APPSC | TSPSC Group II Paper I సామాజిక మినహాయింపు – వైకల్యం
* 2.68 కోట్ల బాధితులు
* చేయూత.. సమాజం బాధ్యత
- వైకల్యం.. కోట్ల మందికి పైగా భారతీయులను ఏదో ఒక రూపంలో అశక్తులను చేస్తున్న సామాజిక సమస్య. శారీరకంగా లేదా మానసికంగా సాధారణ జీవనం సాగించలేని నిస్సహాయ స్థితి వీరందరిదీ.. ఇలాంటి వారిని ఆదుకోవాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ప్రభుత్వాలు వివిధ పథకాలతో వారి సామాజిక జీవన స్థితిగతులను మెరుగుపరుస్తూ.. ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలోనూ ఈ దిశగా కృషి జరుగుతోంది. వికలాంగులకు అండగా నిలవడం అనేది సమాజం బాధ్యత కూడా. వైకల్యం అంటే ఏమిటి? ఎన్ని రకాలు? గణాంకాలేం చెబుతున్నాయి? ప్రభుత్వం అందిస్తున్న చేయూత ఏమిటి? తదితర అంశాల గురించి తెలుసుకోవడం ద్వారా – టీఎస్పీఎస్సీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగంలోని సోషల్ ఎక్స్‌క్లూజన్ సబ్జెక్టుపై మంచి అవగాహన సాధ్యమవుతుంది.
- వివిధ కారణాల వల్ల సామాజిక ప్రక్రియలకు సాధారణ స్థాయిలో స్పందించలేని పరిస్థితినే వైకల్యం అంటారు. దీన్నే నిస్సహాయత లేదా అశక్తత అని కూడా పేర్కొనవచ్చు. ఈ వైకల్యం ఉన్నవారు సమాజంలో కలవలేకపోవడం లేదా సమాజం ఈ బాధితులను వెలి వేయడం వల్ల విలువైన మానవ వనరులు అసంతృప్తికి గురవుతున్నాయి. ఇది సమాజానికి రుణాత్మక సందేశాన్ని పంపే ప్రమాదం ఉంది. వైకల్యం వల్ల సామాజిక మినహాయింపు (సోషల్ ఎక్స్‌క్లూజన్) ఏర్పడుతుంది.
* వైకల్యం శారీరక, మానసిక కోణాల్లో కనిపించవచ్చు. వృద్ధాప్యం, అంగవైకల్యం వల్ల ఏర్పడేదాన్ని శారీరక వైకల్యంగా గుర్తించవచ్చు. మానసిక బలహీనతల వల్ల వచ్చేది మానసిక వైకల్యం. - సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల సామాజిక ప్రక్రియల్లో క్రియాశీలకంగా పాల్గొనలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిని కూడా వైకల్యంగా గుర్తిస్తారు. ఉదాహరణకు.. హెచ్ఐవీ లాంటి ప్రమాదకర పరిస్థితుల వల్ల నిస్సహాయులు కావడం, వితంతువులు, ఆర్థిక పరిస్థితి దెబ్బతిని నిస్సహాయులైనవారు (చేనేత, బీడి కార్మికులు). ఇలాంటి అశక్తులను సమన్వయం చేసుకోవడం రాజ్యం, సమాజం బాధ్యత.
ఎందుకంటే..
* మానవ ధర్మాన్ని ప్రదర్శించడానికి
* సమాజ స్థిరత్వాన్ని కాపాడటానికి
* సమాజంలోని వ్యక్తుల్లో అసంతృప్తి ప్రబలకుండా చూసేందుకు
* భవిష్యత్తు సమాజానికి సరైన సూచనలు ఇవ్వడానికి
* సమగ్ర మానవ అభివృద్ధి ద్వారా సమాజంలో ఉన్నత ప్రమాణాలు ఆవిష్కరించేందుకు
* ప్రభుత్వం సామాజిక ధర్మకర్తృత్వాన్ని ప్రదర్శించడానికి
* సమాజంలోని వ్యక్తుల మధ్య ఆదర్శనీయ సంబంధాలను ఏర్పరిచి మానవ ఉన్నతత్వాన్ని వ్యక్తపరిచేందుకు
* ఉన్నత ప్రమాణాలు ఏర్పరిచి ప్రపంచస్థాయి గుర్తింపు పొందేందుకు
* సామాజిక సమ్మిళితాన్ని (సోషల్ ఇన్‌క్లూజన్) సాధించి జీవన దృఢత్వాన్ని, ఆర్థిక సూచికలను మెరుగు పరుచుకునేందుకు..
ఆదేశిక సూత్రాల్లో..
- వైకల్యాన్ని / అశక్తతను గుర్తించిన భారత రాజ్యాంగం ఆర్టికల్-15లో వివిధ సాంఘిక సన్నివేశాల్లో వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్పష్టంగా సూచించింది. ఆదేశిక సూత్రాల్లోని ‘ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం’, ‘రాజ్య సంక్షేమ భావనలు’ లాంటివి అశక్తతను దృష్టిలో పెట్టుకుని నిర్దేశించినవే.
వికలాంగులకు అండగా..
చట్టం: 1995లో వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం భారత పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించింది. దీనిద్వారా వారికి సమాన అవకాశాల కల్పన, హక్కులకు భద్రత, అన్నింటిలో వారి భాగస్వామ్యం ఉండేలా అవకాశాలను (equal opportunity protection of rights and full participation) కల్పించింది. నిస్సహాయ వ్యక్తులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్య, ఉపాధి, వృత్తి నైపుణ్యాలు వంటివాటిని సమకూర్చి తగిన భద్రత, ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. 2006లో ఈ చట్టానికి సవరణలు చేసి నిస్సహాయతను మరింత సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు.
