International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part VII
నోబెల్ బహుమతి అందరికీ తెలిసిందే.. మరి ఉపాధ్యాయ రంగంలో ‘నోబెల్’గా దేన్ని భావిస్తారో తెలుసా? ఒక రెస్టారెంటులో పనిచేసే స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన భారత మహిళా నేత ఎవరు? ఇజ్రాయెల్ పార్లమెంటును ఏమంటారు? గాంధీజీకి అత్యంత ఇష్టమైన పాట ఏది? ఫోలియో ప్రైజ్ అని దేనినంటారు? ప్రపంచ అత్యుత్తమ అయిదుగురు నేతలు ఎవరు? అంతరిక్షంలో వ్యోమగాములు ఎన్ని రోజులు ఉండవచ్చు? ఆసక్తి, విజ్ఞానం కలగలిసిన ఇలాంటి మరెన్నో వర్తమాన అంశాల సమాచారం.. అంతర్జాతీయ విశేషాల సమాహారం…
నాన్సీ అట్వెల్కు ప్రపంచ పురస్కారం
* ఉత్తమ ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు 2015లో తొలిసారిగా నిర్వహించిన ప్రపంచవ్యాప్త పోటీలో అమెరికాకు చెందిన నాన్సీ అట్వెల్ విజేతగా నిలిచి మిలియన్ డాలర్ల (సుమారు రూ.6.20 కోట్లు) పురస్కారాన్ని గెలుచుకున్నారు.
* ఉపాధ్యాయ రంగంలో నోబెల్ బహుమతిగా భావించే ఈ పురస్కారం కోసం 127 దేశాలకు చెందిన 5 వేల మంది పోటీపడ్డారు. ‘వర్కే ఫౌండేషన్’ 1300 మంది దరఖాస్తులను తుది పోటీకి స్వీకరించి, చివరకు 50 మందిని వడపోసింది. వీరిలో అహ్మదాబాద్‌కు చెందిన కిరణ్బిర్సేథీ కూడా ఉన్నారు. ‘వర్కే ఫౌండేషన్’ గౌరవ అధ్యక్షుడిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వ్యవహరిస్తున్నారు.
ఉన్నత నేత స్మృతి ఇరానీ
* ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఇటీవల విడుదల చేసిన యువ అంతర్జాతీయ నేతల జాబితాలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కి చోటు లభించింది. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో పనిచేసే స్థాయి నుంచి దేశంలో ఉన్నత రాజకీయ నేతగా ఎదిగారని డబ్ల్యూఈఎఫ్ ఈ సందర్భంగా స్మృతిని కీర్తించింది.
* ప్రపంచ భవిష్యత్తు కోసం 40 ఏళ్ల లోపు వ్యక్తులు చేసిన కృషిని గుర్తిస్తూ ఏటా డబ్ల్యూఈఎఫ్ ఈ జాబితాను రూపొందిస్తోంది. 2015కు సంబంధించి 187 మందితో కూడిన ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం 11 మందికి స్థానం లభించింది.
కత్రినా కైఫ్ మైనపు విగ్రహం
* లండన్‌లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మైనపు విగ్రహాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. మ్యూజియంలో ఇప్పటివరకు బాలీవుడ్‌కి చెందిన ఆరుగురి మైనపు విగ్రహాలున్నాయి. ఈ క్రమంలో ఏడో బాలీవుడ్ తారగా కత్రినా నిలిచింది. బాలీవుడ్ నుంచి తొలిసారిగా 2000లో అమితాబ్ బచ్చన్ మైనపు విగ్రహం ఇక్కడ కొలువుదీరింది. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్, షారూక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్, మాధురీ దీక్షిత్ ఈ గౌరవాన్ని పొందారు.
రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా రామకృష్ణన్
* భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ బ్రిటన్‌లోని ప్రఖ్యాత శాస్త్రీయ సంస్థ రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2015, డిసెంబరు 1న ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.
* రాయల్ సొసైటీ అధ్యక్ష పీఠాన్ని అలంకరించనున్న మొదటి భారత సంతతి శాస్త్రవేత్త రామకృష్ణన్. రైబోజోమ్స్ కచ్చితమైన ఆకారాన్ని గుర్తించినందుకు 2009లో ఆయనతోపాటు మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
ప్రపంచ పాటల్లో ‘వైష్ణవ జనతో’
* అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా 2015, మార్చి 20న ఐక్యరాజ్య సమితి ఆవిష్కరించిన ప్రపంచ పాటల జాబితాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ బాణీ కట్టిన ‘ఇన్ఫినిట్ లవ్’ పాటను పంపించారు.
