National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part III
* ప్రణాళిక సంఘం రద్దు
* నీతిఆయోగ్ ఏర్పాటు
ఏ దేశంలో అయినా.. ఏ వ్యవస్థలో అయినా మార్పు అనివార్యం. సమాజ, మానవ జీవన పరిణామక్రమం చెబుతున్న సత్యమిది. ఒకప్పుడు గొప్పగా పనిచేసే వ్యవస్థలు.. సంస్థలు.. ఏవైనా అనంతర కాలంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా మార్పు చెందడమో.. కొత్తరూపును సంతరించుకోవడమో తప్పనిసరి. భారతదేశంలో ఆరు దశాబ్దాలకు పైగా పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతిఆయోగ్ కూడా ఇలాంటిదే. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి అప్పటి భారతదేశ అవసరాల దృష్ట్యా తొలి ప్రధాని నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం దేశాభివృద్ధి దిశగా అనేక విజయాలు సాధించింది. క్రమేపీ కొన్ని విమర్శలకు కూడా గురైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ హయాంలో ప్రణాళిక సంఘం రద్దయి కొత్త వ్యవస్థగా నీతిఆయోగ్ ఏర్పాటైంది. ప్రణాళిక సంఘం ఎలా పనిచేసింది? నీతిఆయోగ్ ఎలా పనిచేయనుంది? విశేషాల సమాహారమిది..
స్వాతంత్య్రం సాధించిన తర్వాత భారతదేశంలో.. వివిధ రంగాల్లో పెద్దఎత్తున జరగాల్సిన అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న రోజులవి. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ భావాలకు, రష్యా సాధించిన పురోగతికి ప్రభావితమై.. దేశం ప్రగతిబాటలో పయనించాలంటే అది ప్రణాళికబద్ధమైన వ్యూహాలతోనే సాధ్యమని విశ్వసించారు. ఈ మేరకు 1950, మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దూరదృష్టితో దేశ అవసరాలకు సరిపోయేలా విధి విధానాలను రూపొందించడం.. వివిధ రంగాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించడం.. దేశ ఆర్థిక వనరులను రాష్ట్రాలకు కేటాయించడం.. లాంటి ప్రధాన లక్ష్యాలతో ప్రణాళిక సంఘం ముందుకు సాగింది. ఏర్పడిన నాటి నుంచి మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ప్రధాని నేతృత్వంలో పనిచేసే ప్రణాళిక సంఘంలో క్యాబినెట్ హోదా కలిగిన ఒక ఉపాధ్యక్షుడు, సెక్రటరీతోపాటు కొంతమంది మేధావులు సభ్యులుగా ఉంటారు.
విజయాలు.. విమర్శలు
ఆరు దశాబ్ధాలకు పైగా ప్రణాళిక సంఘం ద్వారా అమలైన 12 పంచవర్ష ప్రణాళికలు దేశంలో అనేక విజయాలు సాధించాయి. కొన్ని చేదు అనుభవాలనూ మిగిల్చాయి. స్వాతంత్య్రం సాధించిన తొలినాళ్లలో దేశాభివృద్ధిలో పంచవర్ష ప్రణాళికల పాత్ర అమోఘమని చెప్పవచ్చు. పంచవర్ష ప్రణాళికలే లేకపోతే ప్రభుత్వాలకు దిశా నిర్దేశం ఉండేది కాదన్నంతగా ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే క్రమంగా ప్రణాళిక సంఘం పాత్రపై విమర్శలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం సాధించిన దశాబ్దాల తర్వాత కూడా అసమానతలు, పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యాలను సాధించడంలో ప్రణాళిక సంఘం విఫలమయ్యిందనే భావన నెలకొంది. ఆర్థిక వనరుల పంపిణీపై ఆదేశాలు జారీచేసే స్థాయిలో పనిచేసే ప్రణాళిక సంఘం కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు అడ్డంకిగా మారిందని, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఉందన్న అభిప్రాయం బలపడుతూ వచ్చింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆర్థిక సంఘం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం కూడా సరికాదని ఆర్థిక నిపుణులు వాదిస్తూ వచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణల వైపు దేశం ప్రయాణిస్తున్న తరుణంలో ప్రపంచ స్థితిగతులను బట్టి ఎప్పటికప్పుడు స్పందించాల్సిన ఈ సందర్భంలో ప్రణాళిక సంఘం ఔచిత్యం ప్రశ్నార్థకం అయ్యింది.