విధానం: 2006లో వికలాంగుల కోసం ఒక జాతీయ విధానం (నేషనల్ పాలిసీ ఫర్ పర్సన్స్ విత్ డిసేబుల్డ్) వెలువడింది. వైకల్య సమస్యలను ఎదుర్కొనేందుకు అధీకృత మంత్రిత్వ శాఖగా న్యాయ, సాధికారక మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్)ను గుర్తించారు. ఈ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేసిన వికలాంగ సంక్షేమ శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ వెల్ఫేర్) ద్వారా అశక్తులకు విద్య, ఉపాధి, సామాజిక భద్రత, ప్రత్యేక రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణలో చేయూత
1. ఆసరా పథకం
- తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాలుగా అశక్తులైన వారికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించింది. సామాజిక భద్రతని అందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది.
2. ఆర్థిక పునరుజ్జీవనం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెంది, లక్ష రూపాయల్లోపు వార్షిక ఆదాయం ఉన్న స్త్రీ, పురుషులు.. ఏదైనా ఉత్పత్తికి సంబంధించి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందులో 50 శాతం సబ్సిడీగా ఇస్తారు. 21-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు.
3. ఐడీపీడీ పథకం (ఇన్‌క్లూజర్ డెవలప్మెంట్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ)
- సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ద్వారా ఈ కార్యక్రమం అమలవుతోంది. ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వికలాంగులను ఆదుకునే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా, 1,98,207 మంది ఈ పథకం పరిధిలోకి వచ్చారు. వీరిని 20,368 స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేశారు. తిరిగి ఈ బృందాలను 436 మండల వికలాంగ సమాఖ్యలుగా విభజించారు. వీటిని 9 జిల్లా సమాఖ్యలుగా ఏర్పరిచారు.
4. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార కార్పొరేషన్
- వికలాంగుల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని అనేక విధాలుగా వారికి అండగా నిలుస్తుంది. అవి..
* తేలికగా కదిలేందుకు సహాయపడే పరికరాల మంజూరు
* వివిధ సాంకేతిక, సాంకేతికేతర విభాగాల్లో శిక్షణ
* మార్కెటింగ్, ఉపాధి కల్పన, ఉత్పత్తి యూనిట్ల సరఫరా
* భిన్న రకాల వైకాల్యాన్ని గుర్తించి సర్దుబాటు చర్యల ఏర్పాటు
* విద్యార్జనకు ఉపకరించే పరికరాల సమకూర్పు
5. సీపీడీఎల్ (సెంటర్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ లైవ్లీహుడ్)
- వికలాంగులు జీవించేందుకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పిస్తుంది.
6. ఎస్ఏడీఏఆర్ఈఎం (సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ ఫర్ ఆక్సెస్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్)
- ఇది ఒక వెబ్సైట్. దీని ద్వారా వికలాంగులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, సౌకర్యాలు వంటివన్నీ ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. కేంద్రీకృత డేటాబేస్ ఏర్పాటు, తద్వారా నిర్ణయీకరణకు ఉపకరించే విధంగా దీన్ని రూపొందించారు.
* జాతీయంగా షెడ్యూల్డ్ కులాల జనాభాలో 2.45 శాతం, షెడ్యూల్డ్ తెగల జనాభాలో 2.05 శాతం, ఇతరుల్లో 2.18 శాతం మంది వికలాంగులున్నారు.
* జాతీయంగాను, తెలంగాణలోనూ వైకల్యంతో బాధపడుతున్న వారిలో 75 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు.
ఆర్థికసాయం.. స్వయంఉపాధి కల్పన
- తెలంగాణలో వైకల్యాన్ని ఎదుర్కొంటున్న వారికి ఆర్థికపరమైన మద్దతు, స్వయం ఉపాధి కల్పన, అవసరమైన పరికరాల సరఫరా వంటి లక్ష్యాలను నిర్దేశించుకుని.. అశక్తులను ఆదుకునే ప్రయత్నం జరుగుతోంది.
* వైకల్యం 49-79 శాతం మధ్య ఉన్నప్పుడే వికలాంగులకు ఇచ్చే మద్దతులు లభిస్తుంది.
* 80 శాతానికి మించితే ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా సంరక్షిస్తారు. - తెలంగాణలో నిర్వహించిన ‘ఇంటింటా సర్వే’ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 5.1 లక్షల మంది వికలాంగులున్నారు. ఈ వివరాల ప్రకారం చూస్తే తెలంగాణ జనాభాలో 1.4 శాతం మంది వికలాంగులున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది జాతీయ సగటు 2.21 శాతం కంటే బాగా తక్కువగా ఉన్నట్లుగా భావించవచ్చు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 2.1 శాతం మందికి వైకల్యం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ (ఎల్ఎస్హెచ్టీఎమ్) సర్వే ప్రకారం వైకల్య శాతం 12.2గా ఉంది. అయితే ఫ్లోరైడ్ లాంటి ప్రభావాలతోపాటు ఇతర కారణాలు పేర్కొంటూ భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తెలంగాణలోనే తీవ్రత ఎక్కువ అని ఆ సంస్థలు తెలిపాయి.
Leave a Reply