International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part VIII
అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తిపతాకం ఎగిరింది.. ఫోర్బ్స్ ‘గ్లోబల్ 2000’ కంపెనీల్లో ఆర్ఐఎల్ సత్తా చాటింది. ప్రపంచ ఆరోగ్య సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది. విశ్వనగరాల జాబితాలో 5 భారత నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఫోర్బ్స్ ప్రపంచ మహిళా శక్తిమంతుల జాబితాలో నలుగురు భారతీయులు నిలిచారు. 2015 – అంతర్జాతీయ వర్తమానాంశాల్లో మెరుపులివి.. వీటితో పాటు మరిన్ని ప్రపంచ వ్యాప్త విషయ విశేషాలను తెలుసుకుందామా!
భవిష్యత్తు ఆర్థిక నమూనాలపై చర్చ
* ఆసియా అభివృద్ధి బ్యాంకు 48వ వార్షిక సమావేశాన్ని (ఏడీబీ గవర్నర్స్ సెమినార్) 2015 మే 2-5 తేదీల్లో అజర్‌బైజాన్‌లోని బాకులో నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సమావేశానికి హాజరయ్యారు.
* ‘ఫోస్టరింగ్ పార్టనర్షిప్ ఫర్ డెవలప్మెంట్’ అనే థీమ్‌తో దీన్ని నిర్వహించారు.
* ‘రీ థింకింగ్ గ్రోత్ పొటెన్షియల్ అండ్ గ్రోత్ మోడల్స్’ అనే థీమ్‌తో ఈ సమావేశం జరిగింది. దీనిలో ఆసియా భవిష్యత్తు ఆర్థిక నమూనాలపై చర్చించారు.
* 1966, ఆగస్టు 22న ఆసియా అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్ జాతీయ రాజధాని ప్రాంతం మెట్రో మనీలాలోని మండలుయాంగ్లో ఏడీబీ కేంద్ర కార్యాలయం ఉంది. ‘ఫైటింగ్ పావర్టీ ఇన్ ఆసియా అండ్ ది పసిఫిక్’ అనే ఆదర్శంతో ఏడీబీ పనిచేస్తోంది.
* ప్రారంభంలో ఏడీబీలో సభ్య దేశాల సంఖ్య 31. ప్రస్తుతం ఈ సంఖ్య 67కు చేరింది. ఐక్యరాజ్యసమితి ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ద పసిఫిక్ (యూఎన్ఈఎస్సీఏపీ) లో సభ్యత్వం ఉన్న దేశాలు, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఏడీబీలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుత 67 సభ్య దేశాల్లో 48 ఆసియా పసిఫిక్ దేశాలు.
* ఏడీబీ మొదటి అధ్యక్షుడిగా జపాన్‌కు చెందిన తకేషీ వతన్ బే (1966-72) విధులు నిర్వహించారు. ప్రస్తుత అధ్యక్షుడు తకెహికో నకావో(జపాన్).
భారత కంపెనీల్లో ఆర్ఐఎల్ అగ్రస్థానం
* ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలతో ‘గ్లోబల్ 2000’ జాబితాను 2015 మేలో విడుదల చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద, శక్తిమంతమైన 2 వేల కంపెనీల్లో 56 భారత్‌కు చెందినవి ఉన్నాయి.
* చైనాలోని 4 దిగ్గజ బ్యాంకులు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. 278.3 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఐసీబీసీ (ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా) జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్ (212.9 బిలియన్ డాలర్లు), అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా (189.9 బిలియన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా (199.1 బిలియన్ డాలర్లు) నిలిచాయి. అయిదో స్థానంలో అమెరికాకు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే నిలిచింది.
* భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అంతర్జాతీయ జాబితాలో 142వ స్థానం పొందింది. ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 42.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.60 లక్షల కోట్లు). ఆర్ఐఎల్ తర్వాతి స్థానాల్లో ఎస్బీఐ (152), ఓఎన్జీసీ (183), టాటా మోటార్స్ (263), ఐసీఐసీఐ బ్యాంకు (283), ఇండియన్ ఆయిల్ (349), హెచ్డీఎఫ్సీ బ్యాంకు (376), ఎన్టీపీసీ (431), టీసీఎస్ (485), భారతీ ఎయిర్టెల్ (506), యాక్సిస్ బ్యాంక్ (558), ఇన్ఫోసిస్ (672), బీపీసీఎల్ (757), విప్రో (811), టాటా స్టీల్ (903), అదానీ ఎంటర్ ప్రైజెస్ (944) ఉన్నాయి. 2014 జాబితాలో ఆర్ఐఎల్ 135వ స్థానంలో నిలిచింది.
* ఈ జాబితాలో అమెరికా, చైనాల ఆధిపత్యం కొనసాగింది. 579 కంపెనీలను కలిగిన అమెరికా ప్రథమ స్థానంలో నిలిచింది. 232 కంపెనీలతో తొలిసారిగా చైనా రెండో స్థానానికి చేరింది. 218 కంపెనీలతో జపాన్ మూడో స్థానానికి పడిపోయింది.
* ఈ జాబితాలో ఆసియా కంపెనీలు 691, ఉత్తర అమెరికా కంపెనీలు 645, ఐరోపా కంపెనీలు 486 చోటు సంపాదించాయి.
భారత్ అధ్యక్షతన ప్రపంచ ఆరోగ్య సమావేశం
* 68వ ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని (డబ్ల్యూహెచ్ఏ – వరల్డ్ హెల్త్ అసెంబ్లీ) 2015, మే 18 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నిర్వహించారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ.
* ఈ సమావేశానికి భారత ఆరోగ్య మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా అధ్యక్షత వహించారు. 19 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆరోగ్య సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది.
* ఈ సమావేశానికి ఆఫ్గానిస్థాన్, బార్బడోస్, చైనా, శాన్మరీనో, సెనెగల్ ఉపాధ్యక్షత వహించాయి. ఆయా ప్రాంతాలకు ఇవి ప్రాతినిథ్యం వహించాయి.
* ప్రతి సంవత్సరం మేలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యాలయంలో డబ్ల్యూహెచ్ఏను నిర్వహిస్తారు. డబ్ల్యూహెచ్‌వోలోని 194 సభ్య దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 1948లో మొదటి సమావేశాన్ని నిర్వహించారు.
* డబ్ల్యూహెచ్‌ఏలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు 137వ సమావేశాన్ని 2015 మే 27, 28 తేదీల్లో జెనీవాలోనే నిర్వహించారు.
* ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినం’గా పాటించాలని తీర్మానించిన దానికి గుర్తుగా డబ్ల్యూహెచ్‌ఏలో ‘యోగా ఫర్ ఆల్, యోగా ఫర్ హెల్త్’ పేరిట ఓ ఫొటో ఎగ్జిబిషన్‌ను డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్, భారత ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాలు కలిసి ప్రారంభించారు.
* డబ్ల్యూహెచ్ఏ 68వ సమావేశం అనంతరం కామన్వెల్త్ ఆరోగ్య మంత్రుల సమావేశం, 8వ నామ్ ఆరోగ్య మంత్రుల సమావేశం, బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశాలను కూడా జెనీవాలోనే నిర్వహించారు. జేపీ నడ్డా ఈ సమావేశాలకు కూడా హాజరయ్యారు.
* ప్రపంచ ఆరోగ్య సంస్థతో తమ నిబద్ధతకు ప్రతీకగా రూ.13.37 కోట్ల విరాళాన్ని 68వ డబ్ల్యూహెచ్‌ఏలో భారత్ ప్రకటించింది.
* అంతర్జాతీయ ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). దీన్ని 1948, ఏప్రిల్ 7న స్థాపించారు. ఈ సందర్భానికి గుర్తుగా ఏటా ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినంగా నిర్వహిస్తారు. దీని కేంద్ర కార్యాలయం జెనీవాలో ఉంది. ప్రపంచవ్యాప్త ఆరోగ్య సర్వేను ‘వరల్డ్ హెల్త్ రిపోర్ట్’ పేరిట డబ్ల్యూహెచ్‌వో వెలువరిస్తోంది.
