International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part XI
ప్రపంచ స్థాయిలో హెచ్‌సీయూ
- దేశంలోని ఉత్తమ విద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ప్రపంచస్థాయి గుర్తింపును దక్కించుకుంది. ప్రముఖ సంస్థ క్యూఎస్ ఇచ్చిన సబ్జెక్టుల ర్యాంకింగ్‌లో ఆంగ్లభాష, రసాయన శాస్త్రాల్లో హెచ్సీయూకు చోటు దక్కింది.
* బ్రిటిష్ సంస్థ క్యూఎస్ (క్వాక్వరెల్లీ సైమండ్స్) ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో 44 దేశాల్లో సుమారు 17 వేల విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను పరిగణనలోకి తీసుకుని 36 సబ్జెక్టులపై అధ్యయనం చేసింది.
* ఆంగ్లంలో భారత్ నుంచి హెచ్సీయూకు మాత్రమే చోటు దక్కగా, రసాయన శాస్త్రంలో ఈ విశ్వవిద్యాలయంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ-బెంగళూరు), బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, దిల్లీ విశ్వవిద్యాలయాలకు స్థానం లభించింది.
* ‘స విద్యా య విముక్తతే’ అనే నినాదంతో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తున్న హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మొదటి వైస్ ఛాన్సెలర్‌గా గురుబక్ష్ సింగ్ వ్యవహరించారు. హెచ్‌సీయూ ప్రస్తుత వీసీ పొదిలె అప్పారావు. తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా ఉన్నవారు ఈ విశ్వవిద్యాలయానికి ఛాన్సెలర్‌గా వ్యవహరిస్తారు.
* హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) 2015 జనవరిలో దేశంలోనే ఉత్తమ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా విజిటర్స్ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అందుకుంది.
ఆసియాలో సంపన్నుడు
- నలభై సంవత్సరాల్లోపు వయసున్న వారిలో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా భారత్‌కు చెందిన అరుణ్పుదూర్ చోటు దక్కించుకున్నాడు. 10 మంది ఉన్న ఈ జాబితాలో ఆరుగురు చైనీయులను, ముగ్గురు జపాన్‌కు చెందిన వారిని వెనక్కినెట్టి ఈ ఘనత సాధించాడు.
* ‘వెల్త్-10’ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. చెన్నైకు చెందిన అరుణ్ వయసు 37 సంవత్సరాలు. మైక్రోసాఫ్ట్ తర్వాత అధికంగా పేరున్న వర్డ్ ప్రాసెసర్‌ను తయారు చేస్తున్న ‘సెల్ఫ్రేమ్’ సంస్థకు ఈయనే యజమాని.. అధ్యక్షుడు. అరుణ్ సంపద 400 కోట్ల డాలర్లు. సెల్ఫ్రేమ్ సంస్థను 1998లో స్థాపించాడు. స్థిరాస్తి, గనుల రంగాల్లోనూ ఆస్తులు కూడబెట్టాడు.
* చైనాకు చెందిన ఝావ్ యాహి 220 కోట్ల డాలర్లతో జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
* జాబితాలోని పది మందిలో 9 మంది సాంకేతిక రంగం ద్వారా సంపదను పోగేసుకున్నవారు కాగా చైనాకు చెందిన ఝాంగ్ బాంగ్జిన్ ఒక్కరే విద్యకు సంబంధించిన శిక్షణ సేవల విభాగం ద్వారా పైకి ఎదిగారు. అతడు జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
భారత-అమెరికన్ విద్యార్థుల ప్రతిభ
- అమెరికాలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ జియోగ్రఫిక్ బీ-2015’ పోటీలో భారత-అమెరికన్ విద్యార్థి కరణ్ మేనన్ విజేతగా నిలిచాడు. ఇవి 27వ నేషనల్ జియోగ్రఫిక్ బీ పోటీలు.
* తెలుగమ్మాయి శ్రియ యార్లగడ్డ రెండో స్థానంలో నిలిచింది. ఈ పోటీలో మొదటి మూడు స్థానాలనూ భారత సంతతి వారే కైవసం చేసుకున్నారు.
* ఫైనల్స్‌కు చేరిన పదిమందిలో భారత సంతతి వారు ఏడుగురు. వాషింగ్టన్‌లోని నేషనల్ జియోగ్రఫిక్ ప్రధాన కార్యాలయంలో ఈ పోటీలను నిర్వహించారు.