నీతిఆయోగ్ వ్యవస్థ
ప్రణాళిక సంఘం ఔచిత్యం ప్రశ్నార్థకమైన నేపథ్యంలో.. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ప్రణాళిక సంఘంలోని లోటుపాట్లను సరిదిద్దే విధంగా దాని స్థానంలో 2015 జనవరి 1న నీతిఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా)ను ప్రవేశపెట్టింది. భిన్న సంస్కృతులు, భాషలు, భావాలు, ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు, జాతులు, వనరులతో.. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో అన్ని ప్రాంతాలకు ఒకే అభివృద్ధి మంత్రం పని చేయదనే విషయాన్ని గుర్తించి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలయినా అనుకున్న ఫలితాలను సాధించలేవని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే ఆర్థిక సంస్కరణలతో పాటు పరిపాలన విధానాల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
స్వరూపం
ప్రధానమంత్రి నేతృత్వంలోని నీతిఆయోగ్‌లో ఒక ఉపాధ్యక్షుడు, రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులు. ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులుగా అరవింద్ పణగారియా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన అంశాలపై నిర్ణయాల కోసం ముఖ్యమంత్రులతో కూడిన ఉప సంఘాల రూపంలో నీతిఆయోగ్ పని చేస్తుంది. ఉదాహరణకు స్వచ్ఛభారత్‌కు సంబంధించిన బృందానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్ధీకరణకు సంబంధించిన బృందానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ విధంగా నీతి ఆయోగ్ ప్రభుత్వానికి ఒక మేధోమథన బృందంగా, ఒక సలహా మండలిగా, కేంద్ర రాష్ట్రాల కౌన్సిల్‌గా, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయకర్తగా పలురకాల పాత్రలను పోషిస్తుంది. రాష్ట్రాల మధ్య వైవిధ్యాలను, వివిధ ప్రాంతాల బలాలను, బలహీనతలను గుర్తిస్తుంది. ఆభివృద్ధి పథంలో వివిధ దశల్లో ఉన్న రాష్ట్రాల అవసరాలను గుర్తించి చర్యలను సూచించే విధంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. దీనివల్ల విధానాలు మరింత పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. నీతి ఆయోగ్ వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలు నెలకొనకుండా ఉంటాయి. దీని వల్ల రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి నీతిఆయోగ్‌ను మారిన అవసరాలకు తగిందిగా, సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసే సంస్థగా భావంచవచ్చు. నీతి ఆయోగ్ మొదటి సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నీతి ఆయోగ్ భారతదేశం తలరాతను మార్చే టీమ్ ఇండియాగా అభివర్ణించారు.
ప్రణాళికలు.. లక్ష్యాలు
* 1951లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రధానంగా వ్యవసాయంతో పాటు, నీటి పారుదల, ఇంధన శక్తి, రవాణా, సామాజిక అభివృద్ధి లాంటి అంశాలపై దృష్టి సారించారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా యూజీసీ, అయిదు ఐఐటీలు లాంటి సంస్థలు ప్రారంభమయ్యాయి.
* 1956-61 మధ్య కాలంలో అమలైన రెండో పంచవర్ష ప్రణాళిక ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
* 1961-66 మధ్య కార్యరూపంలోకి వచ్చిన మూడో పంచవర్ష ప్రణాళిక చైనాతో జరిగిన యుద్ధం, దేశంలో ఏర్పడిన కరవు దృష్ట్యా రక్షణ, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
* మూడో పంచవర్ష ప్రణాళిక వైఫల్యం, వనరుల లేమి, ద్రవ్యోల్బణం పెరుగుదల లాంటి కారణాల వల్ల 1966-69 మధ్యకాలంలో కేవలం వార్షిక ప్రణాళికలకే పరిమితం అయ్యారు.
* 1969-74 మధ్య అమలైన నాలుగో పంచవర్ష ప్రణాళిక బ్యాంకులను ప్రభుత్వపరం చేయడం, హరిత విప్లవం, పేదరిక నిర్మూలన లాంటి చర్యలకు నాంది పలికింది.
* 1974-79 మధ్య ప్రవేశపెట్టిన 5వ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టింది.ఇదే సమయంలో జాతీయ రహదారుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. 1978-80లో నిరంతర ప్రణాళికను అమలు చేశారు.
* 1980-85 మధ్య సాగిన ఆరో పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక సరళీకరణలపై దృష్టి పెట్టారు.
* 1985-90 మధ్య కాలంలో కార్యరూపం దాల్చిన ఏడో పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక ఉత్పత్తుల్లో ప్రగతి, ఉపాధికల్పన అంశాల్లో క్రియాశీలం అయింది.
* 1990-92 మధ్య నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభాల కారణంగా పంచవర్ష ప్రణాళిక అమలు కాలేదు. కేవలం వార్షిక ప్రణాళికల ఆధారంగా నిర్ణయాలు జరిగాయి.
* 1992-97 మధ్య అమలైన 8వ పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థను విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా తయారుచేసే విధంగా సంస్కరణలు చేపట్టడం.. పరిశ్రమలను ఆధునికీకరించడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు.
* 1997-2002 మధ్య అమలైన 9వ పంచవర్ష ప్రణాళిక ఆర్థిక, సామాజిక, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టింది.
* 2002-07 సంవత్సరాల్లో 10వ పంచవర్ష ప్రణాళిక అమల్లోకి వచ్చింది. ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పనలకు ప్రాధాన్యం ఇచ్చారు.
* 2007-12 మధ్య సాగిన 11వ పంచవర్ష ప్రణాళిక ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక రంగాలపై దృష్టి సారించారు.
* పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 2012-17 మధ్య పనిచేయాల్సిన 12వ పంచవర్ష ప్రణాళిక 2014లో మోదీ ప్రభుత్వం నిర్ణయంతో మధ్యలోనే ఆగింది.
Leave a Reply