* మహాత్మాగాంధీకి అత్యంత ప్రీతిపాత్రమైన గీతం ‘వైష్ణవ జనతో’ తనకు కూడా ఎంతో ఇష్టమని ప్రకటించిన బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ప్రపంచ పాటల జాబితాకు దాన్నే పంపారు. ఐరాస శాంతి, సౌహార్ద్ర రాయబారులు, అంతర్జాతీయ కళాకారులు, ఆస్కార్ విజేతలు ప్రపంచ పాటల జాబితాకు తమకు నచ్చిన, తాము మెచ్చిన పాటలను పంపించారు.
రూ. లక్ష కోట్ల ‘పొగ’
* పొగాకు ఉత్పత్తులకు సంబంధించి భారత్ ఒక సమగ్ర పన్ను విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ధర తక్కువగా ఉండే, స్థానికంగా ఉత్పత్తి చేసే పొగాకు ఉత్పత్తులు సులువుగా అందుబాటులో ఉండటాన్ని నియంత్రించాలంటే ఇది అవసరమని పేర్కొంది. సాధారణంగా వినియోగించే పొగాకు ఉత్పత్తులపై భారత్‌లో పన్నులు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది.
* డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం పొగాకు సంబంధ వ్యాధుల కారణంగా భారత్‌లో ఏటా 10 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. వీటి వినియోగం వల్ల 2011లో 35-69 ఏళ్ల మధ్య వయసువారిలో తలెత్తిన ఆర్థిక నష్టాలు రూ.1,04,500 కోట్ల మేర ఉన్నాయి. దీనివల్ల మానవ ఆరోగ్యమే కాకుండా దేశ ఆర్థిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది.
కంభంపాటికి అమెరికా అధ్యక్ష అవార్డు
* భారత అమెరికన్ శాస్త్రవేత్త, తెలుగువారు అయిన మూర్తి ఎస్. కంభంపాటి ప్రతిష్ఠాత్మక అమెరికా అధ్యక్ష అవార్డుకు ఎంపికయ్యారు. మొత్తం 15 మంది విశిష్ట పరిశోధకులకు ఈ పురస్కారాన్ని వైట్‌హౌస్ ప్రకటించింది. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ సైన్స్, మేథమెటిక్స్ అండ్ ఇంజినీరింగ్ మెంటారింగ్ (పీఏఈఎస్ఎంఈఎం) అనే ఈ పురస్కారాన్ని సైన్స్, ఇంజినీరింగ్ విద్యలో విద్యార్థులకు మార్గదర్శిగా ఉండే వ్యక్తులు, సంస్థలకు అందిస్తారు. విజేతలను వైట్‌హౌస్‌లో సత్కరిస్తారు. వీరికి అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ నుంచి 10 వేల డాలర్లు అందుతాయి. మూర్తి అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లోని సదరన్ యూనివర్సిటీలో జీవశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు.
అఖిల్శర్మకు ‘ఫోలియో ప్రైజ్’
* ఇండో అమెరికన్ రచయిత అఖిల్శర్మకు ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ సాహిత్య పురస్కారం ‘ఫోలియో ప్రైజ్’ లభించింది. శర్మ రాసిన ‘ఫ్యామిలీ లైఫ్’కు ఈ అవార్డు దక్కింది. దిల్లీలో పుట్టి, అమెరికాలో స్థిరపడిన అఖిల్శర్మ ఓ పేద కుర్రాడి జీవితాన్ని తన నవలలో కథా వస్తువుగా తీసుకున్నారని.. శర్మ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మేళవించి రచించిన ఈ నవల అద్భుత కళాఖండమని న్యాయ నిర్ణేతలు అభిప్రాయపడ్డారు.
* అఖిల్శర్మకు ట్రోఫీతో పాటు 40 వేల పౌండ్లు (సుమారు రూ. 37 లక్షలు) ప్రదానం చేశారు. ఫోలియో ప్రైజ్‌ను 2014లో ప్రారంభించారు. గతేడాది అమెరికాకు చెందిన జార్జ్ సాండర్స్ రచించిన ‘టెన్త్ ఆఫ్ డిసెంబర్’ కథల సంపుటికి ఈ పురస్కారం దక్కింది.
