National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part VI
- అమెరికాను భారత్ వెనక్కి నెట్టింది.. ఎందులో? కేంద్రం రెండు రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది.. ఏయే రాష్ట్రాలకు? ఏ ప్రాజెక్టుకు? ప్రధాని ప్రారంభించిన ‘ప్రగతి’ దేనికి సంబంధించింది? భారత ప్రధానుల్లో ‘భారతరత్న’లు ఎవరెవరు? అవాక్స్ – ఏమిటిది? భారత నగరాల్లో సంపన్నులు ఎక్కువగా ఉన్నవేవో తెలుసా? మరి ఇలాంటి విజ్ఞానదాయక అంశాలను తెలుసుకోవాలంటే చదవండి
ఉక్కు ఉత్పత్తిలో ప్రగతి
- ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో 2014లో నాలుగో స్థానంలో ఉన్న భారత్ 2015 ఫిబ్రవరి నాటికి మూడో స్థానానికి చేరింది. 2015 జనవరి-ఫిబ్రవరి నెలల్లో 14.56 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయడం ద్వారా అమెరికా(13.52 మి.ట.)ను వెనక్కి నెట్టింది. 2009లో భారత్ నుంచి అమెరికా మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచ ఉక్కు సంఘం (డబ్ల్యూఎస్‌ఏ) గణాంకాల ప్రకారం 2015 ఫిబ్రవరి నాటికి 65 మిలియన్ టన్నులతో చైనా మొదటి స్థానంలో, 17.4 మి.ట.లతో జపాన్ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో భారత్ ఉక్కు ఉత్తత్తి వృద్ధిరేటు 7.6 శాతంగా ఉంది.
ఐఆర్సీటీసీ ప్రీపెయిడ్ కార్డు
- భారత రైల్వే ఆహార విహార సంస్థ (ఐఆర్సీటీసీ-ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) సరికొత్త ప్రీపెయిడ్ డెబిట్ కార్డును ఆవిష్కరించింది. రైల్వే ప్రయాణికులు తమ ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి, వస్తు కొనుగోళ్లు (షాపింగ్), వివిధ సేవల బిల్లుల చెల్లింపులకు ఈ రూపంలో ప్రీపెయిడ్ డెబిట్ కార్డులను వినియోగించుకోవచ్చు.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ), భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్(ఎన్పీసీఐ-నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) భాగస్వామ్యంతో ఐఆర్సీటీసీ ఈ కార్డులను ప్రవేశపెట్టింది.
రూ. 5,113 కోట్లతో ‘అవాక్స్’
- కొత్తతరం ‘గగనతల ముందుస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ’ (అవాక్స్ – ఏడబ్ల్యూఏసీఎస్ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్)ను రూ.5,113 కోట్లతో సొంతంగా రూపొందించాలని భారత్ ఇటీవల నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం రెండు ఎయిర్‌బస్-330 విమానాలను కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించింది.
- గగనతలంలో 360 డిగ్రీల్లో నిఘా వేయడానికి అవాక్స్ ఉపయోగపడుతుంది. దీన్ని ఆకాశంలో ‘నిఘానేత్రం’గా పిలుస్తారు. ఈ వ్యవస్థ కింద భారీ విమానాలకు యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే (ఏఈఎస్ఏ) రాడార్లను అమరుస్తారు. ఇవి ఆకాశంలో విహరిస్తూ శత్రు విమానాలు, క్షిపణుల రాకను ముందే పసిగట్టి హెచ్చరిస్తాయి.
- ప్రస్తుతం డీఆర్డీవో చిన్నపాటి గగనతల హెచ్చరిక (ఏఈడబ్ల్యూసీఎస్) వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇది 270 డిగ్రీల పరిధిలోనే పరిశీలన చేయగలదు. వాటికోసం ఎంబ్రార్ విమానాలను ఉపయోగిస్తుంది. ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపిన అవాక్స్ విస్తృతమైంది. దీన్ని కూడా డీఆర్డీవోనే అభివృద్ధి చేస్తోంది.
