TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part IX
- స్వచ్ఛతలో సిద్దిపేట, ‘కాయకల్ప’లో ఖమ్మం ఆసుపత్రి ఘనత సాధించాయి.. తెలంగాణ రాష్ట్రం ‘ఏ + గా నిలిచింది.. ఖమ్మం విద్యార్థి ఐరాస సదస్సులో ప్రసంగించి, పోలీసు అధికారిణి హిమాలయాల్లో పర్వాతారోహణ చేసి ఖ్యాతిని చాటారు.. 2015లో చోటు చేసుకున్న ఇలాంటి వర్తమానాంశాల సమాహారం..
‘బంగారు తెలంగాణ’పై పుస్తకం
*‘బంగారు తెలంగాణ దిశగా – తొలి అడుగులు’ పేరుతో రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలుగులో తొలిసారిగా రూపొందించిన తెలంగాణ సామాజిక, ఆర్థిక చిత్రం 2015 పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, సెప్టెంబరు 4న విడుదల చేశారు.
* ఈ పుస్తకంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు.
* 2015, మార్చి 11న ప్రభుత్వం ‘రీ ఇన్వెంటింగ్ తెలంగాణ – ది ఫస్ట్ స్టెప్స్’ పేరుతో విడుదల చేసిన సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్, 2015కి ఇది తెలుగు అనునాదం.
‘స్వచ్ఛ’ సిద్దిపేట
* స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ తెలంగాణలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని ‘బహిరంగ మలవిసర్జన లేని సంపూర్ణ నియోజకవర్గం’గా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి 2015, అక్టోబరు 2న అధికారికంగా ప్రకటించారు.
* నియోజకవర్గంలో 64,733 నివాస గృహాలకు 100 శాతం మరుగుదొడ్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
* ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణలో కూడా సిద్దిపేట పురపాలక సంఘం 100 శాతం లక్ష్యం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
ఐరాస సదస్సుకు ఖమ్మం విద్యార్థి
* 2015, సెప్టెంబరు 25 నుంచి 3 రోజుల పాటు న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) బాలల హక్కుల సదస్సులో ఖమ్మంకు చెందిన సాదిక్ పాషా అనే విద్యార్థి ‘నైన్ ఈజ్ మైన్’ అనే అంశంపై ప్రసంగించాడు.
* అంతర్జాతీయంగా 300 మంది బాలలు ఈ సదస్సులో పాల్గొనగా భారత్ నుంచి 17 మంది హాజరయ్యారు.
* సాదిక్‌పాషా ఖమ్మంలోని రోటరీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
రాష్ట్ర ఉత్సవంగా గాంధీ జయంతి
* 2015, అక్టోబరు 2న గాంధీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* మహాత్మాగాంధీ తెలంగాణలో మొత్తం 3 సార్లు (1929, 1934, 1946) పర్యటించారు.
* మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని 2007లో నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ఈ-పంచాయతీ
* పల్లెపాలనలో పారదర్శకత, సౌలభ్యం లక్ష్యాలుగా ఈ-పంచాయతీ విధానానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
* నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం బీబీపేట గ్రామ పంచాయతీలో గాంధీ జయంతిని పురస్కరించుకొని 2015, అక్టోబరు 2న ఈ-పంచాయతీ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
* రాష్ట్రవ్యాప్తంగా 104 గ్రామ పంచాయతీల్లో ఈ-పంచాయతీ కార్యక్రమాన్ని మొదటి విడతగా ప్రారంభించారు. దీన్ని దశలవారీగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకూ విస్తరించనున్నారు.
ముఖ్యాంశాలు
» పల్లె సమగ్ర సేవాకేంద్రాల (ఓఎస్ఎస్ – వన్ స్టాప్ షాప్) ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తారు.
» విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్లు (వీఎల్ఈ)గా సుమారు 10 వేల మంది మహిళలకు ఉపాధి. (చదువుకున్న స్వయం సహాయక సంఘాల మహిళలను ఎంపిక చేస్తారు)
» ఈ-పంచాయతీ ద్వారా పల్లెప్రజల ముంగిట్లో ఆర్థిక, పౌర సేవలు.