ఆస్ట్రేలియా అ’ఖండ’ విజయాలు
వన్డే క్రికెట్ ప్రపంచకప్ – 2015 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. అయిదోసారి ప్రపంచకప్ సాధించి, క్రికెట్ ఆడే అయిదు ఖండాల్లోనూ ప్రపంచకప్‌లు సొంతం చేసుకున్న జట్టుగా క్రికెట్ చరిత్రపై ఆస్ట్రేలియా చెరగని ముద్రవేసింది. 2015, మార్చి 29న మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) నిలిచాడు.
* విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ.24.85 కోట్లు, రన్నరప్ న్యూజిలాండ్‌కు రూ.10.94 కోట్లు, సెమీస్‌లో ఓడిన భారత్, దక్షిణాఫ్రిలకు చెరో రూ.3.75 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది.
* ఇది 11వ ప్రపంచ కప్. ఆస్ట్రేలియా 5 సార్లు; భారత్, వెస్టిండీస్ 2 సార్లు చొప్పున; పాకిస్థాన్, శ్రీలంక చెరోసారి విజేతలుగా నిలిచాయి.
ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మోదీ
2015 సంవత్సరానికి ఫార్చ్యూన్ మ్యాగజీన్ విడుదల చేసిన ప్రపంచ అత్యుత్తమ 50 మంది నేతల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 5వ స్థానంలో నిలిచారు. వ్యాపారం, ప్రభుత్వ కార్యకలాపాలు, దాతృత్వం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన అసాధారణ వ్యక్తులతో కూడిన తమ వార్షిక జాబితాను ఫార్చ్యూన్ విడుదల చేసింది.
* నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఈ జాబితాలో 28వ స్థానంలో నిలిచారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు మరియో డ్రాగి, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పోప్ ఫ్రాన్సిస్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. భారత సంతతికి చెందిన రాజ్ పంజాబీ ఈ జాబితాలో 34వ స్థానాన్ని దక్కించుకున్నారు. లైబీరియా వాసి అయిన ఈయన ‘లాస్ట్ మైల్ హెల్త్’ అనే స్వచ్ఛంద సంస్థకు సీఈవోగా ఉన్నారు.
అంతరిక్షంలో ఏడాది!
* అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో గతంలో ఎన్నడూలేని విధంగా వ్యోమగాములు ఏడాదిపాటు నివసించే కొత్త ప్రయోగానికి ఇటీవలే తెరలేచింది. 2015 మార్చిలో కజకిస్థాన్ నుంచి బయలుదేరిన ముగ్గురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు విజయవంతంగా చేరుకున్నారు. వీరిలో ఇద్దరు మైఖేల్ కోర్నియెంకో (రష్యా), స్కాట్ కెల్లీ (అమెరికా) ఐఎస్ఎస్లో 342 రోజుల పాటు ఉండనున్నారు. మరో వ్యోమగామి గెన్నడీ (రష్యా) ఆరు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉండి భూమికి చేరుకుంటారు.
* ఐఎస్ఎస్లో ఇప్పటివరకు ఏ వ్యోమగామి అయినా గరిష్ఠంగా 6 నెలల పాటే ఉంటున్నారు. అంతకుమించిన సమయం ఉంటే శారీరక సమస్యలు తలెత్తవచ్చన్న సందేహాల నేపథ్యంలో.. ఈ పరిమితిని విధించారు. అయితే అంగారక యాత్ర లాంటి సుదీర్ఘ గ్రహాంతర యానాలకు వ్యోమగాములు భవిష్యత్తులో వెళ్లాలంటే 6 నెలల సమయం సరిపోదు. అందుకే అంతరిక్షంలో ఎక్కువ కాలం పాటు ఉంటే ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడానికి ఈసారి వ్యోమగాములను దాదాపు ఏడాదిపాటు అక్కడ ఉంచడానికి నిర్ణయించారు.
నాలుగోసారి నెతన్యాహు
* ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు తిరిగి ఎన్నికయ్యారు. 2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని లికుడ్ పార్టీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. నెతన్యాహు ప్రధాని పదవిని చేపట్టడం ఇది వరుసగా నాలుగోసారి.
* ఇజ్రాయెల్‌లో పార్లమెంటు సభ్యుల పదవీకాలం మూడేళ్లు మాత్రమే. ఆ దేశ పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 120. పార్లమెంట్‌ను ‘నెస్సెట్’గా వ్యవహరిస్తారు.
