National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part I
- జనరల్ స్టడీస్‌లో వర్తమానాంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా జాతీయస్థాయి ప్రధాన సంఘటనలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి ఏయే అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించి ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్రతి వార్త చదువుకుంటూ పోతే విలువైన సమయం వృథా అవుతుంది.
‘నీతి ఆయోగ్’ గా ప్రణాళికా సంఘం
- ప్రణాళికా సంఘం పేరును 2015 జనవరి 1న ‘నీతి ఆయోగ్ గా మార్చారు. ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి దాని స్థానంలో సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామని 2014 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రణాళికా సంఘం పేరు మార్చారు. భారత పరివర్తనకు జాతీయ సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా – ఎన్ఐటీఐ) సంక్షిప్త రూపమే నీతి. దీనికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు.
భారత్‌లో నూతన అమెరికా రాయబారి
- భారత్‌లో నూతన అమెరికా రాయబారిగా నియమితులైన రిచర్డ్ వర్మ (46 సంవత్సరాలు) 2015 జనవరి 2న దిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. భారత రాయబారిగా నియమితులైన మొదటి భారతీయ అమెరికన్‌గా ఈయన రికార్డు సృష్టించారు.
ఐసీఐసీఐ డిజిటల్ విలేజ్ కార్యక్రమం
- ఐసీఐసీఐ గ్రూప్ చేపట్టిన ‘డిజిటల్ విలేజ్ కార్యక్రమాన్ని 2015 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ముంబయిలో ప్రారంభించారు. గుజరాత్‌లోని అకోదర గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐసీఐసీఐ బ్యాంకు నగదు రహిత బ్యాంకింగ్, ఈ-హెల్త్, డిజిటలైజ్డ్ పాఠశాలలు, మండీలు మొదలైనవాటితో ఆ గ్రామాన్ని డిజిటల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అన్ని విషయాల్లోనూ టెక్నాలజీ ప్రయోజనాలను స్థానికులకు అందుబాటులోకి తేవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
102వ భారత సైన్స్ కాంగ్రెస్
- 102వ భారత సైన్స్ కాంగ్రెస్‌ను 2015 జనవరి 3 నుంచి 7 వరకు ముంబయి విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభించారు. ప్రాచీన భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు, వైమానిక రంగం, శస్త్ర చికిత్సలు, గణిత శాస్త్రం తదితర అంశాలపై చర్చ జరిగింది. భారత సైన్స్ కాంగ్రెస్‌తోపాటు, ‘బాలల సైన్స్ కాంగ్రెస్, మహిళల సైన్స్ కాంగ్రెస్ లను కూడా నిర్వహించారు.
వైమానిక దళంలో చేరిన తేజస్
- దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం (ఎల్సీఏ – లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) తేజస్ 2015 జనవరి 17న భారత వైమానిక దళంలో చేరింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో కాలం చెల్లిన ‘మిగ్-21 పోరాట విమానాల స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎల్‌సీఏను 1983లో ప్రభుత్వం మంజూరు చేసింది. అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం జరిగింది. అన్ని ఇబ్బందులను అధిగమించిన ఎల్సీఏ 2001 జనవరి 4న తొలిసారిగా గగన విహారం చేసింది. 2003లో నాటి ప్రధాని వాజ్‌పేయి ఈ యుద్ధ విమానానికి ‘తేజస్ అని నామకరణం చేశారు.
గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి నేలమీదున్న, గగనతలం నుంచి సముద్రం మీదున్న లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందించారు. తేజస్ పొడవు 13.2 మీటర్లు, ఎత్తు 4.4 మీటర్లు, రెక్కల విస్తీర్ణం 8.2 మీటర్లు. దీని గరిష్ఠవేగం 1.6 మ్యాక్.ఒక పైలట్ తేజస్‌ను నియంత్రిస్తారు.
13వ ప్రవాసీ భారతీయ దివస్
- 13వ ప్రవాసీ భారతీయ దివస్‌ను 2015 జనవరి 7 నుంచి 9 వరకు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో 21 ఏళ్లు గడిపిన తర్వాత 1915 జనవరి 9న గాంధీజీ భారత్‌కు తిరిగివచ్చారు. ఆయన రాకను గౌరవిస్తూ ప్రవాస భారతీయుల కోసం 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించింది. 2015 జనవరి 9కి గాంధీజీ మాతృదేశానికి వచ్చి వందేళ్లు అయిన సందర్భంగా ఈసారి మహాత్ముడి సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహించారు.
ఇస్రో కొత్త చీఫ్‌గా కిరణ్ కుమార్
- భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన అధిపతిగా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ప్రముఖ శాస్త్రవేత్త ఎ.ఎస్. కిరణ్‌కుమార్ 2015 జనవరిలో నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. కర్ణాటకకు చెందిన కిరణ్ గతంలో అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్‌గా పనిచేశారు.