మల్టీమిలియనీర్ల హైదరాబాద్
- ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక సంపన్నులు (మల్టీ మిలియనీర్లు) అభివృద్ధి చెందుతున్న మొదటి 20 నగరాల జాబితాలో హైదరాబాద్ సహా 7 భారత నగరాలు చోటు సంపాదించాయి. వీటిలో దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా ఉన్నాయి. 2014తో పూర్తయిన దశాబ్దకాలం (2004-2014)పై ‘న్యూ వరల్డ్ వెల్త్’ – ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఫర్ ద సూపర్ రిచ్ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నవారిని మిలియనీర్‌గా, పది మిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నవారిని మల్టీ మిలియనీర్లుగా దీనిలో విభజించారు.
- ఈ పదేళ్ల కాలంలో మల్టీ మిలియనీర్ల పెరుగుదల రేటు ఇలా ఉంది. వియత్నాంకు చెందిన హోచిమిన్ సిటీలో మల్టీ మిలియనీర్ల సంఖ్య అత్యధికంగా 400 శాతం (40 మంది నుంచి 200 మందికి) పెరిగింది. ఇండోనేషియా రాజధాని జకార్తా 396 శాతం (280 నుంచి 1390 మంది) పెరుగుదలతో రెండోస్థానం, పుణె 317 శాతం (60 నుంచి 250 మంది) పెరుగుదలతో మూడో స్థానంలో నిలిచాయి.
- 2014 డిసెంబరు చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 4,95,000 మంది మల్టీ మిలియనీర్లు, 13 మిలియన్ల మంది మిలియనీర్లు ఉన్నారని ‘న్యూవరల్డ్ వెల్త్’ సంస్థ వెల్లడించింది.
- దేశాల విషయానికొస్తే అత్యధికంగా అమెరికాలో 1,83,500 మంది మల్టీ మిలియనీర్లున్నారు. రెండో స్థానంలో చైనా(26,600 మంది), మూడో స్థానంలో జర్మనీ (25,400) ఉన్నాయి. 14,800 మంది మల్టీ మిలియనీర్లతో భారత్ 8వ స్థానంలో నిలిచింది.
భారత రత్నాలు
- ప్రముఖ రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధానమంత్రి, భాజపా వ్యవస్థాపక సభ్యుడు అటల్ బిహారీ వాజ్‌పేయికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 2015, మార్చి 27న ప్రదానం చేశారు. అనారోగ్యంతో వాజ్‌పేయి కొన్నేళ్లుగా తన నివాసానికే పరిమితమైన కారణంగా ప్రోటోకాల్‌కు భిన్నంగా ప్రణబ్ ముఖర్జీ దిల్లీ కృష్ణమీనన్ మార్గ్‌లోని వాజ్‌పేయి నివాసానికి వెళ్లి ఈ పురస్కారాన్ని అందజేశారు.
- 2014, డిసెంబరు 24న భారత ప్రభుత్వం దివంగత మదన్ మోహన్ మాలవ్యతో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయికి భారతరత్నను ప్రకటించగా ఆ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రదానం చేశారు.
- 2013లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, ప్రఖ్యాత శాస్త్రవేత్త సీఎస్ఆర్రావులకు భారతరత్న ప్రకటించారు. వాజ్‌పేయి, మాలవ్యలతో కలిపి ఇంతవరకూ ‘భారతరత్న’ అందుకున్న వారి సంఖ్య 45. 2015, మార్చి 30న మదన్మోహన్ మాలవ్య కుటుంబ సభ్యులకు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్లో ‘భారతరత్న’ ప్రదానం చేశారు.
- అటల్ బిహారీ వాజ్‌పేయి మూడుసార్లు భారత ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 1998 మే 11, 13న రెండుసార్లు సాహసోపేతమైన అణు పరీక్షలు నిర్వహించి సంచలనం సృష్టించారు. పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలను నెలకొల్పేందుకు చొరవ తీసుకున్నారు. 1999 ఫిబ్రవరిలో లాహోర్ బస్సు యాత్ర చేపట్టారు. రాజకీయ ఏకాభిప్రాయంతో.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూడు కొత్త రాష్ట్రాలను (ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్) ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం పాలన అందించిన కాంగ్రెసేతర ప్రధానిగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు.
- 2014, డిసెంబరు 24న అటల్‌కు భారతరత్న ప్రకటించిన ప్రభుత్వం 2014 డిసెంబరు 25న ఆయన జన్మదినోత్సవాన్ని ‘సుపరిపాలన దినం’గా తొలిసారిగా నిర్వహించింది.
