International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part I
అంతర్జాతీయంగా 2015లో చోటు చేసుకున్న ప్రధాన అంశాలివి. వీటిలో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. నేపాల్‌ను వణికించిన భూకంపం.. ఐఎస్ ఉగ్రవాద చర్యలు.. జపాన్‌లో పెరుగుతున్న వృద్ధ జనాభా వంటివి ఉన్నాయి. భారత్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు, కీలక ఒప్పందాలు.. హైదరాబాద్ నిజాం నిధుల కేసులో భారత్ విజయం.. గణతంత్ర వేడుకలకు ఒబామా రాక వంటి విశేషాల సమాహారం.
ఇదే తొలిసారి
* 66వ భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి. 2015 జనవరి 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన ఒబామా గణతంత్ర వేడుకల్లో కూడా పాల్గొన్నారు.
* భారత్ – అమెరికా పౌర అణు ఒప్పందంలో ఆరేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. వాణిజ్య, రక్షణ రంగాల్లో పరస్పర సహకారానికి రెండు దేశాలూ నిర్ణయించాయి. తొలిసారిగా రెండు దేశాల అగ్రనేతలు, జాతీయ సలహాదారుల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. ఒబామా, మోదీల మధ్య చర్చల అనంతరం రెండు దేశాలూ ‘చలే సాత్ సాత్’ పేరుతో సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
చదువుల్లో బాలికల ముందంజ
* ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం దేశాల్లో చదువుల్లో బాలుర కంటే బాలికలే ఉత్తమంగా నిలుస్తున్నట్లు గ్లాస్గో, మిస్సౌరీ విశ్వవిద్యాలయాల మానసిక శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. గణితం, సాహిత్యం, శాస్త్ర సంబంధిత అంశాల్లో 15 ఏళ్ల బాలికలు తమ తోటి బాలుర కంటే మెరుగ్గా ఉంటున్నట్లు సర్వేలో తేలింది. 2000-2010 మధ్య ప్రపంచంలోని వివిధ దేశాల్లో విద్యాభ్యాసం చేసిన 1.50 కోట్ల మంది 15 ఏళ్లలోపు బాలబాలికలకు వచ్చిన మార్కులపై సమగ్ర అధ్యయనం చేశాక ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
* సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న దేశాల్లో కూడా బాలబాలికల మధ్య విద్యాపరంగా అంతరం ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. లింగ సమానత తక్కువగా ఉన్న ఖతార్, జోర్డాన్, యూఏఈ లాంటి దేశాల్లోనూ ఫలితాలు ఇలాగే ఉండటం విశేషం.
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) దుశ్చర్య
* 2015 ఫిబ్రవరిలో ఈజిప్టునకు చెందిన 21 మంది క్రిస్టియన్ కార్మికులను ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు లిబియాలో దారుణంగా హతమార్చిన ఘటన సభ్య సమాజాన్ని కలిచివేసింది. లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలోని సముద్ర తీరంలో 21 మంది కార్మికులను హతమార్చిన దృశ్యాలున్న వీడియోను ఐఎస్ ఉగ్రవాదులు ఆన్లైన్లో ఉంచారు. లిబియాలోని సిర్తె పట్టణంలో వీరిని ఐఎస్ ఉగ్రవాదులు అపహరించి ఈ ఘటనకు పాల్పడ్డారు.
శ్రీలంకతో ఒప్పందాలు
* భారత్ – శ్రీలంక దేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే రీతిలో 2015 ఫిబ్రవరి 16న రెండు దేశాలూ పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేశాయి. రక్షణ, భద్రత పరమైన సహకారాన్ని పరస్పరం అందించుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
* అణు సంబంధిత సాంకేతికతను బదలాయించుకోవడం, వనరులను పంచుకోవడం, సిబ్బందికి శిక్షణ, రేడియో ఐసోటోపుల వినియోగం, అణుభద్రత, రేడియో ధార్మికత నుంచి రక్షణ లాంటి అంశాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటాయి. రేడియో ధార్మిక వ్యర్థాల యాజమాన్యం, అణు విపత్తులను తట్టుకోవడం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లోనూ సహకారాన్ని పరస్పరం అందించుకుంటాయి.