* ‘ప్రతిపాదిత గ్రాండ్ ఇంగా డ్యామ్’ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్లాంట్‌గా రికార్డులకెక్కుతుంది. ఈ డ్యామ్‌ను ఆఫ్రికాలోని ఏ నదిపై ఉన్న ‘ఇంగా ఫాల్స్’ వద్ద నిర్మిస్తారు? అన్న ప్రశ్నకు ‘కాంగో రివర్’ అని సమాధానం చెప్పిన కరణ్ విజేతగా నిలిచాడు.
* అమెరికాలో 11 వేల పాఠశాలల్లో చదువుతున్న 40 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
* 14 ఏళ్ల కరణ్ న్యూజెర్సీలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ పోటీలో గెలుపొందినందుకు అతడికి 85 వేల డాలర్ల కళాశాల ఉపకార వేతనం, నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీలో జీవితకాల సభ్యత్వం, నౌకలో గాలాపగోస్ దీవులకు విహారయాత్ర ఉంటాయి.
* మొదటి రన్నరప్‌గా నిలిచిన 11 ఏళ్ల శ్రియ మిషిగన్‌లో ఆరో తరగతి చదువుతోంది. ఆమెకు 25 వేల డాలర్లు కళాశాల ఉపకార వేతనం లభిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన సోజస్ వాగ్లే (13)కు 10 వేల డాలర్ల కళాశాల ఉపకార వేతనం దక్కుతుంది.
అమెరికా ఎక్స్-37బి విమానం
- అమెరికా సైనిక విభాగం 2015 మే లో ఎక్స్-37బి అనే మానవ రహిత అంతరిక్ష విమానాన్ని అత్యంత రహస్యంగా అంతరిక్షంలోకి పంపింది. ఇప్పటికే ఈ విమానాన్ని మూడుసార్లు అంతరిక్షంలోకి పంపించారు. ఇది నాలుగోసారి. అట్లాస్-V రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
* ఎక్స్-37బి మానవ రహిత అంతరిక్ష విమానాన్ని నాసా తయారు చేసింది. దీని పొడవు 29 అడుగులు. ఎత్తు 9.6 అడుగులు. బరువు 5,000 కిలోలు. డ్రోన్ల తరహాలో దీన్ని పూర్తిగా కంప్యూటర్ల ద్వారా నియంత్రిస్తారు.
* నాసా పాత షటిల్‌ల తరహాలోనే దీన్ని కూడా భూమి చుట్టూ కక్ష్యలో తిరిగి ఆ తర్వాత భూమికి తిరిగి చేరేలా రూపొందించింది. భూమిపైన ఆకాశంలో 177 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల మధ్య ఇది తిరుగుతూ ఉంటుంది. భూమికి తిరిగి వచ్చేటప్పుడు మామూలు విమానం మాదిరి రన్‌వేపై దిగుతుంది.
* మొదట 2010 ఏప్రిల్‌లో దీన్ని నింగిలోకి పంపారు. 225 రోజుల తర్వాత అదే ఏడాది డిసెంబరులో తిరిగి వచ్చింది. రెండోసారి 2011 మార్చిలో పంపారు. అప్పుడు 469 రోజులు తర్వాత 2012 జూన్‌లో భూమికి తిరిగొచ్చింది. మూడోసారి 675 రోజులపాటు అంతరిక్షంలో తిరుగాడిన ఈ విమానం గత అక్టోబరులో నేలకు తిరిగొచ్చింది.
80 లక్షల మంది భూకంప ప్రభావితులు
- 2015, ఏప్రిల్ 25న నేపాల్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రభావానికి 80 లక్షల మంది గురైనట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 14 లక్షల మంది ప్రజలు ఆహారం, నీరు, గుడారాల కొరత ఎదుర్కొన్నట్లు తెలిపింది. నేపాల్ భూకంపం ధాటికి ఆ దేశ వ్యాప్తంగా లక్షా 60 వేలకు పైగా ఇళ్లు నేల మట్టమైనట్లు ప్రకటించింది.
* నేపాల్ కేంద్రంగా చోటు చేసుకున్న భారీ భూకంపం భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. నేపాల్‌ను ఆనుకుని ఉన్న బిహార్‌లో ఎక్కువ తీవ్రత ఉంది. పశ్చిమ్‌బంగ, ఉత్తర్‌ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భూకంపం ప్రభావం కనిపించింది.
* నేపాల్‌కు పర్వతాల దేశంగా పేరుంది. హిందూ దేవాలయాలకు కొలువు నేపాల్. ‘యజమాన లింగం’గా పేరొందిన పశుపతినాథ ఆలయం రాజధాని కాఠ్మండూలో ఉంది.