స్వచ్ఛ భారత్‌కు యూఎస్ ఎయిడ్, గేట్స్ ఫౌండేషన్ల సాయం
- భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛభారత్ కార్యక్రమానికి సహకరించడానికి యూఎస్ ఎయిడ్, బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సంస్థలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అయిదేళ్లపాటు గేట్స్ ఫౌండేషన్ ఏటా 25 లక్షల డాలర్లు, యూఎస్ ఎయిడ్ సంస్థ ఏటా 20 లక్షల డాలర్లను అందిస్తాయి.
భారత్‌లో పల్స్ పోలియో
- 2015లో దేశవ్యాప్తంగా తొలి పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనవరి 18న నిర్వహించారు. భారత్‌లో చివరిసారిగా జనవరి 13, 2011లో పోలియోను పశ్చిమ బంగలో గుర్తించారు. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2014 మార్చి 27న ప్రకటించింది. పోలియోచుక్కల కార్యక్రమాన్ని మనదేశం 1995 నుంచి అమలు చేస్తోంది.
సెన్సార్ బోర్డు ఛైర్‌పర్సన్‌గా పహ్లాజ్ నిహలానీ
- కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) నూతన ఛైర్‌పర్సన్‌గా 2015 జనవరిలో ప్రఖ్యాత చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. లీలా శాంసన్ స్థానంలో నియమితులైన పహ్లాజ్ ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. బోర్డు ఛైర్‌పర్సన్‌తోపాటు 9 మంది కొత్త సభ్యులను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వీరిలో తెలుగు నటి జీవితా రాజశేఖర్ కూడా ఉన్నారు.
దేశంలో పెరిగిన పులుల జనాభా
- 2014 నాటికి దేశంలో పులుల సంఖ్య 2,226కు చేరుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2010తో పోలిస్తే ఈ పెరుగుదల సుమారు 30.5 శాతంగా ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి. 2006లో పులుల గణాంకాలు సేకరించినప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ ఏడాది వాటి సంఖ్య కేవలం 1,411 గా నమోదైంది. 2010 నాటికి ఆ సంఖ్య 1,706 కు చేరుకుంది. కర్ణాటకలో అత్యధికంగా 406 పులులు ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఉత్తరాఖండ్ (340), మధ్యప్రదేశ్(308) రాష్ట్రాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య 68గా నమోదైంది.
‘హృదయ్’కు ఎంపికైన 12 పట్టణాలు
- సుసంపన్న సాంస్కృతిక వారసత్వ పునరుత్తేజం, సంరక్షణకు ఉద్దేశించిన జాతీయ వారసత్వ అభివృద్ధి, సదుపాయాల పెంపు పథకం ‘హృదయ్ (HRIDAY – హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అడ్ ఆగ్మెంటేషన్ యెజన)ను కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు 2015 జనవరి 21న దిల్లీలో ప్రారంభించారు. హృదయ్ పథకం కింద తొలిదశలో ఎంపికైన 12 పట్టణాలు అమరావతి(ఆంధ్రప్రదేశ్), వరంగల్(తెలంగాణ), అమృత్సర్(పంజాబ్), అజ్మీర్(రాజస్థాన్), బదామి(కర్ణాటక), కాంచీపురం, వెల్లంకని(తమిళనాడు), మధుర, వారణాసి (ఉత్తర్‌ప్రదేశ్); గయ(బిహార్), ద్వారక(గుజరాత్), పూరి(ఒడిశా). ఆయా పట్టణాల జనాభా ఆధారంగా వచ్చే రెండేళ్లలో ఖర్చు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. వారణాసికి అత్యధికంగా రూ.89.31 కోట్లు, వరంగల్‌కు రూ.40.54 కోట్లు, అమరావతికి రూ.22.26 కోట్లు కేటాయించింది. ‘హృదయ్ పథకం తొలిదశకు ఎంపికైన 12 పట్టణాల అభివృద్ధికి మొత్తం రూ.500 కోట్లను ప్రకటించింది.
వెంచర్ క్యాపిటల్ ఫండ్ పథకం
- షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయం అందించే వెంచర్ క్యాపిటల్ ఫండ్, హరిత వ్యాపార పథకాలను 2015 జనవరిలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ దిల్లీలో ప్రారంభించారు. 200 కోట్ల రూపాయల మూలనిధితో షెడ్యూల్డ్ కులాల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ప్రారంభించారు. హరిత వ్యాపార పథకం కింద ఈ-రిక్షా, సోలార్ పంపు, సౌరశక్తి ఉపకరణాలు మొదలైనవాటిని పొందేందుకు ఎస్సీలకు ఒక లక్ష రూపాయాల వరకు వడ్డీ రాయితీతో రుణాలు ఇస్తారు.
వైబ్రంట్ గుజరాత్ సదస్సు
- 2015 జనవరిలో గుజరాత్ గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ‘వైబ్రంట్ గుజరాత్ (ఉజ్వల గుజరాత్) శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్గేతోపాటు వివిధ దేశాల నుంచి విశిష్ట అతిథులు, పారిశ్రామిక దిగ్గజాలు, వందకుపైగా ఫార్చ్యూన్ కంపెనీలు ఈ సదస్సుకు హాజరయ్యాయి. గుజరాత్ వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి ఉద్దేశించిన ఈ సదస్సును 2003 నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 2003లో ఈ సదస్సును ప్రారంభించారు.
Leave a Reply