» ఈ-పంచాయతీల ద్వారా ఆసరా పింఛన్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వారి వేతన చెల్లింపులు, స్త్రీనిధి, బ్యాంకింగ్ లావాదేవీలు తదితర సేవలు అందిస్తారు.
‘కాయకల్ప’లో ఖమ్మం ప్రథమం
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగు పరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘కాయకల్ప’ పేరుతో ఒక పథకాన్ని 2015 మేలో ప్రారంభించింది.
* ఈ పథకంలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఆసుపత్రుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నిర్వహించి మొదటి 3 స్థానాల్లో నిలిచిన ఆసుపత్రులకు నగదు పారితోషికాలు అందజేస్తారు.
* గాంధీజయంతిని పురస్కరించుకొని 2015 అక్టోబరు 2న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్వచ్ఛ ఆసుపత్రుల విజేతలను ప్రకటించారు.
* రాష్ట్రంలో స్వచ్ఛ ఆసుపత్రుల పోటీలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మొదటిస్థానంలో నిలిచింది. ఈమేరకు ఖమ్మం ఆసుపత్రికి రూ. 50 లక్షల నగదు పారితోషికం అందజేస్తారు. (రెండో స్థానంలో కింగ్‌కోఠి, మహబూబ్‌నగర్ ఆసుపత్రులు.. మూడో స్థానంలో నల్గొండ, సంగారెడ్డి ఆసుపత్రులు నిలిచాయి.)
రైతు కుటుంబాలకు అండగా..
* తెలంగాణ రాష్ట్రంలో పంటనష్టం, అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ముందుకొచ్చారు.
* వీరిని ఫామ్(రైతు) అంబాసిడర్లుగా ప్రభుత్వం 2015, సెప్టెంబరు 22న నియమించింది.
తెలంగాణకు ‘ఏ +’ గుర్తింపు
* ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) తెలంగాణ రాష్ట్రానికి ‘ఏ+’ కేటగిరీ గుర్తింపు ఇచ్చినట్లు 2015, అక్టోబరు 4న ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
ముఖ్యాంశాలు
» గతంలో ఉమ్మడి రాష్ట్రం మైనస్ కేటగిరీలో ఉండేది.
» తెలంగాణకు ఐసీఆర్ఏ ఏ+ కేటగిరీ రేటింగ్ ఇవ్వడం వల్ల దేశ విదేశాల్లో రాష్ట్ర పరపతి పెరుగుతుంది.
» రుణాల లభ్యత సులభమవుతుంది.
» మెరుగైన రేటింగ్ వల్ల రుణాలపై చెల్లించే వడ్డీరేటు తగ్గుతుంది.
» పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఆర్సీఐకి అబ్దుల్ కలాం పేరు
* అబ్దుల్ కలాం 84వ జయంతిని పురస్కరించుకుని 2015, అక్టోబరు 15న హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన ‘రిసెర్చ్ సెంటర్ ఇమారత్’ (ఆర్సీఐ) పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రిసెర్చ్ సెంటర్ ఇమారత్గా మార్చారు.
* అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అక్టోబరు 15న హైదరాబాద్‌లోని ఆర్సీఐని సందర్శించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అధికారికంగా ప్రకటించారు.
* రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్)లోని ‘రిసెర్చ్‌సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) – అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీ (ఏఎస్ఎల్) మిస్సైల్ కాంప్లెక్స్’ను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ (క్షిపణి సముదాయం)గా పేరు మార్చారు.
* ఈ సందర్భంగా రక్షణమంత్రి ఆర్సీఐకి చెందిన రెండు అధునాతన పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు, ఇందులో భాగంగా ‘దుండిగల్’లో ఓపెన్ రేంజ్ ఫర్ అవుట్డోర్ రాడార్ క్రాస్ సెక్షన్ అండ్ యాంటెనా టెస్ట్‌రేంజ్ (ఆరెంజ్)ను, భవిష్యత్తు పరిశోధనలకు సంబంధించి ‘కౌటిల్య అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్’ను ప్రారంభించారు.