ప్రపంచ నగరాలు.. భారత్
* లండన్‌కు చెందిన అంతర్జాతీయ మేనేజిమెంట్, కన్సల్టింగ్ సంస్థ ఏటీ కెర్నే విడుదల చేసిన ప్రపంచ దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల (గ్లోబల్ సిటీస్ – 2015) జాబితాలో భారత్‌లోని కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, దిల్లీ, అహ్మదాబాద్ చోటు దక్కించుకున్నాయి.
* గ్లోబల్ సిటీస్-2015 జాబితా రెండు భాగాలుగా ఉంది. అంతర్జాతీయ నగరాల జాబితా (జీసీఐ – గ్లోబల్ సిటీస్ ఇండెక్స్)తో పాటు భవిష్యత్తులో ఎదిగే నగరాల జాబితా (జీసీవో – గ్లోబల్ సిటీస్ అవుట్‌లుక్) ఉన్నాయి.
* వ్యాపార కార్యకలాపాలు, సమాచార మార్పిడి, మానవ వనరులు, సాంస్కృతిక అనుభవం, రాజకీయ అనుబంధంలో 26 పరిమితుల్లో వృద్ధి ఆధారంగా జీసీఐను రూపొందించారు. 2008 నుంచి జీసీఐను విడుదల చేస్తున్నారు. ఇది అయిదో జాబితా. 125 నగరాలతో జీసీఐ జాబితా ఉంది.
* జీసీవోను తొలిసారిగా 2015లోనే విడుదల చేశారు. వ్యక్తిత్వ వికాసం, ఆర్థికాంశాలు, ఆవిష్కరణలు, పరిపాలన అనే నాలుగు అంశాల ఆధారంగా భవిష్యత్తులో ఎదిగే సత్తా ఉన్న 125 నగరాలతో ఈ తొలి జీసీవోను ఆవిష్కరించారు.
* జీసీఐలో న్యూయార్క్, లండన్, ప్యారిస్, టోక్యో, హాంకాంగ్ తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. కోల్‌కతా, ముంబయి, బెంగళూరు ఈ 125 నగరాల జాబితాలో చోటు పొందాయి.
* జీసీవోలో శాన్ఫ్రాన్సిస్కో, లండన్, బోస్టన్, న్యూయార్క్, జ్యూరిచ్ తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. భారత్ నుంచి అహ్మదాబాద్, దిల్లీ ఈ జాబితాలో చోటు పొందాయి.
* జీసీఐ, జీసీవో రెండు జాబితాల్లో టాప్-25 స్థానాల్లో నిలిచిన 16 నగరాలను ‘గ్లోబల్ ఎలైట్’ పేరుతో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అవి న్యూయార్క్, లండన్, లాస్ ఏంజెల్స్, చికాగో, టొరంటో, శాన్ఫ్రాన్సిస్కో, బోస్టన్, ప్యారిస్, బ్రస్సెల్స్, బెర్లిన్, ఆమ్స్టర్డ్యామ్, టోక్యో, సింగపూర్, సియోల్, సిడ్నీ, మెల్బోర్న్.
ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళగా భారత వనిత
* ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళలు-2015 జాబితాలో నలుగురు భారతీయులు చోటు సంపాదించారు.
* ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ 12వ వార్షిక జాబితాలో ఎస్బీఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య 30వ స్థానంలో నిలిచారు. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్ 35వ స్థానం, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 85వ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురూ గతేడాది జాబితాలో వరుసగా 36, 43, 92వ స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది జాబితాలో కొత్తగా హెచ్‌టీ మీడియా ఛైర్పర్సన్ శోభన భర్తియా 93వ స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన పెప్సీ కో ఛైర్పర్సన్ ఇంద్రా నూయి (15), సిస్కో ముఖ్య సాంకేతిక వ్యూహాల అధికారిణి పద్మశ్రీ వారియర్ (84) కూడా ఈ జాబితాలో చోటు పొందారు.
