International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part X
- భారతీయ ప్రముఖులు, భారత సంతతి వ్యక్తులు అంతర్జాతీయ ఖ్యాతిని సాధిస్తూ సత్తా చాటారు. క్రికెట్ దిగ్గజం సచిన్‌కు ప్రపంచ క్రీడా అకాడమీలో సభ్యత్వం లభించింది. బ్రిటన్ సంపన్నుల్లో హిందుజాలు ప్రముఖంగా నిలిచారు. వీటితో పాటు.. అత్యంత వేగవంతంగా నడిచే జపాన్ రైలు, బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ పోటీలు తదితర అంతర్జాతీయ విశేషాల సమాహారం పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం
ప్రతాప్‌సింగ్‌కు పురస్కారం
- బ్రిటన్‌లోని 15 ఏళ్ల భారతీయ సంతతి విద్యార్థి ప్రతాప్‌సింగ్‌కు ప్రఖ్యాత ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్’ పురస్కారం లభించింది.
* లండన్‌లోని నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ‘బిగ్ బ్యాంగ్ ఫెయిర్’లో ఐన్‌స్టీన్ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని పరీక్షించే ప్రయోగాన్ని ప్రతాప్ ప్రదర్శించాడు.
* అంతరిక్షం నుంచి భూమ్మీదకు వచ్చే కాస్మిక్ కిరణాల మ్యూయాన్లను గుర్తించడానికి ఈ ప్రయోగం ద్వారా ఒక గణిత విధానాన్ని ప్రతాప్ అభివృద్ధి చేశాడు. దీనిద్వారా మ్యూయాన్ల రాకను లెక్కించడానికి వీలవుతుంది.
* ప్రతాప్‌సింగ్ కేంబ్రిడ్జిలోని పెర్సే పాఠశాల విద్యార్థి.
‘లారెస్’లో సచిన్
- ప్రఖ్యాత లారెస్ ప్రపంచ క్రీడా అకాడమీ సచిన్ తెందుల్కర్‌కు సభ్యత్వం ప్రకటించింది. 2015 ఏప్రిల్ 15న షాంఘైలో జరిగిన 16వ లారెస్ ప్రపంచ క్రీడల అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో అకాడమీ సచిన్‌కు సభ్యత్వ హోదాను ప్రకటించింది.
* సచిన్‌తోపాటు చైనా బాస్కెట్ బాల్ స్టార్ యావో మింగ్, చైనా జిమ్నాస్ట్ లి షియో పింగ్, చైనా స్కేటర్ యాంగ్యాంగ్, కెన్యా మారథాన్ రన్నర్ టెగ్లా లోరోప్ కూడా లారెస్ సభ్యుల జాబితాలో చోటు పొందారు.
* వీరి చేరికతో లారెస్లో మొత్తం సభ్యుల సంఖ్య 53కు చేరింది. జీవించి ఉన్న ప్రపంచ క్రీడా దిగ్గజాలకు లారెస్ ప్రపంచ క్రీడా అకాడమీ సభ్యత్వం ప్రకటిస్తుంది.
* క్రీడల ద్వారా సానుకూల సామాజిక మార్పు కోసం ప్రయత్నించడం ఈ అకాడమీ లక్ష్యం. క్రీడల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత అభివృద్ధి కోసం కృషి చేయొచ్చని, ఐక్యతను పెంపొందించవచ్చని లారెస్ అకాడమీ సభ్యులు గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు.
లారెస్ అకాడమీలో ఇప్పటికే సభ్యత్వం ఉన్న క్రికెట్ ప్రముఖులు : కపిల్‌దేవ్, రాహుల్ద్రవిడ్ (భారత్); ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్), స్టీవ్ వా (ఆస్ట్రేలియా), వివియన్ రిచర్డ్స్ (వెస్టిండిస్).
దిగ్గజ క్రికెటర్ సచిన్: 1973 ఏప్రిల్ 24న ముంబయిలో జన్మించిన సచిన్ పూర్తిపేరు సచిన్ రమేష్ తెందుల్కర్.
ఘనతలు
* వన్డేలు, టెస్టుల్లో కలిపి మొత్తం 100 సెంచరీలు
* వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి డబుల్ సెంచరీ
* వన్డే, టెస్టుల్లో కలిపి క్రికెట్లో అత్యధిక పరుగులు
* అంతర్జాతీయ క్రికెట్లో 30,000కు పైగా పరుగులు
* ఏకైక టీ20 మ్యాచ్ (10 పరుగులు)తో సహా మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 34,357 పరుగులు
* భారతరత్న అవార్డు పొందిన అత్యంత చిన్న వయస్కుడు
* భారతరత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు
* 2012లో రాజ్యసభకు నామినేట్ కావడం.
* 2011, 2015 క్రికెట్ ప్రపంచకప్‌లకు బ్రాండ్ అంబాసిడర్
16వ లారెస్ ప్రపంచ క్రీడా అవార్డులు (2015)
స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్: నొవాక్ జకోవిచ్ (టెన్నిస్, సెర్బియా)
స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్: గెంజెబె దిబాబా (అథ్లెటిక్స్ – స్ప్రింటర్, ఇథియోపియా)
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విత్ ఏ డిజెబిలిటీ: తాత్యానా మెక్ ఫాడెన్ (పారాలింపియన్ – రన్నింగ్, అమెరికా)
స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డ్: యావోమింగ్ (బాస్కెట్‌బాల్, చైనా)
వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్: జర్మన్ నేషనల్ ఫుట్‌బాల్ టీమ్
స్పోర్ట్స్ ఫర్ గుడ్ అవార్డు: స్కేటీస్థాన్ (అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, కాంబోడియాల్లోని ఎన్జీవో సంస్థ)
రికార్డ్ వేగం
- జపాన్‌కు చెందిన అధునాతన మ్యాగ్లెవ్ రైలు వేగం విషయంలో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. 2015 ఏప్రిల్ 21న మౌంట్ఫ్యూజి వద్ద ఈ రైలును ప్రయోగాత్మకంగా నడిపినప్పుడు గంటకు 603 కిలోమీటర్ల వేగాన్ని సాధించింది.