* హైదరాబాద్‌లోని డీఆర్డీవోకు చెందిన డీఆర్డీఎల్కి డైరెక్టర్‌గా 1982లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బాధ్యతలు నిర్వర్తించారు.
చైనా కంపెనీలతో ఒప్పందాలు
* తెలంగాణ రాష్ట్రంలో డ్రై పోర్ట్ (భూభాగ ఓడరేవు), ప్రీఫ్యాబ్ కాంక్రీట్ తయారీ పరిశ్రమ స్థాపించడానికి చైనా దేశానికి చెందిన అగ్రశ్రేణి సంస్థ ‘సాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
* 2015, అక్టోబరు 16న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో డ్రైపోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి (ఇన్ఛార్జ్) జయేష్ రంజన్, ‘సానీ హెవీ ఇండస్ట్రీ’ ఛైర్మన్ వెన్‌జెన్, ‘పోర్ట్ లియోన్ యంగ్గాంగ్’ వైస్ ప్రెసిడెంట్ చున్హంగ్ పరస్పరం మార్చుకున్నారు.
* ప్రీఫ్యాబ్ కాంక్రీటు తయారీ పరిశ్రమ స్థాపనకు సంబంధించిన ఒప్పంద పత్రాలను తెలంగాణ ప్రభుత్వ గృహ నిర్మాణశాఖ కార్యదర్శి దానకిషోర్, ‘సానీ ఇంటర్నేషనల్ హౌసింగ్’ జనరల్ మేనేజర్ హైజున్ డెంగ్లు పరస్పరం మార్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి పురస్కారం
* సీఎన్‌బీసీ టీవీ-18 ఇండియన్ బిజినెస్ లీడర్స్ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది.
* తెలంగాణ ‘ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ 2015’కు ఎంపిక చేసినట్లు ‘సీఎన్‌బీసీ టీవీ-18’ మేనేజింగ్ ఎడిటర్ షరీన్భాన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ పంపారు.
* త్వరలో ముంబయిలో జరిగే పురస్కార ప్రదాన కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు.
‘రుద్రమదేవి’కి పన్ను మినహాయింపు
*కాకతీయుల చరిత్ర, రాణీ రుద్రమదేవి జీవిత కథాంశంతో నిర్మించిన చలన చిత్రం ‘రుద్రమదేవి’కి వినోదపు పన్ను మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. దీనికి అనుగుణంగా అక్టోబరు 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
* తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తగిన ప్రోత్సాహం అందించాలనే ప్రభుత్వ విధాన నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పీఏసీ ఛైర్మన్‌గా రాంరెడ్డి వెంకటరెడ్డి
* తెలంగాణ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డిని నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి 2015, అక్టోబరు 16న ఉత్తర్వులు జారీ చేశారు.
* కాంగ్రెస్ పార్టీ సిఫార్సు మేరకు పీఏసీలో సభ్యుడుగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డిని పీఏసీ ఛైర్మన్‌గా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నియమించారు.
* 2015, ఆగస్టు 25న పీఏసీ ఛైర్మన్‌గా పనిచేసిన మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ఎమ్మేల్యే పి.కృష్ణారెడ్డి మృతి చెందడంతో పీఏసీ ఛైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీలో తాజాగా రాంరెడ్డి వెంకటరెడ్డి నియమితులయ్యారు.
* రాంరెడ్డి వెంకటరెడ్డి ఐదోసారి శాసనసభకు ఎన్నికై కొనసాగుతున్నారు. (1996, 1999, 2004, 2009, 2014)
* రాంరెడ్డి వెంకటరెడ్డి గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
ట్యాంక్‌బండ్‌పై ‘కాకా’ విగ్రహం
* కేంద్ర మాజీ మంత్రి; దళిత, కార్మిక నేత గడ్డం వెంకట స్వామి (కాకా) 86వ జయంతిని పురస్కరించుకుని 2015, అక్టోబరు 5న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ పార్కులో ఆయన విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
* ఈ సందర్భంగా వెంకటస్వామి ఆత్మకథ ‘మేరా సఫర్’ పుస్తకాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు.
