National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part XI
గుండెపోటు మరణాలే అధికం
- దేశ వ్యాప్తంగా 2011లో సేకరించిన ఎంసీసీడీ (మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ – మృతికి కారణాలపై వైద్య ధ్రువీకరణ) గణాంక వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. వైద్య ధ్రువీకరణ జరిగిన మరణాల్లో ఎక్కువ శాతానికి గుండెపోటు కారణమని ఈ గణాంకాల్లో తేలింది.
* మరణాలకు కారణాలను వైద్యపరంగా ధ్రువీకరించి (ఎంసీసీడీ) నమోదు చేయడంలో నూరు శాతం సాధించి చండీగఢ్, గోవాలు ముందున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 17వ స్థానం (15.8 శాతం నమోదు)లో ఉండగా కేవలం 0.4 శాతం నమోదుతో ఝార్ఖండ్ ఆఖరి స్థానంలో నిలిచింది.
* దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం మరణాల్లో ఎంసీసీడీలో నమోదైనవి 20 శాతం మాత్రమే. ఏ కారణంతో ఎంతమంది మృతి చెందుతున్నారో ధ్రువీకరించడం వల్ల ప్రభుత్వం అత్యధిక మరణాలకు కారణాలపై దృష్టిపెట్టి వాటిని నివారించేందుకు అవకాశం ఉంటుంది.
* ప్రతి 10 మంది మృతుల్లో ఒకరు ఏడాది లోపు వయసున్న వారే. గణాంకాల ప్రకారం.. 45 ఏళ్లకు పైబడిన వారిలో అత్యధిక మరణాలకు గుండెపోటే కారణం.
దేశ వ్యాప్తంగా ఎంసీసీడీ వెల్లడించిన కారణాలు
1. రక్త ప్రసరణ వ్యవస్థలో అడ్డంకులు: శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థలో అడ్డంకుల వల్ల ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో గుండె, ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల జరిగే మరణాలు 67.7 శాతం. వైద్య ధ్రువీకరణ జరిగిన ప్రతి అయిదు మరణాల్లో ఒకటి ఈ రెండింటికి సంబంధించిందే.
2. ఇన్ఫెక్షన్లు: ఇన్ఫెక్షన్ల వల్ల జరిగే మరణాలకు క్షయ (33.1 శాతం), సెప్టిసీమియాలే (32.7 శాతం) ప్రధాన కారణాలు. మొత్తం వైద్య ధ్రువీకరణ మృతుల్లో క్షయ వ్యాధితో చనిపోయినవారు 4.1 శాతం మంది.
3. శ్వాసకోశ సమస్యలు: ఇలాంటి మృతుల్లో నిమోనియా (21.7 శాతం), ఆస్తమా (8 శాతం) మరణాలు ఎక్కువ. మొత్తం ఎంసీసీడీ మరణాల్లో నిమోనియాతోనే 2 శాతం మంది చనిపోయినట్ల గుర్తించారు.
4. గాయాలు: దీనిలో కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్లతో మృతి చెందినవారు 25.2 శాతం.
5. శిశు మరణాలు: గర్భిణిగా ఉన్పప్పుడు పుట్టబోయే బిడ్డ విషయంలో తల్లి తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ప్రసవానంతరం ఆక్సిజన్ అందక మృతి చెందిన శిశువులు 40.6 శాతం.
6. క్యాన్సర్: నాలుగో వంతుకు పైగా మరణాలకు జీర్ణవ్యవస్థ క్యాన్సర్లే కారణమని గణాంకాలు వెల్లడించాయి.
7. జీర్ణవ్యవస్థ వ్యాధులు: ఇందులో కాలేయ వ్యాధుల మృతులే 64.3 శాతం. మొత్తం వైద్య ధ్రువీకరణాల్లో ఈ తరహా మరణాలు 2.8 శాతం.
8. ఏ వర్గానికీ చెందనివి: లక్షణాలు, సంకేతాలు, పరీక్షలు, ఫలితాలు ఇవేవీ లేకుండా జబ్బు ఏమిటో నిర్దిష్టంగా కారణాన్ని గుర్తించలేని మృతుల శాతం 12.3గా నమోదైంది.
ప్రతిపాదనల పరిమితి పెంపు
- విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ – ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్) ఇక నుంచి రూ.3 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలను సిఫారసు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
* ఇంతవరకు రూ. 2వేల కోట్ల మేర ప్రతిపాదనలను మాత్రమే సిఫారసు చేసే అవకాశం ఎఫ్ఐపీబీకి ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) మరింతగా ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
* రూ.3వేల కోట్లకు మించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాలపై మంత్రివర్గ సంఘం (సీసీఈఏ – క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్) ఆమోదించాల్సి ఉంది.
* దేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య ఎఫ్‌డీఐలు 39 శాతం పెరిగి 28.81 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.73 లక్షల కోట్లు)కు చేరాయి.
* ప్రస్తుతం అధిక రంగాల్లో ఎఫ్‌డీఐలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కు సమాచారం తెలపడం మినహా ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేదు.
సామాజిక భద్రత పథకాలు
- 2015 మే 9న ప్రధాని నరేంద్రమోదీ కోల్‌కతాలో మూడు సామాజిక భద్రత పథకాలను ప్రారంభించారు. ప్రధాన్‌మంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధాన్‌మంత్రి సురక్ష బీమా, అటల్ ఫించన్ యోజన అనే మూడు పథకాలను ఆయన ప్రారంభించారు.
* మూడు సామాజిక భద్రత పథకాల ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీలు పాల్గొన్నారు.
* 2015 మే 1 నుంచి బ్యాంకులు ఈ పథకాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటికీ జూన్ 1 నుంచి ఈ మూడు పథకాలు అమల్లోకి వచ్చాయి.
ప్రధాన్‌మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎమ్‌జేజేబీవై):
- ఈ పథకంలో భాగంగా బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్నవారికి ఏటా రూ. 330 ప్రీమియంతో రూ. 2 లక్షల జీవిత బీమా లభిస్తుంది. దరఖాస్తుదారులు 18-50 ఏళ్ల వయసు వారై ఉండాలి.
ప్రధాన్‌మంత్రి సురక్షా బీమా యోజన (పీఎమ్ఎస్బీవై):
- ఈ పథకం కింద 18-70 వయసున్న వారు ఏటా రూ. 12 ప్రీమియం చెల్లిస్తే ప్రమాదంలో చనిపోయినా, అంగవైకల్యానికి గురైనా రూ.2 లక్షల బీమా అందుతుంది.
అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)
- ఈ పథకం కింద అసంఘటిత రంగ కార్మికులకు వారి ప్రీమియాన్ని బట్టి రూ. 1000 నుంచి రూ.5000 వరకు పింఛను అందిస్తారు. 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న బ్యాంక్ ఖాతాదారులకు ఇది వర్తిస్తుంది.
Leave a Reply