* నలంద విశ్వవిద్యాలయం పునర్నిర్మాణ పథకంలో శ్రీలంకకు భాగస్వామ్యం కల్పించే మరో ఒప్పందం పైనా రెండు దేశాలూ సంతకాలు చేశాయి.
భయపెడుతున్న మధుమేహం
* ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య 2035 నాటికి 60 కోట్లకు చేరుకుంటుందని 2015 ఫిబ్రవరిలో దోహాలో జరిగిన ‘ప్రపంచ ఆరోగ్య వినూత్న ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు'(విష్) వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 2014లో ఆరోగ్య రంగంపై చేసిన ఖర్చులో 11 శాతం కేవలం మధుమేహ సంబంధిత మందుల కోసమే వెచ్చించారు. 2014లో మధుమేహ వ్యాధిగ్రస్థులు తమ మందులపై చేసిన 612 బిలియన్ డాలర్ల ఖర్చు (సుమారు రూ. 36.72 లక్షల కోట్లు) నైజీరియా లేదా స్వీడన్ లాంటి దేశాల మొత్తం స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువ. ప్రతి పదిమంది వయోజనుల్లో ఒకరు మధుమేహం బారిన పడతారని సదస్సులో అంచనా వేశారు.
* అంధత్వం, కాలి భాగాలను తొలగించాల్సి రావడం, మూత్రపిండాలు పనిచేయకపోవడం, గుండెపోటు లాంటివి టైప్-2 మధుమేహ రోగుల్లో ఎక్కువగా సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్థులు 35 కోట్ల మంది ఉన్నారు.
‘హైదరాబాద్ నిధుల’ కేసులో భారత్ విజయం
* హైదరాబాద్ నిజాం నవాబు కాలం నాటి నిధులకు సంబంధించిన కేసులో భారత్‌కు అనుకూలంగా బ్రిటన్ కోర్టు 2015 మార్చిలో తీర్పు ఇచ్చింది. పాకిస్థాన్ వైఖరిని తప్పుపట్టింది. భారత్‌కు న్యాయ రుసుముల కింద 1.50 లక్షల పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.35 కోట్లు) చెల్లించాల్సిందిగా లండన్‌లోని న్యాయస్థానం పాకిస్థాన్‌కు ఆదేశాలు జారీచేసింది. నిజాం కాలం నాటి డబ్బుకు సంబంధించి 67 ఏళ్లుగా కొనసాగుతున్న కేసులో పాకిస్థాన్ తీరు సహేతుకంగా లేదని నిర్ణయించి ఈ తీర్పునిచ్చింది.
* ‘హైదరాబాద్ నిధుల’ కేసుగా ఈ వ్యాజ్యం పేరొందింది. వివాదంలో ఉన్న డబ్బు ప్రస్తుత విలువ 3.5 కోట్ల పౌండ్లు. (సుమారు రూ. 315 కోట్లు). ఈ కేసు మూలాలు 1948 నాటివి. హైదరాబాద్ రాజ్య ఏడో నిజాం నవాబుకు ప్రతినిధినని చెబుతూ ఓ వ్యక్తి అప్పట్లో 10.07 లక్షల పౌండ్లను యూకేలోని పాక్ హైకమిషనర్ హబీబ్ రహంతుల్లా పేరిట లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకు ఖాతాకు మళ్లించారు. 1947లో భారత్, పాకిస్థాన్‌లు సార్వభౌమ దేశాలుగా ఆవిర్భవించాక ఉపఖండంలోని రాజ్యాలు ఈ రెండింటిలో ఏదో ఒకదానిలో చేరడానికి, లేదా స్వతంత్రంగా ఉండటానికి యూకే అనుమతించడంతో స్వతంత్రంగానే ఉండాలని నిజాం నిర్ణయించుకున్నారు. 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 20న 10.07 లక్షల పౌండ్లు లండన్‌కు బదిలీ అయ్యాయి. తన ఆమోదం లేకుండా జరిగిన ఈ మళ్లింపును రద్దుచేసి, డబ్బును తిరిగి బదిలీ చేయాలని నిజాం కోరారు. ఆ విధంగా చేయలేమంటూ బ్యాంకు నిరాకరించింది. అప్పటి నుంచి అనేక ఏళ్లుగా ఆ నిధి విషయం తేలలేదు. ఇది నిజాం సొంతడబ్బు కాదనీ, అది ప్రభుత్వ ధనమైనందున తమకు ఇవ్వాలనీ భారత ప్రభుత్వం ఇన్నేళ్లుగా వాదిస్తూ వస్తోంది. ఎట్టకేలకు న్యాయస్థానంలో పాక్‌కు ఎదురుదెబ్బ తగలడంతో నిజాం కాలంనాటి నిధిని వెనక్కి తెచ్చుకునేందుకు భారత్‌కు అవకాశం లభించింది.