జాబితాలో తొలి పది స్థానాల్లో నిలిచిన మహిళలు : ఏంజెలా మెర్కెల్ (జర్మనీ ఛాన్సెలర్), హిల్లరీ క్లింటన్ (అమెరికా మాజీ ప్రథమ మహిళ), మిలిండా గేట్స్ (గేట్స్ ఫౌండేషన్ సహాధ్యక్షురాలు, అమెరికా), జానెట్ యెలెన్ (ఫెడరల్ రిజర్వ్ ఛైర్పర్సన్, అమెరికా), మేరీ బారా (జనరల్ మోటార్స్ సీఈవో, అమెరికా), క్రిస్టీన్ లగార్డే (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎండీ, ఫ్రాన్స్), దిల్మా రౌసెఫ్(బ్రెజిల్ అధ్యక్షురాలు), షెరిల్ శాండ్‌బర్గ్ (ఫేస్బుక్ సీఈవో, అమెరికా), సుసాన్ వోజ్సిస్కీ (యూట్యూబ్ సీఈవో, అమెరికా), మిషెల్ ఒబామా (అమెరికా ప్రథమ మహిళ).
* ఈ 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో 8 మంది దేశానికి అధినాయకత్వం వహిస్తున్న వారే కావడం విశేషం. ఈ 100 మందికి సామాజిక మాధ్యమంలో మొత్తంగా 47.5 కోట్ల మందికి పైగా అనుచరులు ఉన్నారు.
* ఏంజెలా మెర్కెల్ గత 12 ఏళ్లలో 10 సార్లు జాబితాలో చోటు పొందారు. అందులో తొమ్మిది సార్లు అగ్రస్థానం ఆమెదే కావడం విశేషం.
* జాబితాలోని 100 మందిలో 59 మంది అమెరికాకు చెందినవారే కావడం గమనార్హం.
* ఫోర్బ్స్ పత్రిక 2004 నుంచి ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాను విడుదల చేస్తోంది.
అమెరికా-క్యూబా స్నేహబంధం
* దశాబ్దాల తరబడి కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కలిశారు. 2015 ఏప్రిల్ 10, 11 తేదీల్లో పనామా సిటీలో జరిగిన 35 దేశాల ‘అమెరికాస్ ఏడో సదస్సు’ వీరిద్దరి కలయికకు వేదికైంది.
* ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ ఆధ్వర్యంలో అమెరికాతో పాటు ఉత్తర అమెరికా (మధ్య అమెరికా, కరేబియన్), దక్షిణ అమెరికా దేశాల నాయకులను ఒక్కచోట చేర్చే ఉద్దేశంతో ఈ ‘అమెరికాస్ సదస్సు’ను నిర్వహిస్తున్నారు.
* 1961లో తెరపడిన అమెరికా-క్యూబా సంబంధాలను పునరుద్ధరించేందుకు, దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు పనామా సిటీలో ఒబామా, క్యాస్ట్రో చర్చలు జరిపారు. 1959లో అప్పటి అమెరికా మద్దతుతో ఉన్న ఫ్లుగెన్-సియో బాటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని సోవియట్ యూనియన్ సహాయంతో క్యాస్ట్రో సోదరులు కూలదోశారు. అప్పటి నుంచి క్యూబా-అమెరికా సంబంధాలు క్షీణించాయి.
ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబా తొలగింపు
* అమెరికా-క్యూబా సంబంధాల పునరుద్ధరణలో భాగంగా 2015, మే 29న ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాద దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగిస్తూ అమెరికా చారిత్రక నిర్ణయం తీసుకుంది. యాభై ఏళ్లుగా ఇరు దేశాల మధ్య స్తంభించిన సంబంధాలు మెరుగుపడటానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అమెరికాలో బ్యాంకింగ్, ఇతర కార్యకలాపాలను చేపట్టడానికి క్యూబాకు అనుమతి లభించింది.