అధ్యయన విశేషాలు
* భూకంపాల సమయంలో వెలువడే సిస్మిక్ తరంగాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీగా అంటా రు. భూకంపాల తీవ్రతను భూకంప లేఖిని (సిస్మోగ్రాఫ్) అనే పరికరంతో నమోదు చేస్తారు. తీవ్రతను ‘మాగ్నిట్యూడ్’ రూపంలో కొలుస్తారు. నమోదు చేసే రికార్డింగ్‌ను సిస్మోగ్రామ్గా పిలుస్తారు.
* 1857లో ఆర్.మ్యాలెట్ అనే ఐరిష్ ఇంజినీర్ ఇటలీ వెళ్లి, నేపుల్స్ వద్ద వచ్చిన భూకంప నష్టం తీవ్రత అధ్యయనం చేశారు. ఇది భూకంపాలపై జరిగిన మొదటి పూర్తిస్థాయి అధ్యయనం.
* 1875లో ఎఫ్ కెచ్చి అనే శాస్త్రవేత్త నిర్మించిన భూకంపలేఖిని తొలిసారిగా ప్రకంపనలును నమోదు చేసింది.
* 1970లలో తొలి డిజిటల్ సిస్మోగ్రాఫ్‌లను ఏర్పాటు చేశారు.
భారీ భూకంప ఫలితాలు
* దక్షిణ చిలీలోని వాల్దీవియా భూకంపం కారణంగా సునామీ రావడంతో దక్షిణ చిలీ, హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్, తూర్పు న్యూజిలాండ్, ఆగ్నేయ ఆస్ట్రేలియా, అలస్కాలోని అల్యూటియన్ దీవులపై ప్రభావం పడింది.
* హిందూ మహా సముద్రం అడుగుభాగంలో.. సుమత్రా పశ్చిమతీరంలో సంభవించిన భూకంపం వల్ల హిందూ మహాసముద్ర తీరం వెంబడి ఉన్న పలు దేశాల తీరాలను సునామీ ముంచెత్తింది. అత్యంత ప్రాణాంతక ప్రకృతి విపత్తుగా చరిత్రకెక్కింది. ఇండోనేసియా తీవ్రంగా దెబ్బతినగా శ్రీలంక, భారత్, థాయ్‌లాండ్, మాల్దీవులు, సోమాలియా తర్వాతి వరుసలో నిలిచాయి.
* రష్యా కంచాట్క ద్వీప కల్పం తూర్పు తీర ప్రాంతాల్లో 1737, 1923, 1952ల్లో కూడా భూకంపాలు సంభవించాయి.
మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల బ్రస్సెల్స్‌లోని ఐరోపా పార్లమెంటులో ‘యోగ ప్రాశస్త్యం’పై ప్రసంగించిన భారత ప్రముఖుడెవరు?
ఎ) బాబా రాందేవ్ బి) రవిశంకర్ సి) మహేష్ యోగి డి) జగ్గి వాసుదేవ్
జ: (బి)
2. ప్రతిష్ఠాత్మక ‘హీంజ్ అవార్డ్ ఫర్ టెక్నాలజీ, ద ఎకానమీ, అండ్ ఎంప్లాయ్మెంట్’ను 2015 సంవత్సరానికి గెలుచుకున్న భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్తను గుర్తించండి.
ఎ) సంగీత భాటియా బి) మనోజ్ఞి కిరణ్ సి) పావని పరికర్ డి) సీతా దండేకర్
జ: (ఎ)
3. న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైన తొలి భారత సంతతి మహిళ ఎవరు?
ఎ) రేణు మల్హోత్రా బి) కీర్తి కన్నన్ సి) శ్వేతా శేఖర్ డి) రాజ రాజేశ్వరి
జ: (డి)
4. వివాదాస్పద ‘క్లింటన్ క్యాష్’ పుస్తక రచయితను గుర్తించండి.
ఎ) హ్యారీ అట్వెల్ బి) విలియం హెన్రీ సి) పీటర్ ష్వెయిజర్ డి) జార్జి రోజర్స్
జ: (సి)
5. అమెరికా ప్రతిష్ఠాత్మక కళలు, శాస్త్ర సాంకేతిక పరిషత్తులో ఇటీవల చోటు సంపాదించిన భారత అమెరికన్లను గుర్తించండి.
ఎ) సంజీవ్ అరోరా, సంగీత భాటియా
బి) రేణు మల్హోత్రా, రవీంద్రన్ కన్నన్
సి) జానొదేవ్ చౌధురి, స్వాతి వరుణ్
డి) ఎ, బి
జ: (డి)
Leave a Reply