మూడు దేశాల్లో మోదీ పర్యటన
* 2015 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో పర్యటించారు. సీషెల్స్‌లో భారత్ సహకారంతో ఏర్పాటైన ‘తీరప్రాంత నిఘా ప్రాజెక్టు’ను మోదీ ప్రారంభించారు. సముద్ర గస్తీకి ఉపయోగపడే డార్నియర్ విమానాన్ని సీషెల్స్‌కు అందజేస్తామని మోదీ ప్రకటించారు.
* సీషెల్స్ హైడ్రాలజీ నిల్వల సర్వే, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మార్గ నిర్దేశక పటాల సంయుక్త తయారీ, అమ్మకానికి సంబంధించి ఇరు దేశాలూ నాలుగు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. సీషెల్స్ పత్రిపాదించే ‘నీలి ఆర్థిక వ్యవస్థ’ (సముద్రం కేంద్రంగా ఆర్థిక కార్యకలాపాలు) అంశంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు.
* మోదీ మారిషస్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 5 ఒప్పందాలు కుదిరాయి. సముద్ర ఆర్థిక రంగంలో పరస్పర సహకారం.. మారిషస్‌లోని అగాలీగా ద్వీపంలో సముద్ర, గగనతల రవాణా సదుపాయాల పెంపుదల.. హోమియోపతితోపాటు సంప్రదాయ వైద్య విధానాల్లో సహకారం.. సాంస్కృతిక రంగంలో ఉమ్మడి కృషి.. భారత్ నుంచి మారిషస్‌కు మామిడి దిగుమతికి సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి.
* 2015 మార్చి 12న మారిషస్ 47వ జాతీయ దినోత్సవంలో ముఖ్యఅతిథిగా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాజధాని పోర్ట్‌లూయిస్‌లో మారిషస్ దేశ జాతీయ శాసనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
* శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 2015 మార్చి 13న శ్రీలంక పార్లమెంటులో ప్రసంగించారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలకు ఊతం ఇవ్వాలన్న ఆకాంక్షను ప్రతిఫలిస్తూ కస్టమ్స్ సహకార ఒప్పందం కింద పన్నేతర అవరోధాలను తగ్గించడానికి, వాణిజ్య ప్రక్రియను సరళీకరించడానికి ఒక ఒప్పందం కుదిరింది. శ్రీలంక రూపాయి స్థిరత్వం కోసం ఆర్బీఐ, శ్రీలంక కేంద్రబ్యాంకు మధ్య ఒప్పందం కుదిరింది.
జపాన్‌లో వృద్ధుల జనాభా
* వరుసగా నాలుగో ఏడాది కూడా జపాన్ జనాభాలో వృద్ధి కనిపించలేదని ఆ ప్రభుత్వం 2015 ఏప్రిల్‌లో ప్రకటించింది. ఏకంగా 15 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయి, 2000 ఏడాది జనాభాకు సమం అయింది. దేశంలో నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.
* గతేడాది అక్టోబరుకు జపాన్ జనాభా 0.17 శాతం (2,15,000 మంది) తగ్గి 12,70,83,000 జనాభా వద్ద స్థిరపడినట్లు ఆ ప్రభుత్వం వెల్లడించింది. 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 11 లక్షలు పెరిగి 3,30,00,000కి చేరుకుని, దేశంలో 14 ఏళ్లకంటే తక్కువ వయసున్న వారి సంఖ్యను మించిపోయినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది. 2060 కల్లా జపాన్ జనాభా 86.7 శాతానికి పడిపోయి, అందులో 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు దాదాపు 40 శాతానికి చేరుకుంటారని ఓ అంచనా.