* 1982లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్.. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాద దేశాల జాబితాలో క్యూబాను చేర్చారు. ఇప్పుడు ఈ జాబితాలో ఇరాన్, సిరియా, సూడాన్ మాత్రమే మిగిలాయి.
రాయబార కార్యాలయాల పునఃప్రారంభం
* ఒబామా-రౌల్ క్యాస్ట్రో చర్చల నేపథ్యంలో 5 దశాబ్దాలకు పైగా కొనసాగిన వైరాన్ని వదిలిపెట్టి చేతులు కలిపిన అమెరికా, క్యూబా 2015, జులై 20న రాయబార కార్యాలయాలను పునఃప్రారంభించాయి.
వాషింగ్టన్లో క్యూబా జెండా
* 1961 తర్వాత తొలిసారిగా క్యూబా జెండా అమెరికా రాజధాని వాషింగ్టన్లో 2015, జులై 20న ఎగిరింది. దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నివాసం ఉండే వైట్‌హౌస్‌కు సమీపంలో క్యూబా సరికొత్త రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటివరకు ‘క్యూబన్ ప్రయోజనాల విభాగం’గా ఉన్న భవనాన్ని పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా మార్చారు.
* తాజా పరిణామాల నేపథ్యంలో క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ 2015, జులై 20న అమెరికా పర్యటనకు వెళ్లారు. 1959లో క్యూబా విప్లవం తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి అమెరికాకు రావడం ఇదే తొలిసారి. క్యూబా రాజధాని హవానాలో ‘అమెరికా ప్రయోజనాల విభాగం’గా ఉన్న భవనాన్ని 2015 జులై 20న అమెరికా రాయబార కార్యాలయంగా మార్చారు.
హవానాలో అమెరికా జెండా
* క్యూబా రాజధాని హవానాలో ఏర్పాటు చేసిన అమెరికా నూతన రాయబార కార్యాలయంలో 2015, ఆగస్టు 14న అమెరికా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ హాజరయ్యారు. 1961 తర్వాత అమెరికా జెండా క్యూబాలో ఎగరడం ఇదే తొలిసారి.
* 1945 తర్వాత జాన్ కెర్రీ లాంటి అమెరికా అత్యున్నత స్థాయి అధికారి ఒకరు క్యూబాను సందర్శించడం ఇదే తొలిసారి.
* 1961, జనవరి 4న హవానాలో అమెరికా జాతీయ జెండాను అవనతం చేసిన ముగ్గురు అమెరికా నావికాదళ అధికారులు తాజాగా హవానాలోని అమెరికా నూతన రాయబార కార్యాలయంలో జరిగిన అమెరికా జెండా ఎగురవేత కార్యక్రమంలో జాన్ కెర్రీతో కలిసి పాల్గొనడం విశేషం. వారు లారీ మోరిస్, జేమ్స్ ట్రేసీ, మైక్ ఈస్ట్.
సుష్మా విదేశీ పర్యటన
* భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ 2015 ఆగస్టులో తొలిసారిగా ఈజిప్ట్, జర్మనీల్లో పర్యటించారు. ఆగస్టు 24న ఈజిప్టు రాజధాని కైరోలో దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసీతో సమావేశమయ్యారు.
* రక్షణ, ఉగ్రవాదంపై పోరు, భద్రతతో పాటు వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి సమేహ్ హసన్ షాక్రితో కూడా సుష్మా భేటీ అయ్యారు.
* ‘లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్’ సెక్రటరీ జనరల్ నబిల్ ఎల్ అరబీతో కూడా సుష్మా భేటీ అయ్యారు.
* ఆగస్టు 25, 26, 27 తేదీల్లో సుష్మా స్వరాజ్ జర్మనీలో పర్యటించారు. జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టీన్ మేర్తో భేటీ అయ్యారు. ఆర్థికాభివృద్ధిపై ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
* 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా జర్మనీలో పర్యటించారు.
Leave a Reply