎ) నల్గొండ జిల్లా దేవరకొండ బి) ఖమ్మం జిల్లా కొత్తగూడెం సి) మహబూబ్‌నగర్ జిల్లా కోయల్‌కొండ డి) కరీంనగర్ జిల్లా తిమ్మాపూరు
జ: (బి)
2. తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది?
ఎ) అనురాగ్‌శర్మ బి) అరుణా బహుగుణ సి) ఎ.కె.ఖాన్ డి) మహేందర్ రెడ్డి
జ: (ఎ)
3. మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటుకు ఎక్కడ శంకుస్థాపన జరిగింది?
ఎ) రంగారెడ్డి-తాండూరు బి) నిజామాబాద్- లక్కంపల్లి సి) నల్గొండ-మునుగోడు డి) మెదక్‌జిల్లా-నారాయణఖేడ్
జ: (బి)
4. 2015-16 రబీ కాలానికి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్) కింద ఏ పంటను గుర్తించారు?
ఎ) పత్తి బి) దానిమ్మ సి) మామిడి డి) నిమ్మ
జ: (సి)
Leave a Reply