- భారతరత్న అందుకున్న అయిదో ప్రధానమంత్రిగా వాజ్‌పేయి నిలిచారు. ఆయన కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ (1955), లాల్‌బహదూర్ శాస్త్రి (1966 – మరణానంతరం తొలి భారతరత్న గ్రహీత), ఇందిరా గాంధీ(1971), రాజీవ్ గాంధీ (1991 – మరణానంతరం)లు భారతరత్న పొందారు.
- 1954 నుంచి కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ను ప్రదానం చేస్తోంది. తొలి ఏడాది ముగ్గురికి (సి.రాజగోపాలాచారి, సీవీ రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్) ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
‘ప్రగతి’కి శ్రీకారం
- ప్రజల ఫిర్యాదులను, సమస్యలను తెలుసుకోవడం.. వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యల అమలు తీరును తుదివరకూ పర్యవేక్షించడం లక్ష్యంగా ‘ప్రగతి’ అనే వేదికను ప్రధాని నరేంద్రమోదీ 2015, మార్చి 25న దిల్లీలో ప్రారంభించారు.
- ‘ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్’కు సంక్షిప్త రూపమే ప్రగతి. ఈ వేదికపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ ప్రతినెలా నాలుగో బుధవారం (ప్రగతి డే) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. వివిధ ప్రజాసమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.
ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి విజయవంతం
- 2015, మార్చి 28న ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి అనే ఉపగ్రహాన్ని ఇస్రో నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ27) ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ప్రాంతీయ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్ఎన్ఎస్ఎస్)లో ఇది నాలుగో ఉపగ్రహం.
- ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి ప్రయోగం విజయవంతం కావడంతో ఈ వ్యవస్థలో నాలుగు దిక్సూచి ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లయింది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎ ను పీఎస్ఎల్వీ-సీ22 ద్వారా 2013, జులై 1న విజయవంతంగా ప్రయోగించారు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1బిను పీఎస్ఎల్వీ-సీ 24 ద్వారా 2014, ఏప్రిల్ 4న విజయ వంతంగా ప్రయోగించారు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీని పీఎస్ఎల్వీ-సీ 26 ద్వారా 2014, అక్టోబరు 16న విజయవంతంగా ప్రయోగించారు.
- ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్) ప్రాజెక్టు కింద 7 ఉప్రగ్రహాలు ఉంటాయి. సేవలు ప్రారంభించడానికి 4 సరిపోతాయి. వీటికి మరో మూడింటిని జోడించడం ద్వారా కచ్చితత్వం, విశ్వసనీయత పెరుగుతాయి. భారత్‌కు చుట్టూ 1500 కి.మీ.ల వరకూ ఈ ఉపగ్రహ వ్యవస్థ సేవలందిస్తుంది.
- ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ భూ, జల, వాయు మార్గాలకు స్థితి, స్థాన, దిక్కులను తెలియజేస్తుంది. డ్రైవర్లకు దృశ్య, స్వర దిశానిర్దేశం చేస్తుంది. వాహన గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం లోనూ, నౌకల సమూహ నిర్వహణలోనూ సాయ పడుతుంది. విపత్తుల సమయంలో సహాయ బృందాలకు సమాచారాన్ని అందిస్తుంది. మొబైల్ ఫోన్లతో అనుసంధానమవుతుంది.
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను 2015, మే 3న దిల్లీలోని విజ్ఞానభవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చైతన్య తమ్హానే రూపొందించిన మరాఠీ చిత్రం ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందింది.
- కన్నడ చిత్రం ‘నాను అవనల్ల అవలు’ (నేను అతడు కాదు, ఆమెను) చిత్రంలో హిజ్రా పాత్రలో నటించిన సంచారి విజయ్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు.
- హిందీ చిత్రం ‘క్వీన్’లో నటించిన కంగనా రనౌత్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఇది ఆమెకు రెండో జాతీయ పురస్కారం. గతంలో ‘ఫ్యాషన్’ చిత్రానికి ఉత్తమ సహాయనటి పురస్కారాన్ని పొందారు.
- షేక్స్పియర్ నాటకం ‘హామ్లెట్’ ఆధారంగా, షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘హైదర్’ అత్యధికంగా 5 పురస్కారాలు దక్కించుకుంది.
- బెంగాలీ చిత్రం ‘చొతుష్కోనే’ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీకి ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని ప్రదానం చేశారు.
- ప్రియాంక చోప్రా నటించిన ‘మేరీకోమ్’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా పురస్కారం పొందింది.