శ్రీలంక అధ్యక్షుడిగా సిరిసేన
* 2015 జనవరి 8న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మైత్రిపాల సిరిసేన విజయం సాధించి, పదవీ బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడోసారి విజయం సాధించగలనన్న ధీమాతో రెండేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లిన అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే పదేళ్ల పాలనకు ఓటర్లు ముగింపు పలికారు.
* 69 ఏళ్ల రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రజాతీర్పు వెలువడటంలో శ్రీలంకలోని మైనార్టీలైన తమిళులు, ముస్లింలు కీలకపాత్ర పోషించారు. వారు మైత్రిపాల సిరిసేనకు అనుకూలంగా పెద్దఎత్తున ఓట్లు వేశారు. 2009లో ఎల్టీటీఈతో జరిగిన యుద్ధం చివరిదశలో తమిళులపై శ్రీలంక సైన్యం దారుణమైన అకృత్యాలకు పాల్పండిదన్న ఆరోపణలు వచ్చాయి. ఎల్టీటీఈని పూర్తిగా అణిచివేసిన తర్వాత తమిళులకు రాజకీయ అధికారాన్ని బదిలీ చేస్తామని, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేస్తానని రాజపక్సే హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై తమిళుల్లో తీవ్రమైన ఆగ్రహం నెలకొంది. ఎల్టీటీఈ నిర్మూలన తర్వాత శ్రీలంకలో ముస్లింలపై దాడులు మొదలయ్యాయి. దీంతో వారు కూడా రాజపక్సేకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దేశ అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలన్న రాజ్యాంగ నిబంధనను సవరించి మరీ మూడోసారి ఎన్నిక కావడానికి రాజపక్సే చేసిన ప్రయత్నం కూడా వ్యతిరేకతను పెంచింది.
మాదిరి ప్రశ్నలు
1. 2015 జనవరిలో వార్తల్లోకి వచ్చిన వ్యంగ్య రచనల వారపత్రిక ‘ఛార్లీ హెబ్డో’ ఏ దేశానికి చెందింది?
జ: ఫ్రాన్స్
2. 2014 డిసెంబరు 16న ఏ దేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై తాలిబన్ ఉగ్రవాదులు దాడిచేసి 132 విద్యార్థులతో సహా 145 మందిని హతమార్చారు?
జ: పాకిస్థాన్
3. 2015 ఫిబ్రవరిలో ఏ దేశం ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి (తల్లీ, తండ్రి, మహిళా దాత) డీఎన్ఏలతో ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానాన్ని పొందడాన్ని చట్టబద్ధం చేసింది?
జ: బ్రిటన్
4. శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన 2015 ఫిబ్రవరిలో తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఏ దేశాన్ని సందర్శించారు?
జ: ఇండియా
5. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ – 2015లో భారత్ స్థానం?
జ: 136
6. 2015 మార్చిలో ‘ఐరాస విపత్తు ప్రమాదాల నివారణ మూడో ప్రపంచ సదస్సు’ను ఎక్కడ నిర్వహించారు?
జ: సెన్డాయ్, జపాన్
7. ప్రతిష్ఠాత్మక ‘సిల్క్‌రోడ్’ రహదారుల ప్రాజెక్టు ఏ దేశానికి చెందింది?
జ: చైనా
8. ‘వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్’ విడుదల చేసిన ‘ఓపెన్ గవర్నమెంట్ ఇండెక్స్-2015’లో భారత్ స్థానం? (వివిధ దేశాల్లో అమల్లో ఉన్న చట్టాలు, సమాచార హక్కు, పౌరుల భాగస్వామ్యం, ఫిర్యాదు వ్యవస్థలను పరిశీలించి ఈ నివేదికను విడుదల చేశారు. దక్షిణాసియాకు సంబంధించి భారత్ ఈ నివేదికలో తొలిస్థానంలో నిలిచింది.)
జ: 37
9. 2015 చైనా బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం?
జ: రూ.9,06,800 కోట్లు
10. 2015 మార్చిలో సీషెల్స్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఆయన ఎవరు?
జ: జేమ్స్ అలిక్స్ మైఖేల్
Leave a Reply