* రెండుసార్లు రాష్ట్ర శాసనసభకు, 7 సార్లు పార్లమెంటుకు ఎన్నికైన ‘కాకా’ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ వివిధ (కార్మిక, గ్రామీణాభివృద్ధి, టెక్స్టైల్స్) మంత్రి పదవులను చేపట్టారు.
* 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకటస్వామి వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడుగా కూడా పనిచేశారు. 2014, డిసెంబరు 22న మృతిచెందారు.
‘కున్’ను అధిరోహించిన రాధిక
* తెలంగాణకు చెందిన పోలీసు అధికారిణి జి.ఆర్. రాధిక జమ్మూకశ్మీర్‌లోని జాన్సకర్ శ్రేణి హిమాలయాల్లోని 7,077 మీటర్ల ఎత్తయిన కున్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు.
* రాధిక ఆదిలాబాద్ జిల్లాలో అడ్మిన్ విభాగంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు.
* 2015, సెప్టెంబరు 7న ఆమె ఈ ఘనతను సాధించారు.
మాదిరి ప్రశ్నలు
1. రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలుగులో తొలిసారిగా తెలంగాణ, ఆర్థిక చిత్రం-2015 పుస్తకాన్ని ఇటీవల ఏ పేరుతో విడుదల చేసింది?
ఎ) బంగారు తెలంగాణ దిశగా – తొలి అడుగులు
బి) బంగారు తెలంగాణ – ఒక ఆశయం
సి) తెలంగాణ పునరావిష్కరణ – తొలి అడుగు
డి) బంగారు తెలంగాణ దిశగా – తొలిప్రయత్నం
జ: (ఎ)
2. తెలంగాణలోని ఏ నియోజకవర్గం 100 శాతం మరుగుదొడ్లు ఉన్నదిగా గుర్తింపు పొందింది?
ఎ) సిరిసిల్ల బి) సిద్దిపేట సి) గజ్వేల్ డి) హుజుర్నగర్
జ: (బి)
3. పల్లెపాలనలో పారదర్శకత, సౌలభ్యం, పల్లె ప్రజల ముంగిట్లోకి ఆర్థిక, పౌరసేవలు అందించడం లక్ష్యంగా ‘ఈ-పంచాయతీ’ కార్యక్రమం 2015, అక్టోరు 2న ఏ గ్రామపంచాయతీలో ప్రారంభమైంది?
ఎ) గంగదేవిపల్లి బి) ఎర్రవల్లి సి) అంకాపూర్ డి) బీబీపేట
జ: (డి)
4. ‘మేరా సఫర్’ పుస్తకం ఎవరి ఆత్మకథ?
ఎ) ప్రొఫెసర్ జయశంకర్ బి) కొండా లక్ష్మణ్ బాపూజీ సి) జి.వెంకటస్వామి (కాకా) డి) రావి నారాయణరెడ్డి
జ: (సి)
5. తెలంగాణకు చెందిన పోలీసు అధికారిణి జి.ఆర్.రాధిక 2015, సెప్టెంబరులో హిమాలయాల్లోని ఏ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు?
ఎ) కాంచనగంగ బి) ఎవరెస్ట్ సి) నున్ డి) కున్
జ: (డి)
6. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కి చెందిన హైదరాబాద్‌లోని ఏ విభాగానికి అబ్దుల్ కలాం పేరు పెట్టారు? (కింది మూడింటిని కలిపి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌గా నామకరణం చేశారు.)
ఎ) డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్)
బి) రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ)
సి) అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ (ఏఎస్ఎల్)
డి) ఏదీకాదు
జ: (బి)
7. 2015 అక్టోబరులో తెలంగాణ శాసనసభ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌గా ఎవరిని నియమించారు?
ఎ) గంగుల కమలాకర్ బి) మంచిరెడ్డి కృష్ణారెడ్డి సి) డాక్టర్ కె.లక్ష్మణ్ డి) రాంరెడ్డి వెంకటరెడ్డి
జ: (డి)
Leave a Reply