- ఉత్తమ నూతన దర్శకుడిగా ఆదిత్య విక్రమ్‌సేన్ గుప్తా పురస్కారాన్ని అందుకున్నారు. ఇందిరాగాంధీ పేరిట ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఆయన ‘ఆశాజావోర్ మాఝే’ అనే బెంగాలీ చిత్రాన్ని రూపొందించారు.
- మలయాళ చిత్రం ‘ఒట్టాల్’ పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని పొందింది.
- ‘కాక్కాముత్తై’ అనే తమిళచిత్రంలో నటించిన జె.విఘ్నేష్, రమేష్ ఉత్తమ బాల నటులుగా పురస్కారాన్ని అందుకున్నారు.
- ఉత్తమ తెలుగు చిత్రంగా ‘చందమామ కథలు’ పురస్కారాన్ని పొందింది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. సినిమాలపై ఉత్తమ పుస్తకంగా పసుపులేటి పూర్ణచంద్రరావు రచించిన ‘సైలెంట్ సినిమా (1895-1930)’ పురస్కారాన్ని పొందింది.
‘లోయర్ పెన్‌గంగ’కు పర్యావరణ అనుమతులు
- తెలంగాణ, మహారాష్ట్రలకు సాగు నీరందించే ‘లోయర్ పెన్‌గంగ’ ప్రాజెక్టుకు 2015 మార్చిలో కేంద్రం పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ, ఆదిలాబాద్, జైనద్, బేలా మండలాల్లోని సుమారు 48 వేల ఎకరాలకు..మహారాష్ట్రలోని యవత్మాల్, చంద్రపూర్ జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే అంతరాష్ట్ర ప్రాజెక్టు ఇది.
మాదిరి ప్రశ్నలు
1. దివంగత మదన్ మోహన్ మాలవ్యకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఆయన ఏ విశ్వవిద్యాలయ స్థాపకులుగా ఖ్యాతిగాంచారు?
ఎ) మద్రాస్ విశ్వవిద్యాలయం
బి) ముంబయి విశ్వవిద్యాలయం
సి) కలకత్తా విశ్వవిద్యాలయం
డి) బనారస్ విశ్వవిద్యాలయం
జ: (డి)
2. ఇటీవల భారతరత్న పురస్కారాన్ని పొందిన అటల్ బిహారీ వాజ్‌పేయి, దివంగత మదన్ మోహన్ మాలవ్యలకు సంబంధించి సరైన విషయాన్ని గుర్తించండి.
ఎ) ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోనే జన్మించారు
బి) ఇద్దరూ డిసెంబరు 25నే జన్మించారు. మాలవ్య 1861లో, వాజ్‌పేయి 1924లో జన్మించారు
సి) ఇద్దరూ లోక్‌సభ సభ్యులుగా వ్యవహరించారు
డి) పైవన్నీ
జ: (బి)
3. రూ.12వేల కోట్లతో చేపట్టిన రూర్కెలా స్టీల్‌ప్లాంట్ (ఆర్ఎస్పీ) విస్తరణ, ఆధునికీకరణ ప్రాజెక్టును ఇటీవల ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఆర్ఎస్పీ ఏ రాష్ట్రంలో ఉంది.
ఎ) ఒడిశా బి) ఝార్ఖండ్ సి) బిహార్ డి) మధ్యప్రదేశ్
జ: (ఎ)
4. 10 కోట్ల మందికి పైగా సభ్యులతో ప్రపచంలోకెల్లా అతిపెద్ద రాజకీయ పార్టీగా ఇటీవల ఏది గుర్తింపు పొందింది?
ఎ) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా
బి) భారత జాతీయ కాంగ్రెస్
సి) భారతీయ జనాతా పార్టీ
డి) స్కాటిష్ నేషనల్ పార్టీ
జ: (సి)
5. ‘ది మోదీ ఎఫెక్ట్ : ఇన్సైడ్ నరేంద్ర మోదీస్ క్యాంపెయిన్ టు ట్రాన్స్‌ఫార్మ్ ఇండియా’ పుస్తక రచయిత?
ఎ) లాన్స్ప్రైస్ బి) అడిసన్ కర్టిస్ సి) లారెన్స్ చట్విన్ డి) బ్రయాన్ బ్రూక్
జ: (ఎ)
Leave a Reply