సింగపూర్ జాతిపిత అస్తమయం
* సింగపూర్ జాతి పిత, తొలి ప్రధానమంత్రి లీ క్వాన్ యూ 2015, మార్చి 23న సింగపూర్‌లో మరణించారు. 1923లో చైనీస్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన లీ 1959లో సింగపూర్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. ప్రధానిగా 31 ఏళ్లు కొనసాగారు.
* ఒకప్పటి బ్రిటిష్ వలస రాజ్యమైన సింగపూర్‌ను ప్రపంచస్థాయి వాణిజ్య కేంద్రంగా అవతరింపజేయడానికి ఆయన విశేష కృషి చేశారు. అవినీతిరహితంగా, సమర్థ పాలనను అందిస్తూ, చక్కని సామరస్య పూర్వక జీవనానికి లీ పెద్దపీట వేశారు. తక్కువ పన్నులు ఉండేలా చూశారు. దీంతో ప్రపంచంలోని అనేక భారీ కంపెనీలు సింగపూర్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టాయి. ఆయన పెద్ద కుమారుడు లీ సీన్లూంగ్ 2004 నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
భారత్‌కు ఫైటర్ విమానాలు
* ఆధునికీకరించిన రెండు మిరాజ్ 2000 ఫైటర్ విమానాలను ఫ్రాన్స్‌కు చెందిన రక్షణ కంపెనీ ‘ద సాల్ట్ ఏవియేషన్’ తొలిదశ కింద 2015 మార్చిలో భారత్‌కు అప్పజెప్పింది. ద సాల్ట్ ఏవియేషన్.. థేల్స్ సహాయంతో మొత్తం 48 విమానాలను ఆధునికీకరించే రూ. 10,000 కోట్ల కాంట్రాక్టుపై 2011 జులైలో భారత్ సంతకాలు చేసింది. ఈ ఆధునికీకరించిన మిరాజ్లలో నేవిగేషన్, రాడార్, మిస్సైల్ వ్యవస్థలను అత్యాధునిక రీతిలో తీర్చిదిద్దారు.
మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించారు. గాంధీ విగ్రహ స్మారక ట్రస్టు వ్యవస్థాపకుడు ఎవరు?
ఎ) ఫిలిప్ జాక్సన్ బి) లార్డ్ మేఘనాథ్ దేశాయ్ సి) లక్ష్మీ మిట్టల్ డి) రాహుల్ బజాజ్
జ: (బి)
2. ఏ గ్రహానికి చెందిన చందమామ ‘ఎన్సెలాడస్’పై జీవం మనుగడకు తోడ్పాటును ఇచ్చే హైడ్రోథర్మల్ చర్యలున్నాయని ఇటీవల నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు?
ఎ) శని బి) గురుడు సి) బుధుడు డి) అంగారకుడు
జ: (ఎ)
3. అమెరికా విద్యామండలి ఛైర్‌పర్సన్‌గా నియమితులైన భారతీయ అమెరికన్ మహిళ ఎవరు?
ఎ) స్వాతి పిరమాల్ బి) కీర్తి ముంజాల్ సి) రేణు ఖతార్ డి) జానకీ కృష్ణన్
జ: (సి)
4. ఎస్సెమ్మెస్ ఆఫ్ ద ఇంట ర్నెట్గా పేరుగాంచిన ట్విట్టర్ 2015, మార్చి 21 నాటికి ఎన్నేళ్లు పూర్తి చేసుకుంది?
ఎ) ఏడు బి) ఎనిమిది సి) తొమ్మిది డి) పది
జ: (సి)
5. ఆస్ట్రేలియా అకాడెమీ ఆఫ్ సైన్సెస్ కరస్పాండింగ్ సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన భారతీయుడు ఎవరు? (ఈ ఘనత సాధించిన తొలి భారతీయ శాస్త్రవేత్త ఈయనే)
ఎ) ఆర్.కె.పచౌరి బి) కె.రాధాకృష్ణన్ సి) కె.హరినారాయణ డి) సీఎన్ఆర్ రావు
జ: (డి)
6. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ‘హుతి’ తిరుగుబాటుదారులు ఏ దేశంతో సంబంధం కలిగి ఉన్నారు?
ఎ) యెమెన్ బి) పాకిస్థాన్ సి) బంగ్లాదేశ్ డి) ఇరాక్
జ: (ఎ)
Leave a Reply