* మ్యాగ్లెవ్ రైలు పట్టాలకు 10 సెంటీ మీటర్ల పైన తేలుతూ ఉంటుంది. విద్యుత్తుతో ఛార్జ్ అయ్యే అయస్కాంతాల సాయంతో ఇది ప్రయాణిస్తుంది. ఈ రైలు వేగాన్ని పుంజుకునే కొద్దీ గురుత్వాకర్షణ శక్తి బలం పెరుగుతున్న భావన ప్రయాణికులకు కలుగుతుంది. దీంతో వారికి విమానంలో టేకాఫ్ అవుతున్నట్లు అనిపిస్తుంది.
* 2027 నాటికి మ్యాగ్లెవ్ (మ్యాగ్నెటిక్ లెవిటేషన్) రైలును టోక్యో – సెంట్రల్ సిటీ ఆఫ్ నగోయాల మధ్య నడపాలని సెంట్రల్ జపాన్ రైల్వే సంస్థ నిర్ణయించింది.
బ్రిటన్ కుబేరుల జాబితా
- సండే టైమ్స్ పత్రిక రూపొందించిన 2015 బ్రిటన్ కుబేరుల జాబితాలో భారత సంతతికి చెందిన హిందుజాల కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న శ్రీచంద్, గోపీచంద్ హిందుజాల కుటుంబం 1,300 కోట్ల పౌండ్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
* గతేడాది జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఉక్కు సామ్రాట్ లక్ష్మీ ఎన్.మిట్టల్ ఈ ఏడాది జాబితాలో ఏడో స్థానానికి పడిపోయారు. ఆయన సంపద 920 కోట్ల పౌండ్లు.
* లార్డ్ స్వరాజ్‌పాల్ 220 కోట్ల పౌండ్ల సంపదతో 47వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జాబితాలో కొత్తగా భారత సంతతికి చెందిన ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు ఆశీష్ టక్కర్, పారిశ్రామికవేత్త గౌతమ్ థాపర్ (సంయుక్తంగా 217వ ర్యాంకు); ఆహార పరిశ్రమకు చెందిన రంజిత్, బల్జిందర్ బోపారన్ (608వ ర్యాంకు) స్థానం పొందారు. - ఈ ఏడాది జాబితాలో తొలి అయిదు స్థానాల్లో నిలిచిన వారు: లెన్ బ్లావర్నిక్ (ఉక్రెయిన్, 1317 కోట్ల పౌండ్లు), శ్రీ అండ్ గోపీచంద్ హిందుజా (1300 కోట్ల పౌండ్లు), గాలెన్ అండ్ జార్జి వెస్టన్ కుటుంబం (1100 కోట్ల పౌండ్లు), అలిషర్ ఉస్మనోవ్ (980 కోట్ల పౌండ్లు), డేవిడ్ అండ్ సైమన్ రూబెన్ (970 కోట్ల పౌండ్లు).
* సండే టైమ్స్ ఈ తరహా జాబితాను మొదటిసారిగా 1989లో రూపొందించింది. ఈ తొలి జాబితాలో రెండో ఎలిజబెత్ రాణి అగ్రస్థానంలో నిలిచారు. తాజా జాబితాలో ఆమె 302వ స్థానంలో ఉన్నారు.
ఆసియా ఛాంపియన్ షిప్-2015
- చైనాలోని వుహాన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్-2015 విజేతగా చైనా క్రీడాకారుడు లిన్ డాన్ నిలిచాడు. ఫైనల్లో 21-19, 21-8తో తియాన్ హువీ (చైనా)పై నెగ్గాడు.
* లిన్‌డాన్ ఈ టైటిల్ గెలవడం ఇది నాలుగోసారి. ఈ ఛాంపియన్‌షిప్‌ను అత్యధిక సార్లు నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
* మహిళల సింగిల్స్ టైటిల్‌ను రచనోక్ ఇంతనాన్ (థాయ్‌లాండ్) సాధించింది. ఫైనల్లో 20-22, 23-21, 21-12తో లీజురుయ్ (చైనా)పై నెగ్గింది.
* పురుషుల డబుల్స్ విజేతలు: లీయాంగ్డే, యూయెన్ సియాంగ్ (దక్షిణకొరియా)
* మహిళ డబుల్స్ విజేతలు: మా జిన్, టాంగ్ యువాంటింగ్ (చైనా)
* మిక్స్డ్ డబుల్స్ విజేతలు: తొంతోవి అహ్మద్, లిల్యానా నట్సిర్ (ఇండోనేషియా)
* ఈ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి పొందారు.
* ఇవి 35వ బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ పోటీలు.
* ఈ క్రీడలను 1962లో ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పేరుతో ప్రారంభించారు. 1991 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. 2007 నుంచి బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహిస్తున్నారు.
* 2016లో ఈ ఛాంపియన్‌షిప్‌ను ఇండోనేషియా రాజధాని జకర్తాలో నిర్వహించనున్నారు.
Leave a Reply